పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు, మున్సిపల్ ఎన్నికలపై దిశా నిర్దేశం
మూడు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు శనివారం రోజు పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేసిన చంద్రబాబు, పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయాలని, మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి టిడిపి నుండి పోటీలోకి దిగిన వారి గెలిచేలా చూడాలని దిశా నిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని చంద్రబాబు సూచించారు.

మరోమారు జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దించాలని నినాదాలు
అంతేకాదు ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దని పేర్కొన్న చంద్రబాబు, మున్సిపోల్స్, పరిషత్ ఎన్నికలలో సోషల్ మీడియా ప్రచారం బాగా పెరగాలని, ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంలోనే మరోమారు జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దించాలని నినాదాలు మళ్లీ వినిపించాయి. ఇవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు మూడు నెలలకోసారి తానే కుప్పం కు వస్తా అని తేల్చి చెప్పాడు.

తానే వస్తా .. వీలు కాకుంటే లోకేష్ ను పంపుతానన్న చంద్రబాబు
తనకు వీలు కాకుంటే లోకేష్ ను పంపుతా అంటూ, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా వస్తారని చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెప్పుకొచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి రంగంలోకి దించాలని ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న డిమాండ్ పై చంద్రబాబు మౌనం వహించారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎవరికి ఏ అవసరం ఉన్నా తానే వస్తానని, లేదంటే లోకేష్ ను పంపుతానని చెప్పడం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు విముఖతకు అద్దం పడుతుందని రాజకీయంగా చర్చ జరుగుతోంది.