భవిష్యత్తు బంగారమే:
భారత్ లో పెరుగుతున్న డేటా స్థానికీకరణ డిమాండ్ కు తగినట్లు వచ్చే ఆరేళ్లలో పెద్ద ఎత్తున ఈ విభాగంలో పెట్టుబడులు రానున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. రూ.1.5 లక్షల కోట్ల మేరకు ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టే అవకాశం ఉందని అభిప్రాయ పడింది. రానున్న రోజుల్లో దాదాపు 5 MW సామర్థ్యానికి ఎదగవచ్చని అభిప్రాయపడింది. కొత్త డేటా సెంటర్లు నెలకొల్పడం, వాటి సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా రెండేళ్లలో ఈ రంగం ఆదాయం 17-19 CAGR చొప్పున పెరగనుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA పేర్కొంది.

పోటీలో ఏ సంస్థలు?
డేటా సెంటర్ల కోసం పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు హీరానందనీ గ్రూప్, అదానీ గ్రూప్ (ఎడ్జ్ కానెక్స్ తో కూడిన జెవిలో), రిలయన్స్ గ్రూప్ మరియు బ్లాక్ స్టోన్, క్యాపిటా ల్యాండ్, ప్రిన్స్ టన్ డిజిటల్ గ్రూప్ (పిడిజి) వంటి విదేశీ పెట్టుబడిదారులు దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లు ఏజెన్సీ గుర్తుచేసింది.

ఆరు రెట్లు వృద్ధి:
“మరో 6 ఏళ్లలో ఈ రంగం సామర్థ్యం 6 రెట్లు పెరుగుతుందని భావిస్తున్నాం. ఇందులో ముంబై, హైదరాబా్ద్, ఢిల్లీలు 75 శాతం వరకు వాటా కలిగి ఉంటాయి. ముంబై, చెన్నైలో ఇప్పటికే పెద్ద ఎత్తున ల్యాండింగ్ స్టేషన్ లు ఉన్నాయి. కానీ 2017, 2018 వరదల వల్ల చైన్నైలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు. హైదరాబాద్, పూణే వంటి ప్రాంతాల్లో తమ ఆపరేషన్ బేస్ లకు దగ్గరగా.. ఆయా సంస్థలు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి” అని ICRA వైస్ ప్రెసిడెంట్ అనుపమ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వాల సహకారంతో..
కేంద్రంతో పాటు స్థానిక ప్రభుత్వాలు సైతం డేటా సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందిస్తుండటం శుభసూచకం. మౌలిక సదుపాయాల కల్పన, సబ్సిడీ ధరలో భూమి, విద్యుత్ సబ్సిడీలు వంటి వివిధ రకాల ప్రోత్సాహకాలు అందిస్తూ ఎంకరేజ్ చేస్తున్నాయి. వాటి మెయింటెనెన్స్ కు పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం కానుండటంతో, గ్రీన్ ఎనర్జీ విభాగంలోనూ పెట్టుబడులు పెట్టాలని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. తద్వారా వారి ఆపరేటింగ్ మార్జిన్లు పెరగడంతో పాటు భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి.