National
-BBC Telugu

Click here to see the BBC interactive
భారతదేశంలో ఒక ఇంటి సరకుల కంపెనీ విషయంలో వివాదం.. ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ వ్యాపార సంస్థ అమెజాన్‌కు, భారతదేశపు అతిపెద్ద కంపెనీ రిలయన్స్ సంస్థకు మధ్య గొడవకు దారితీసింది.
భారతదేశానికి చెందిన రిటైల్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌తో ఈ రెండు కంపెనీలూ వేర్వేరుగా ఒప్పందాలు చేసుకోవటమే ఈ వివాదానికి మూలం.
ఈ రెండు సంస్థల న్యాయ పోరాటం.. భారతదేశంలో రాబోయే సంవత్సరాల్లో ఈ-కామర్స్ అభివృద్ధి రూపురేఖలు ఎలా ఉంటాయనేది నిర్ణయిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు.
”ఇది భారీ వ్యవహారమని నేను భావిస్తున్నా. అమెజాన్ ఇప్పటివరకూ ఎక్కడా ఇటువంటి ప్రత్యర్థిని ఎదుర్కోలేదు’’ అని ఫారెస్టర్ అనే కన్సల్టెన్సీకి చెందిన సీనియర్ విశ్లేషకుడు సతీశ్ మీనా బీబీసీతో చెప్పారు.
అమెజాన్ సంస్థ వల్ల దాని వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలో అతి పెద్ద సంపన్నుడయ్యారు. (ఆయనకు ఇప్పుడు ఆ హోదా లేదు). ప్రపంచ వ్యాప్తంగా రిటైల్ వ్యాపారాన్ని ఆ కంపెనీ పూర్తిగా మార్చేసింది.
భారతదేశపు నంబర్ వన్ సంపన్నుడు, రిలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముకేశ్ అంబానీకి కూడా అదే తరహాలో మార్కెట్ తీరుతెన్నులను మార్చేసిన చరిత్ర ఉంది. అంబానీ రిటైల్ వాణిజ్య ప్రణాళికలు అమెజాన్, వాల్‌మార్ట్ (ఫ్లిప్‌కార్ట్ యజమాని) సంస్థలకు సవాలుగా మారుతుందని ఈ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెజాన్ భారతదేశంలో తన ఉనికిని ఉధృతంగా విస్తరిస్తోంది. ఇక్కడ పెరుగుతున్న ఈ-కామర్స్ మార్కెట్ ద్వారా లబ్ధి పొందాలని ఆ సంస్థ ఆశిస్తోంది. రిలయన్స్ సంస్థ కూడా తన ఈ-కామర్స్, నిత్యావసర సరకుల వ్యాపారాలు రెండిటినీ విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఫ్యూచర్ గ్రూప్ విషయంలో పోట్లాట ఏమిటి?
ఫ్యూచర్ గ్రూప్ 340 కోట్ల డాలర్ల విలువైన తన రిటైల్ ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించటానికి ఈ ఏడాది ఆరంభంలో ఒప్పందం చేసుకుంది.
అయితే 2019 నుంచి ఫ్యూచర్ కూపన్స్ లో అమెజాన్ సంస్థకు 49 శాతం వాటా ఉంది. దీనివల్ల ఫ్యూచర్ రిటైల్ సంస్థ మీద అమెజాన్‌కు పరోక్ష యాజమాన్య వాటా లభిస్తుంది.
అందువల్ల.. ఫ్యూచర్ గ్రూప్ తన వాటాను రిలయన్స్ సహా కొన్ని భారతీయ సంస్థలకు విక్రయించటానికి వీలు లేదని అమెజాన్ వాదిస్తోంది.
ప్రధానంగా రిటైల్ దుకాణాల చైన్ వ్యాపారమైన ఫ్యూచర్ రిటైల్ సంస్థ.. కరోనావైరస్ మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతినింది. కంపెనీ మునిగిపోకుండా ఉండటానికి రిలయన్స్ సంస్థతో ఒప్పందం అవసరమని ఆ సంస్థ వాదిస్తోంది.
ఈ వివాదంలో కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ఫ్యూచర్ గ్రూప్‌కు అనుకూలంగా వచ్చింది. రిలయన్స్ సంస్థకు విక్రయాన్ని నిలుపుదల చేస్తూ అంతకుముందు వారం ఇచ్చిన ఆదేశాన్ని దిల్లీ హైకోర్టు తిరగరాసింది. ఆ విక్రయం చెల్లుతుందని చెప్పింది.
దీనిపై అమెజాన్ సంస్థ అప్పీలుకు వెళ్లింది.

