International
-BBC Telugu

ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ తీసుకున్న కొందరికి మెదడులో అసాధారణంగా రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. ఈ రకమైన ”సెరెబ్రల్ వెనస్ సైనస్ థ్రోమ్బోసెస్” (సీవీఎస్టీ) కేసులు కనపడటంతో ఈ వ్యాక్సీన్ ఇవ్వడాన్ని జర్మనీ, ఫ్రాన్స్, కెనడా లాంటి దేశాలు కొంత వరకు నియంత్రించాయి.
కానీ, ఈ వ్యాక్సీన్ వల్ల కలిగే ముప్పు కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎమ్ఏ) అంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఔషధ నియంత్రణ అధికారులు ఈ వ్యాక్సీన్ వల్ల నిజంగానే రక్తపు పోటు వస్తోందా.. దీని వల్ల కలిగే ముప్పు ఎంత ఎక్కువగా ఉండొచ్చు.. వ్యాక్సీన్ కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం పడుతుంది లాంటి అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
వ్యాక్సీన్ వల్ల రక్తం గడ్డ కడుతుందా?
ప్రస్తుతానికి ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇది ఇంకా నిరూపితం కాలేదు కానీ, అలా జరిగే అవకాశం ఉందని ఈ వ్యాక్సీన్ డేటాను పరిశీలిస్తున్న యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ అంటోంది.
రక్తం గడ్డకట్టడం అనేది ఈ వ్యాక్సీన్ వల్ల కలిగిన ప్రతికూల ప్రభావమా లేదా అది సహజంగా జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
అయితే, కొన్ని అరుదైన సంఘటనల్లో మాత్రమే జరిగిన వీటిపై ఒక తుది నిర్ణయానికి రావడం కూడా కష్టమైన పనే.
మరో వైపు, వ్యాక్సీన్ తీసుకున్న ప్రతీ 10,000 మందిలో ఒకరికి రక్తం గడ్డకట్టడం చూస్తుంటే దీనికి సమాధానం దొరికింది.
నేను కొంత మంది శాస్త్రవేత్తలతో మాట్లాడాను. వారు.. రక్తం గడ్డ కట్టిన సమయంలో ప్లేట్లెట్లు తగ్గిపోవడం, రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన యాంటీబాడీలు కనిపించడం వంటివి చెప్పారు.
అయితే, కొంతమంది మాత్రం దీనికి తగిన ఆధారాలు లేవని, కోవిడ్ వల్ల కూడా ఇలా జరుగుతూ ఉండవచ్చని అంటున్నారు.

దీంతో ముప్పు ఎంత ఎక్కువ?
వ్యాక్సీన్ల వాళ్ళ మెదడులో రక్తం గడ్డ కడుతుందనేది ఇంకా నిర్ధరణ కాకపోవడంతో అప్పుడే ముప్పును గురించి చెప్పలేం.
జర్మనీలో 27 లక్షల మందికి వ్యాక్సీన్ ఇవ్వగా అందులో 31 మందికి రక్తం గడ్డకట్టి, 9 మంది మరణించినట్లు పాల్ ఎర్లిక్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.
యూకెలో 1.8 కోట్ల మందికి వ్యాక్సీన్ ఇవ్వగా రక్తంలో ప్లేట్లెట్లు తగ్గి 30 మందికి రక్తం గడ్డ కట్టి 7 గురు మరణించినట్లు యూకెలో లభించిన సమాచారం చెబుతోంది.
ప్రతి 100,000 మందిలో ఒకరికి ఇలా వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టే ముప్పు ఉందని ప్రపంచవ్యాప్తంగా డేటాను పరిశీలించిన యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ చెబుతోంది.
అయితే, మెదడులో రక్తం గడ్డ కట్టడానికి అసలైన కారణాలేమిటో కచ్చితంగా చెప్పలేమని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ సేఫ్టీ మానిటరింగ్ హెడ్ డాక్టర్ పీటర్ ఆర్లెట్ చెప్పారు.
