సర్జరీ వాయిదా వేయాలని కోరినప్పటికీ..
దాదాపు వారం రోజులకు పైగా రోజా మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని భర్త ఆర్కే సెల్వమణి వెల్లడించారు. నిజానికి గత ఏడాదే రోజాకు సర్జరీ చేయాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సర్జరీని వాయిదా వేశారు. ఇటీవల సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లగా… వెంటనే సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. అయితే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పూర్తయ్యేంతవరకూ రోజా సర్జరీని వాయిదా వేయాలని కోరినప్పటికీ… అది మంచి నిర్ణయం కాదని వైద్యులు వారించినట్లు సెల్వమణి తెలిపారు. దీంతో ఇక ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నట్లు చెప్పారు.

రోజాకు సీఎం జగన్ ఫోన్…
సర్జరీ చేయించుకున్న ఎమ్మెల్యే రోజాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించిన సంగతి తెలిసిందే. రోజాకు ఫోన్ చేసిన సీఎం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో తిరుపతి ఉప ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. అవేవీ పట్టించుకోకుండా ప్రస్తుతానికి ఆరోగ్యం పైనే శ్రద్ద పెట్టాలని సూచించారు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.

నగరిలో ప్రత్యేక పూజలు
మరోవైపు ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ నగరి వైసీపీ నాయకులు శనివారం(ఏప్రిల్ 3) శ్రీదేశమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే పేరిట అర్చనలు చేసి, 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో దేశమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బాబురెడ్డి, ఆస్పత్రి కమిటీ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవరాజులు రెడ్డి, మధు, బాలాజీ, సుబ్రమణ్యం, రామన్, గోవర్ధన్ పాల్గొన్నారు.
నేసనూరులోని స్థానిక గ్రామ దేవత శ్రీ కలుగు లక్ష్మమ్మ ఆలయంలోనూ వైసీపీ నేతలు సర్పంచ్ గోవిందస్వామిరెడ్డి ఆధ్వర్యంలోప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రోజా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని దేవతను మొక్కుకున్నారు.