ఈ పథకంతో ఏం జరుగుతుంది…
బృహత్తర విద్యా పథకం అమలుకు తుది మార్గదర్శకాలను రూపొందించాలని సంబంధిత అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతి కోసం తీసుకుంటున్న చర్యలను కేబినేట్ సబ్ కమిటీ అధికారులను అడిగి తెలుసుకుంది. రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు సమావేశంలో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. బృహత్తర విద్యా పథకం ద్వారా పాఠశాలలకు అవసరమైన అదనపు గదులు, నూతన భవనాలు, తాగునీరు, డిజిటల్ తరగతులు వంటి మౌలిక సదుపాయాలను కల్పించబోతున్నట్లు తెలిపారు.

సీఎం తుది నిర్ణయం తర్వాత అమలు…
బంగారు తెలంగాణ సాధనలో భాగంగా నాణ్యమైన విద్యను అందిచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. నాణ్యమైన,సమర్థమైన ఉన్నత విద్య అమలు కావాలంటే ప్రాథమిక విద్యా రంగాన్ని పటిష్ట పరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ది చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఏటా రూ.2వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ఇచ్చే తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపింది. ముఖ్యమంత్రి తుది నిర్ణయం మేరకు బృహత్తర విద్యా పథకం పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.

గురుకులాల్లో నాణ్యమైన విద్య…
తెలంగాణలోని గురుకుల పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ పాఠశాలల్లో ప్రవేశాలకు పోటీ విపరీతమైన పోటీ నెలకొంది. గురుకులాల్లో చదివిన విద్యార్థులు జాతీయంగా,అంతర్జాతీయంగా పలు ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో సీట్లు సాధిస్తున్నారు. ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యా రంగంపై మరింత ఫోకస్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. తాజాగా బృహత్తర విద్యా పథకంపై చర్చించేందుకు జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు,కేటీఆర్,సబితా ఇంద్రారెడ్డి,ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కార్యదర్శి రఘునందన్‌రావు, విద్యాశాఖ సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.