National
oi-Chandrasekhar Rao
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఎవ్వర్నీ వదలట్లేదు. రాజకీయ నాయకులు, సినీ స్టార్స్, క్రీడాకారులనే తేడాలేవీ చూపించట్లేదు. అందరిపైనా పంజా విసురుతోంది. సెకెండ్ వేవ్‌లోనూ పలువురు రాజకీయ నాయకులు కరోనా వైరస్ బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. సచిన్ టెండుల్కర్ కూడా ఇందులో మినహాయింపేమీ కాదు. కరోనా వైరస్ బారిన పడ్డ ఈ మాస్టర్ బ్లాస్టర్.. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. తనకు కరోనా వైరస్ సోకిందని చెప్పారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని పేర్కొన్నారు. వెంటనే తాను హోమ్ ఐసొలేషన్‌కు వెళ్లానని అన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలన్నింటినీ పాటిస్తున్నానని వివరించారు. తన అభిమానులు, సినిమా ప్రేక్షకుల ఆశీర్వాదంతో త్వరలోనే తాను ఈ మహమ్మారి బారి నుంచి కోలుకుంటానని చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఇదివరకు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, పరేష్ రావెల్, కార్తీక్ ఆర్యన్, రణ్‌బీర్ కపూర్, రోహిత్ ష్రాఫ్ వంటి బాలీవుడ్ నటులు కరోనా వైరస్ బారిన పడి, కోలుకున్న వారే.

ప్రస్తుతం ఆలియాభట్ రౌద్రం రణం రుథిరం (ఆర్ఆర్ఆర్) మూవీలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు జంటగా ఒలివియా మోరీస్, అలియా భట్ నటిస్తున్నారు. ఇటీవలే ఆలియాభట్ లుక విడుదలైంది. ఆమె క్యారెక్టర్‌ను చిత్రం యూనిట్ రివీల్ చేసింది. ఈ మూవీలో సీత పాత్రలో ఆలియా నటిస్తోంది. బాలీవుడ్లె గంగూబాయ్ కథియావాడీ మూవీలో టైటిల్ పాత్రలో నటిస్తోంది ఆలియా. జులై 30న ఈ మూవీ విడుదల కానుంది.
సెకెంండ్ వేవ్‌లో కరోనా వైరస్ మహారాష్ట్రలో అడ్డు, అదుపు లేకుండా విజృంభిస్తోంది. మహారాష్ట్ర వైద్యాధికారులు గురువారం రాత్రి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..కొత్తగా 43,183 పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే రికార్డు స్థాయిలో 8,646 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. సెకెండ్ వేవ్ ఆరంభమైన తరువాత ముంబైలో 24 గంటల వ్యవధిలో ఈ రేంజ్లో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,23,360కు చేరింది.