National
oi-Rajashekhar Garrepally
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలంటూ పలువురు డీఎంకే నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కోరుతుండటం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ నియోజకవర్గంలోని బీజేపీ, అన్నాడీఎంకే అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలంటూ ప్రత్యర్థి పార్టీ డీఎంకే నేతలు సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు.
శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అభ్యర్థుల తరపున మధురై, కన్యాకుమారిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డీఎంకే నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ.. మీరు కుంభం నియోజకవర్గంలో ప్రచారం చేయండి. నేను ఈ ప్రాంతంలో డీఎంకే తరపున బరిలో ఉన్నాను. నేను భారీ తేడాతో విజయం సాధించేందుకు మీ ప్రచారం సహకరిస్తుంది’ అని రామక్రిష్టన్ ట్వీట్ చేశారు.

తాను తిరువణ్ణమలై స్థానం నుంచి బరిలో ఉన్నానని, ఆ స్థానంలో ప్రచారం చేయండంటూ ఈవీ వేలు అనే మరో డీఎంకే నేత ట్వీట్ చేశారు. వీరితోపాటు అనితా రాధాక్రిష్టన్, సెల్వరాజ్ కే, అంబేత్ కుమార్ వంటి తదితర నేతలు కూడా ఇదే తరహాలో సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.
Dear Prime Minister @narendramodi, please campaign in Hosur. I am the DMK candidate here and it will help me in widening my winning margin. Thank you sir.
— Y Prakash MLA (@yprakash_mla) April 2, 2021
అన్నాడీఎంకే అభ్యర్థి, తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి తరపున ప్రచారం చేయాలని డీఎంకే అభ్యర్థి కార్తికేయ శివసేనాపతి ప్రధాని మోడీని కోరారు. మీరు ఆయనకు మద్దతు ఇస్తే.. నాకు ప్రయోజనం ఉంటుందంటూ ట్వీట్ చేశారు. ఇలాగే మరికొంతమంది డీఎంకే నేతలు కూడా సరికొత్త రీతిలో విమర్శలు చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 6న 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలు విడుదల కానున్నాయి.
Dear Prime Minister Mr.Narendra Modi.. Please campaign for TKM Chinnayya. I am the DMK candidate aganist him and it will be very useful in widening my winning margin.Thank you sir.@narendramodi @arivalayam @DMKITwing @DMKKanchipuram
— S.R.RAJA (@srrajamla) April 2, 2021
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. కమల్ హాసన్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు మరింత ఉత్కంఠగా సాగనున్నాయి.