Adani Enterprises:

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ షేర్లు నేడు 24.5 శాతం మేర ఎగిశాయి. రోజువారీ కనిష్ఠ స్థాయి నుంచి పరుగులు పెట్టాయి. వరుసగా ఏడు ట్రేడింగ్‌ సెషన్ల నష్టాల నుంచి తేరుకున్నాయి. రోజువారీ కనిష్ఠ స్థాయి నుంచి లాభాల్లోకి వచ్చాయి.

మంగళవారం ఉదయం అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ షేరు (Adani Enterprises) 7 శాతం పతనమైంది. ఆ తర్వాత యూటర్న్‌ తీసుకొని 15 శాతం అప్పర్ సర్క్యూట్‌ను టచ్ చేసింది. ఎంఎస్‌సీఐ బుధవారం నుంచి సూచీలో కొన్ని మార్పులు చేయనుంది. అదానీ కంపెనీల వెయిటేజీని తగ్గించనుంది. కాగా ఈ గ్రూప్‌నకు రుణాలు ఇచ్చిన బ్యాంకులూ యథాతథ స్థితిని కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అదానీ కంపెనీల షేర్లు అనూహ్యంగా లాభపడటం గమనార్హం.

ఎంఎస్‌సీఐ గ్లోబల్‌ స్టాండర్డ్‌ సూచీలో (MSCI) అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ వెయిటేజీని 20 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించనున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 52 వారాల గరిష్ఠమైన రూ.4189 నుంచి 67 శాతం పతనమైంది. దాంతో కంపెనీ వెయిటేజీని తగ్గిస్తామని ఎంఎస్‌సీఐ ప్రకటించింది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) సహా కొన్ని మిగతా బ్యాంకులు అదానీ  ఎంటర్‌ప్రైజెస్‌ రుణాలపై చేసిన సమీక్ష ఇన్వెస్టర్లను ఆకర్షించింది. కంపెనీకి ఇచ్చిన రుణాలు పరిమితులకు లోబడే ఉన్నట్టు ప్రకటించాయి. యథాతథ స్థితి కొనసాగిస్తున్నట్టు వెల్లడించాయి. దాంతో గ్రూప్‌లో పదిలో ఎనిమిది కంపెనీల షేర్లు లాభపడ్డాయి. నాలుగు  కంపెనీలైతే అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

‘అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ కంపెనీల వెయిటేజీ తగ్గింపును ఎంఎస్‌సీఐ వాయిదా వేసుకుంది. ఎందుకంటే ఇప్పటికే షేర్లు లోయర్‌ సర్క్యూట్‌లో చలిస్తున్నాయి. పైగా ట్రేడ్‌ చేసేందుకు అనుకూలంగా లేవు’ అని నువామ ఆల్టర్‌నేటివ్‌, క్వాంటిటేటివ్‌ రీసెర్చ్‌ ప్రతినిధి అభిలాష్ పగారియా అన్నారు. అంబుజా సిమెంట్స్‌ 6 శాతం, అదానీ పోర్ట్స్‌ 7 శాతం మేర రాణించాయి.

రుణాల చెల్లింపునకు సై!

షేర్లను కుదవపెట్టి తెచ్చిన రుణాలను చెల్లించేందుకు అదానీ గ్రూప్‌ (Adani Group) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది మార్చి నెలాకరుకు ముందే 690-790 మిలియన్‌ డాలర్ల రుణాన్ని  చెల్లించనుందని తెలిసింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొందరు ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. షార్ట్ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌ బర్గ్‌ (Hindenberg Research) దాడితో నష్టపోయిన పరపతిని తిరిగి దక్కించుకొనేందుకు కంపెనీ శ్రమిస్తోంది.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ సైతం రీఫైనాన్స్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మూడేళ్ల క్రెడిట్‌ లైన్‌తో 2024 బాండ్ల ద్వారా 800 డాలర్లు జొప్పించనుంది. మంగళవారం హాంకాంగ్‌లో నిర్వహించిన బాండ్‌ హోల్డర్ల సమావేశంలో కంపెనీ యాజమాన్యం తమ ప్రణాళికలను వివరించింది. అప్పులు తీర్చడంపై కంపెనీ ప్రతినిధులు ఎవ్వరూ అధికారికంగా మీడియాకు చెప్పలేదు.

ఇన్వెస్టర్లలో ఆందోళన తగ్గించేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఫిబ్రవరి మొదట్లో బాండ్‌హోల్డర్లతో అదానీ ఇప్పటికే సమావేశం నిర్వహించారు. కొన్ని కంపెనీలకు సంబంధించిన రీ ఫైనాన్స్‌ ప్రణాళికలను వివరించారు. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించబోతున్నట్టు పేర్కొన్నారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *