Telangana
oi-Rajashekhar Garrepally
హైదరాబాద్: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నియామకం చేపట్టనున్న జూనియర్ స్టాఫ్‌నర్స్ పోస్టులకు నిర్ణీత అర్హతలున్న పురుష అభ్యర్థుల దరఖాస్తులను కూడా స్వీకరించాలని ఆ సంస్థున హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసిన నేపథ్యంలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువు పెంచాలని స్పష్టం చేసింది.
అంతేగాక, ఈ నియామకాలాన్ని కూడా తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడే ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు.

కాగా, జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కుకు విఘాతమంటూ సింగరేణి ఉద్యోగి మహ్మద్ ఫసియుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు.
అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించేలా ఆదేశించాలని, ఈ మేరకు పలు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి విచారించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, మహిళలు మాత్రమే అర్హులంటూ సింగరేణి కాలరీస్ కంపెనీ విధానపరమైన నిర్ణయమేమీ తీసుకోకపోయినా.. గత కొన్నేళ్లుగా మహిళా అభ్యర్థులతోనే ఈ పోస్టులను భర్తీ చేయడం సంప్రదాయంగా వస్తోందని సింగరేణి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
కాగా, సింగరేణి తరపు న్యాయవాది వాదనను జడ్జీ తోసిపుచ్చారు. విధానపరమైన నిర్ణయం తీసుకోనప్పుడు పురుష అభ్యర్థులు కూడా ఆ పోస్టులకు అర్హులేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.