ఏపీలో ఉత్కంఠ భరితంగా సాగిన పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు మంచి స్పందన లభించింది. రాష్ట్రంలో విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల్లో జరిగిన పోలింగ్‌కు ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఎస్ఈసీ పిలుపు మేరకు ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేయడంతో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయం 6.30 గంటలకే ప్రారంభమైంది. మధ్యాహ్నం కల్లా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. దీంతో క్రమంగా ఓటింగ్ శాతం పెరిగింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఎన్నికల సంఘం ప్రకటించిన అధికారిక వివరాల ప్రకారం 76 శాతం మేర పోలింగ్ నమోదైంది. మరో గంటలో ఆరుశాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అనధికారికంగా తెలుస్తోంది. దీంతో మొత్తం మీద 82 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
మూడున్నర గంటలకు పోలింగ్ ముగిసినా అప్పటికే క్యూలైన్లలో ఉన్న ఓటర్లను సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు. మరోవైపు నాలుగుగంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది. రాత్రి 8 గంటల తర్వాత ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపులో రాష్ట్రవ్యాప్తంగా 14,535 మంది సూపర్ వైజర్లు, 37,750 మంది కౌంటింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.