దేనికోసం ఈ పోరాటం?
రిలయన్స్ కొనుగోలు కొనసాగేలా అనుమతించినట్లయితే.. ఆ సంస్థ రిటైల్ విభాగానికి దేశవ్యాప్తంగా 420కి పైగా నగరాల్లోని 1,800కు పైగా రిటైల్ స్టోర్లు ఆ సంస్థకు అందుబాటులోకి వస్తాయి. అలాగే ఫ్యూచర్ గ్రూప్‌కి చెందిన హోల్‌సేల్ వ్యాపారం, మౌలికసదుపాయాల విభాగం కూడా రిలయన్స్‌కు లభిస్తాయి.
”రిలయన్స్ సంస్థకు డబ్బు ఉంది. ప్రభావం ఉంది. ఈ మార్కెట్లో అవి అవసరం. అయితే ఈ-కామర్స్ వ్యాపారంలో వారికి విశిష్ట నైపుణ్యం లేదు’’ అంటా మీనా.
అమెజాన్ సఫలమైతే.. ఈ-కామర్స్ రంగంలో తన పోటీదారు ప్రణాళికలను నెమ్మదింపజేస్తూ తను పై చేయి సాధించవచ్చు.

విదేశీ సంస్థలకు ఇబ్బందులు: విశ్లేషణ
అభివృద్ధికి చిట్టచివరి సరిహద్దుగా అభివర్ణించే ఈ- కామర్స్ మార్కెట్ విషయమై ఇద్దరు ప్రపంచ కుబేరుల మధ్య పతాక స్థాయిలో సాగుతున్న పోరాటం.. ఈ రంగం వారికి ఎంత కీలకమైనదో చాటుతోందని.. బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇనాందార్ పేర్కొన్నారు. విదేశీ సంస్థలు భారతదేశంలో వ్యాపారం చేయటం ఎంత కష్టంగా మారుతోందో కూడా ఈ వివాదం చూపుతోందని ఆమె విశ్లేషించారు.
విదేశాల్లోని మధ్యవర్తి సంస్థలు ఇచ్చిన ఆదేశాలను భారతదేశంలోని తమ భాగస్వామ్య సంస్థలు పాటించేలా చేయలేకపోతున్న ప్రఖ్యాత విదేశీ కంపెనీల జాబితాలోకి అమెజాన్ తాజాగా వచ్చి చేరింది. స్థానిక కోర్టుల నుంచి
ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలైన కెయిర్న్ ఎనర్జీ పీఎల్సీ, టెలికాం దిగ్గజం వొడాఫోన్ల మీద పన్ను వివాదం కేసులకు సంబంధించి.. మధ్యవర్తిత్వ తీర్పుల్లో భారతదేశం ఇటీవలే ఓడిపోయింది. అయితే వొడాఫోన్ విషయంలో ఇచ్చిన తీర్పును భారత్ సవాల్ చేసింది.
”ఈ పరిస్థితిని, ఈ తరహా పరిణామాలను విదేశీ పెట్టుబడిదారులు నిస్పృహతో వీక్షిస్తుంటారనే దాంట్లో సందేహం లేదు. ఈ నిర్ణయం.. పెట్టుబడులు పెట్టటానికి, వ్యాపారం చేయటానికి భారతదేశం ఆధారపడదగ్గ ప్రాంతమనే దానికి ప్రతికూల సంకేతాలు పంపుతుంది’’ అని ఆసియా ఫసిఫిక్ ఫౌండేషన్ ఆఫ్ కెనడాలో డిస్టింగ్విష్డ్ ఫెలో రూపా సుబ్రమణ్య బీబీసీతో పేర్కొన్నారు.
అమెజాన్ సంస్థ పెద్దగా పోరాడకుండానే వదిలేసుకోవచ్చు. అందుకు కారణం.. విశ్లేషకులు అభివర్ణిస్తున్నట్లు ఈ కొనుగోలు వల్ల రిలయన్స్ సంస్థకు ”సాటిలేని పైచేయి’’ లభిస్తుండటం కాదు.
రిలయన్స్ వంటి స్వదేశీ సంస్థతో పోటీ పడుతుండటం వల్ల.. ఈ మైదానం ఇప్పటికే అమెజాన్‌కు సమానంగా లేదు. విదేశీ ఈ-కామర్స్ సంస్థలు తమ సొంత దుకాణాలను తెరవటానికి కానీ, ప్రైవేటు సంస్థల ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మటానికి వీలులేదని ప్రభుత్వ నిబంధనలు నిషేధిస్తున్నాయి. ఇది స్థానిక రిటైలర్లకు అనుకూలంగా ఉండే రక్షనాత్మక విధానంగా పరిగణిస్తారు.
డాటా వినియోగంలో నిబంధనలు కఠినతరం అవుతుండటం, స్వయం సమృద్ధి సాధించాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్తున్న పిలుపుల కారణంగా అమెజాన్‌కు ఇప్పటికే భారతదేశంలో ప్రతికూలత పెరుగుతోంది.

