EPFO News: ఈపీఎఫ్‌వో రెండు నాల్కల ధోరణితో చందాదార్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు అవసరం లేదన్న నిబంధనను ఇప్పుడు తెర పైకి తెచ్చి ఇటు ఉద్యోగులను, అటు పెన్షనర్లను ఇబ్బంది పెడుతోంది EPFO. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సంతోషంలో ఉన్నవాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతోంది. 

ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అధిక పెన్షన్‌ పొందేందుకు, సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వడానికి మరోసారి అవకాశం కల్పించిన EPFO.. 26(6) పేరా పేరిట ఒక కొత్త మెలిక పెట్టింది. తద్వారా, చాలా ఎక్కువ మందిని అధిక పెన్షన్‌కు అనర్హులుగా మార్చేందుకు చూస్తోంది. 

ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తుంటే, అధిక వేతనంపై చందా చెల్లించేందుకు EPF చట్టంలోని పేరా 26(6) కింద ఉద్యోగి-యజమాని సంయుక్తంగా EPFO అనుమతి పొందారా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. వాస్తవానికి, అధిక వేతనంపై చందా చెల్లింపు కోసం 26(6) కింద చాలా మంది ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వలేదు. అసలు చాలా మందికి ఈ సంగతి కూడా తెలీదు. ఈ కాలమ్‌లో సంబంధిత వివరాలు నమోదు చేసి, ఆధారాన్ని జత చేస్తేనే దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగుతోంది, లేదంటే అక్కడితో ఆగిపోతోంది.

ఏంటీ 26 (6) పేరా నిబంధన?
EPFO చట్టంలోని రూల్స్‌ ప్రకారం… గరిష్ట పరిమితికి మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు, ఇస్తున్న యజమాన్యాలు కలిసి, వాస్తవ వేతనం (వాస్తవిక మూల వేతనం + DA) మీద 12 శాతం చొప్పున చందా చెల్లించేందుకు EPFO పేరా 26(6) కింద దరఖాస్తు చేసుకోవాలి. అధిక వేతనంపై చందా చెల్లించడానికి ఉద్యోగి, యజమాని ఉమ్మడిగా అంగీకరిస్తున్నామని, ఇందుకు అవసరమైన ఫీజులు చెల్లిస్తామని చెబుతూ అప్లికేషన్‌ పెట్టుకోవాలి, అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఇలాంటి అనుమతి పొందిన వాళ్లనే, ఇప్పుడు అధిక పెన్షన్‌ పొందేందుకు అర్హులుగా EPFO నిర్ణయిస్తోంది. మిగిలినవాళ్లను అనర్హులుగా చూస్తోంది. ఒక విధంగా, సుప్రీంకోర్టు తీర్పునకు గండి కొట్టే ప్రయత్నం చేస్తోంది.

వాస్తవిక వేతనంపై ఏళ్ల తరబడి ఉద్యోగి, యజమాని చెరో 12 శాతం చందా చెల్లించినప్పుడు అంగీకరించి, దాని మీద ఫీజులు వసూలు చేసి, EPF మొత్తంపై వడ్డీ కూడా చెల్లించిన EPFO, 26(6) పేరా కింద అనుమతి ఉందా అని ఇప్పుడు ప్రశ్నించడమేంటని ఉద్యోగులు, పింఛనుదార్లు ప్రశ్నిస్తున్నారు. పోనీ ఇప్పుడు ఆ ఆప్షన్‌ ఇద్దామన్నా అవకాశం లేదు. దీంతో.. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పని చేస్తున్న, చేసిన లక్షలాది మంది EPFO వైఖరి వల్ల అధిక పింఛను అవకాశం కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. 

రెండు నాల్కల ధోరణి
2017 మార్చి 23న, 2019 జనవరి 22న ఇచ్చిన ఆదేశాల్లో… 26(6) పేరా కింద అధిక వేతనంపై చందా చెల్లించేందుకు ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రాంతీయ కమిషనర్లకు EPFO సూచించింది. ఇప్పుడు మాత్రం ఈ ఆప్షన్‌ ఇచ్చి ఉండాలన్న నిబంధన పెట్టి ఇబ్బందులు పెడుతోంది. అర్హులైన వారి సంఖ్యలో కోత పెట్టేందుకు EPFO ఇలా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *