HSBC – SVB UK: ఒక బ్రిటిష్‌ పౌండ్‌ విలువను మన ఇండియన్‌ కరెన్సీలోకి మారిస్తే 99.13 రూపాయలు వస్తుంది. పలకడానికి ఇబ్బంది లేకుండా 99 రూపాయలు అని చెప్పుకుందాం. 99 రూపాయలతో ఏమేం కొనొచ్చు అన్న ప్రశ్నను మీరు ఎవరినైనా అడిగితే, ఆ రేటులో వచ్చే రకరకాల వస్తువుల పేర్లు చెబుతారు. అదే ప్రశ్నను HSBCని అడిగితే, తాను ఒక బ్యాంక్‌నే కొంటా అంటుంది. చెప్పడమే కాదు, కేవలం 99 రూపాయలతో ఒక బ్యాంక్‌ను కొనేసింది కూడా.

ఒక్క పౌండ్‌తో డీల్‌
మల్టీ నేషనల్ బ్యాంక్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ అయిన HSBC (Hongkong and Shanghai Banking Corporation), ప్రపంచమంతా షాక్‌ అయ్యే డీల్‌ కుదుర్చుకుంది. అమెరికాలో డిపాజిట్లు కోల్పోయి మూతబడిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌కు ( Silicon Valley Bank – SVB) చెందిన UK అనుబంధ శాఖను ‍‌(subsidiary) కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ అక్షరాల ఒక్క పౌండ్‌ (రూ. 99.13 రూపాయలు) మాత్రమే.

2023 మార్చి 10 నాటికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే శాఖకు 5.5 బిలియన్ పౌండ్ల రుణాలు & 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లు ఉన్నాయి. SVB UK మాతృ సంస్థకు చెందిన ఆస్తులు & అప్పులను ఈ లావాదేవీ నుంచి మినహాయించారు.          

ఈ డీల్‌ తర్వాత HSBC చీఫ్ ఎగ్జిక్యూటివ్ నోయెల్ క్విన్ మాట్లాడారు. “యూకేలో బిజినెస్‌కు సంబంధించి ఈ డీల్‌ చాలా వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉందని వెల్లడించారు. ఈ డీల్‌ వాణిజ్య బ్యాంకింగ్ ఫ్రాంచైజీని బలోపేతం చేస్తుందని చెప్పారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో వినూత్న ప్రయోగాలు చేస్తున్న & వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల అవసరాలను తీర్చడంలో కూడా సాయపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ UK కస్టమర్లను HSBC బ్యాంక్‌లోకి ఆహ్వానిస్తున్నామని, వారికి ఉత్తమ సేవలు అందిస్తామని చెప్పారు. ఖాతాదార్లు UKలో, ప్రపంచవ్యాప్తంగా ఎదగడానికి సహాయం చేయడానికి ఎదురుచూస్తున్నామని” తెలిపారు.

బ్రిటిష్‌ డిపాజిట్లకు భరోసా               
సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సంక్షోభం తర్వాత ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఒక్కసారిగా భయాందోళనలు ఎగసిపడ్డాయి. డిపాజిట్ల కోసం, ముఖ్యంగా సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌లో దాచిన డిపాజిట్లను వెనక్కు తీసుకోవడానికి ఖాతాదార్లు క్యూ కట్టారు. దీంతో, ఆ బ్యాంక్‌ కుప్పకూలింది. యూకేను కూడా ఆ ప్రకంపనలు తాకాయి. అక్కడి డిపాజిట్‌దార్ల ప్రయోజనాలను కాపాడడానికి యూకే గవర్నమెంట్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ రంగంలోకి దిగాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే సబ్సిడియరీ విక్రయానికి అనుమతి ఇచ్చాయి. 

ఇప్పుడు, యూకే శాఖ HSBC చేతుల్లోకి వెళ్లడంతో బ్రిటిష్‌ డిపాజిట్లకు భరోసా వచ్చినట్లయింది. SVBకి చెందిన UK కస్టమర్లు మునుపటిలాగే సాధారణ బ్యాంకింగ్‌ను ఆస్వాదించవచ్చు. వారి డిపాజిట్లు ఇకపై HSBC బలం, భద్రత నడుమ సురక్షితంగా ఉంటాయి. 

SVB UK సహోద్యోగులను కూడా మేం స్వాగతిస్తున్నాం. వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం అని కూడా HSBC చీఫ్ ఎగ్జిక్యూటివ్ నోయెల్ క్విన్ చెప్పారు.            



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *