ప్రభుత్వానికి లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించే ఆలోచన లేదు
అలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మాట్లాడుతూ ఎక్కడ కేసులు తీవ్రంగా ఉంటే అక్కడ కరోనా కట్టడికి చర్యలు చేపడతామని, అంతే తప్ప లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్న ఆళ్లనాని , కరోనా కట్టడికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

కరోనా నియంత్రణ కోసం ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి
కరోనా ఆసుపత్రులను, కోవిడ్ కేర్ సెంటర్లను, బెడ్ ల సంఖ్యను పెంచాలని ఇప్పటికే సీఎం జగన్ అధికారులను ఆదేశించారు అని చెప్పిన మంత్రి ఆళ్ల నాని , ప్రజలు కూడా తమ బాధ్యతగా కరోనా కట్టడి చేయడానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో కరోనా నియంత్రణ కోసం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశామని తెలిపారు . చాలామంది ప్రజలు కరోనా నిబంధనలను పాటించడం లేదని, మాస్కులు ధరించడం లేదని, భౌతిక దూరం అసలే పాటించడంలేదని, శానిటైజేషన్ గురించి మరిచిపోయారని పేర్కొన్న ఆయన ప్రజలలో నిర్లక్ష్యం ఉంటే కరోనా కట్టడి కష్టమవుతుందని తెలిపారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత లేదు.. వ్యాక్సినేషన్ కు ముందుకు రావాలి
చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదని, వ్యాక్సిన్ పట్ల అపోహలు వదిలేసి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆళ్ల నాని సూచించారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత లేదని, ఏపీ వ్యాప్తంగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చేందుకు 3.80 లక్షల డోసులు రెడీగా ఉన్నాయి అని చెప్పారు. ఇక మరో రెండు రోజుల్లో రెండు లక్షల డోసులు, వారంలో మరో 15 లక్షల డోసులు కేంద్రం నుంచి రానున్నాయని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.

లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూల ఆందోళనను పక్కనపెట్టి కరోనా సెకండ్ వేవ్ ను ఫేస్ చెయ్యండి
లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధిస్తారు అన్న ఆందోళనను పక్కనపెట్టి కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడానికి ప్రజలంతా పోరాటం సాగించాలని, కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు లేకుండా బయట తిరగవద్దు అని మంత్రి ఆళ్ల నాని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అనవసరంగా బయట తిరగొద్దు అంటున్నారు. ఇక రాష్ట్రంలో ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితులను సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు కావాల్సిన సూచనలు అందిస్తున్నారు.