ప్రతీ సంవత్సరం ప్రతీ 10 లక్షల మందిలో రెండు కేసుల నుంచి 16 కేసుల వరకు వస్తున్నట్లు అంచనాలు ఉన్నప్పటికీ, కరోనావైరస్ వల్ల కూడా రక్తం గడ్డ కట్టడం జరుగుతూ ఉండవచ్చని అన్నారు.
ఎందుకీ వ్యత్యాసం?
ఒకవేళ వ్యాక్సీన్ వల్లే ఈ రక్తం గడ్డ కట్టడం జరుగుతూ ఉంటే వివిధ దేశాల్లో నమోదయ్యే కేసుల సంఖ్య ఒకేలా ఉండాలి. కానీ జర్మనీ కంటే ఏడు రెట్లు ఎక్కువ మందికి వ్యాక్సీన్ ఇచ్చిన యూకెలో కూడా జర్మనీతో సమానంగా కేసులు నమోదయ్యాయి.
అయితే, వ్యాక్సీన్ తీసుకుంటున్న వారిలో వ్యత్యాసాలు ఉన్నాయనే వాదన కూడా ఉంది.
యూకెలో ముందుగా వృద్దులకు వ్యాక్సీన్ ఇస్తుంటే, జర్మనీలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ తీసుకున్న వారిలో 90 శాతం మంది 60 ఏళ్ళు లోపు వారే ఉన్నారు.
చిన్న వయస్సు వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో వారిలో ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా కనిపించడం వల్ల యూకెలో తక్కువ కేసులు ఉండటానికి కారణమని భావిస్తున్నారు.
ఇదంతా తెలుసుకోవడం సవాళ్లతో కూడుకున్న పని. కానీ, వయసు, లింగం, వ్యక్తుల ఆరోగ్యం ప్రకారం ప్రత్యేకమైన ముప్పు కారకాలేవీ లేవని ఇ ఎమ్ ఏ చెబుతోంది.
ఆస్ట్రాజెనెకా తీసుకోవడం సురక్షితమేనా?
వైద్యంలో ఏదీ పూర్తిగా సురక్షితమే అని చెప్పడానికి లేదు. కొన్ని సార్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని విషపూరితమైన చికిత్సలు కూడా చేస్తారు.
కెమోథెరపి వల్ల కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. కానీ, ఆ చికిత్స చేయించుకోవడం చాలా అవసరమైనది.
అలాగే పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ లాంటి వాటి మందుల వల్ల కూడా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అవి అరుదుగా జరుగుతుంటాయి.
ఈ మహమ్మారి సమయంలో ఈ పరిస్థితి చాలా సవాళ్లను విసురుతోంది.
ఒక కొత్త ఔషధాన్ని ఎక్కువ మంది జనాభాకు ఇస్తున్నప్పుడు ఆ మందు సురక్షితమనే ముందు జాగ్రత్త నియమాన్ని పాటించాలి. కానీ, మహమ్మారి సమయంలో చేసే ఏ చిన్న జాప్యమైనా జీవితాలనే హరిస్తుంది.
10 లక్షల మందికి వ్యాక్సీన్ ఇస్తే అందులో 12 మందికి రక్తంలో గడ్డలు కనిపించగా, అందులో నలుగురు మరణించినట్లు జర్మనీలో లభించిన డేటా చెబుతోంది.
కానీ, 60 సంవత్సరాల వయసు ఉన్న వారిలో 100,000 మందికి కరోనా వైరస్ సోకితే అందులో కనీసం 20,000 మంది మరణిస్తారు.
40 సంవత్సరాలు ఉన్న వారిలో ఒక 10 లక్షల మందికి వైరస్ సోకితే ఒక 1000 మంది మరణిస్తారు.
30లలో ఉన్నవారికి వైరస్ సోకితే కొన్ని వందల మంది మరణిస్తారు.
వయసు ఎక్కువగా ఉన్న వారిలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల లాభాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జర్మనీ, కెనడా దేశాల్లో ఈ వ్యాక్సీన్ని వృద్ధులకు కూడా ఇవ్వడానికి అనుమతులు ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఈ సమాచారాన్నంతటినీ అంతటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కానీ, దీని పై స్పష్టత రావడానికి సమయం పడుతుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)