ఈ తరహా మార్కెట్ మరోటి లేదు…
అమెజాన్, రిలయన్స్ సంస్థలు భారత మార్కెట్ కోసం పరస్పరం తలపడటానికి సంసిద్ధంగా ఉండటానికి కారణం.. ఈ మార్కెట్ వృద్ధి చెండటానికి గల సాటిలేని సామర్థ్యం.
”ఆ సంస్థలకు అమెరికా, చైనా తర్వాత ఈ తరహా అవకాశాన్ని ఇచ్చే మార్కెట్ మరేదీ లేదు’’ అంటారు మీనా.
భారతదేశపు రిటైల్ రంగం విలువ దాదాపు 85,000 కోట్ల డాలర్లు ఉంటుందని.. కానీ ప్రస్తుతం ఈ-కామర్స్ విలువ అందులో చాలా చిన్న భాగమేనని ఆయన చెప్పారు. అయితే.. భారత ఈ-కామర్స్ మార్కెట్ ఏటా 25.8 శాతం చొప్పున పెరుగుతూ 2023 నాటికి 8,500 కోట్ల డాలర్లకు చేరుతుందని ఫారెస్టర్ సంస్థ జోస్యం చెప్తోంది.
ఫలితంగా ఈ-కామర్స్ రంగంలో పోటీ అంతకంతకూ పెరుగుతోంది. పోటీదారులూ పెరుగుతున్నారు. అమెజాన్‌కు అదనంగా వాల్‌మార్ట్ సంస్థ స్వదేశీ ఈ-కామర్స్ బ్రాండ్ ఫ్లిప్‌కార్ట్‌తో జట్టుకట్టింది. చివరికి ఫేస్బుక్ కూడా రంగంలోకి దిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో ప్లాట్‌ఫామ్‌లలో 9.9 శాతం వాటా కోసం 5,700 కోట్ల డాలర్లు చెల్లించింది.

‘ఆహారం’ కోసం పోరాటం
రిటైల్ ఇండియాలో ఆహార వస్తువులు అతి పెద్ద అంశం. ఎందుకంటే ఇక్కడ చేసే వ్యయంలో ఆహార వస్తువుల కోసమే దాదాపు సగం వెచ్చిస్తారు. అయితే.. ఈ-కామర్స్ వ్యాపారంలో ప్రధాన వాటా స్మార్ట్ ఫోన్ల వంటి పాడైపోని వస్తువలది.
కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆహార వస్తువుల దిశగా ఈ-కామర్స్ ప్రయాణించటం వేగవంతమైంది. భారతదేశంలో అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన లాక్డౌన్ విధించటమూ దీనికి ఒక కారణం.
”జనం ఇళ్లలో చిక్కుకుపోయారు. కాబట్టి మరింత ఎక్కువ మంది ఆన్లైన్ సేవలను ఉపయోగించటం మొదలుపెట్టాల్సి వచ్చింది’’ అని బిజెనెస్ కన్సల్టెన్సీ సంస్థ ఏటీ కీర్నీస్ సంస్థలో కన్స్యూమర్ అండ్ రిటైల్ ఫర్ ఏసియా విభాగం అధిపతి హిమాంశు బజాజ్ పేర్కొన్నారు.
”ఈ ఆహార వస్తువులు అనేది ప్రధాన యుద్ధ రంగంగా మారుతోంది. కోవిడ్ కారణంగా ఆ యుద్ధం మరింత వేగంగా ముందుకొచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)