RBI Launches UDGAM For Unclaimed Deposits: దశాబ్దాల తరబడి బ్యాంకుల్లో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను (ఎవరూ క్లెయిమ్‌ చేయని) వాటి హక్కుదార్లు అప్పగించడానికి ఒక సెంట్రలైజ్డ్‌ వెబ్‌ పోర్టల్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ లాంచ్‌ చేసింది. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి మరిచిపోయిన, కుటుంబ సభ్యులకు తెలీని పెట్టుబడుల గురించి ఈ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. గతంలో, విడివిడిగా ఒక్కో బ్యాంక్‌ సైట్‌లోకి వెళ్లి సెర్చ్‌ చేయాల్సి వచ్చేది. పదుల సంఖ్యలో ఉన్న బ్యాంక్‌ సైట్లలోకి వెళ్లి సెర్చ్‌ చేయడం చాలా శ్రమతో పాటు కాలయాపనతో కూడిన పని. ఇప్పుడు, కొత్త పోర్టల్‌ ద్వారా ఒకేచోట ఆ వివరాలన్నీ తెలుస్తాయి.

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవడం సులభం
ఉద్గం (Unclaimed Deposits – Gateway to Access inforMation) పేరిట, గురువారం (17 ఆగస్టు 2023) నాడు, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్‌లో కనిపిస్తాయి. డిపాజిటర్‌ పేరు, ఊరు వంటి వివరాలతో సెర్చ్‌ చేస్తే, ఆ వ్యక్తికి ఏదైనా బ్యాంక్‌లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌ ఉంటే తెలుస్తుంది. తద్వారా ఆ డిపాజిట్‌ను క్లెయిమ్‌ చేయడం సులభం అవుతుంది.

ప్రస్తుతానికి, ఉద్గం పోర్టల్‌లో 7 బ్యాంకులు చేరాయి. అవి… స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, DBS బ్యాంక్‌ ఇండియా, సిటీ బ్యాంక్‌. ఈ 7 బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలను ఉద్గం పోర్టల్‌లో చూడవచ్చు. మిగతా బ్యాంకులను కూడా ఈ పోర్టల్‌కు లింక్‌ చేసే ప్రాసెస్‌ జరుగుతోంది. ఈ ఏడాది అక్టోబరు 15 కల్లా, దశలవారీగా అన్ని బ్యాంకులను ఉద్గం పోర్టల్‌లో అందుబాటులోకి తెస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది.

10 సంవత్సరాలకు మించి, ఎవరూ క్లెయిమ్‌ చేసుకోకుండా బ్యాంకుల్లో ఉండిపోయిన డిపాజిట్లను అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లుగా పిలుస్తారు. బ్యాంక్‌ ఖాతాలు, పథకాల్లో డబ్బులు డిపాజిట్‌ చేసి మరిచిపోవడం, లేదా, డిపాజిట్‌ చేసిన వ్యక్తి హఠాత్తుగా మరణించడం వల్ల వాటి గురించి కుటుంబ సభ్యులకు తెలీకపోవడం అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు కారణం.

రూ.36 వేల కోట్ల అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు
ఈ ఏడాది మార్చి 31 నాటికి, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 36,185 కోట్ల అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌’కు బదిలీ చేశాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రకటించింది. 2019 మార్చి 31 నాటికి ఈ మొత్తం రూ. 15,090 కోట్లు మాత్రమే. అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లలో రూ. 8,086 కోట్లతో స్టేట్‌ బ్యాంక్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (రూ. 5,340 కోట్లు), కెనరా బ్యాంక్‌ (రూ. 4,558 కోట్లు), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (రూ. 3,904 కోట్లు) ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి, ప్రైవేట్ బ్యాంకులు రూ. 6,087 కోట్లను ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌’ బదిలీ చేశాయి. 

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు పెరుగుతుండడంతో, ఆ డబ్బులను సొంతదార్లకు అప్పగించడానికి కేంద్ర బ్యాంక్‌ చర్యలు తీసుకుంది. క్లెయిమ్ చేయని డిపాజిట్లను ట్రాక్ చేయడానికి సెంట్రలైజ్డ్‌ వెబ్ పోర్టల్‌ను డెవలప్‌ చేస్తున్న ఈ ఏడాది ఏప్రిల్ 6న RBI ప్రకటించింది.

మరో ఆసక్తికర కథనం: షాక్‌ ఇచ్చిన సిల్వర్ – ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial      



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *