రాష్ట్ర బీజేపీ ఒక అడుగు ముందుకు వేస్తే, పది అడుగులు వెనక్కి లాగేలా కేంద్ర నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపికి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న బిజెపి, తమను తాము బలోపేతం చేసుకోవడంలో భాగంగా జనసేన పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని, రాష్ట్రంలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ ఒక అడుగు ముందుకు వేస్తే, పది అడుగులు వెనక్కి లాగే నిర్ణయాలు కేంద్రం తీసుకుంటుందని బిజెపి నేతలు తెగ మదన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీని వెనక్కి నెట్టి, ముందుకు రావాలని బిజెపి తెగ ప్రయత్నం చేస్తోంది.

విభజన హామీలను అమలు చెయ్యలేదని బీజేపీపై ప్రజల విముఖత
రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. అయినప్పటికీ బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు. ఇప్పటికే ఏపీలో బీజేపీపై ప్రజల్లో కొంత విముఖత ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలను అమలు చేయలేదని బిజెపి నేతలపై విముఖత ప్రదర్శిస్తున్న ప్రజలకు, తాజాగా కేంద్ర అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాలు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

పోలవరం , మూడు రాజధానులు , జల జగడాల విషయంలో కేంద్రం తీరుపై అసహనం
తెలుగు రాష్ట్రాల జల జగడాలు తేల్చక పోవడం, విభజన హామీలను అమలు చేయకపోవడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇవ్వాల్సిన నిధులకు కొర్రీలు , రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయం పై నాన్చుడు ధోరణితో పాటు ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా తయారైంది. సీఎం జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకుంటే, రాజధాని అమరావతి కి మద్దతు ఇస్తామని, రాజధాని అమరావతి మాత్రమే కొనసాగాలని ఏపీ బిజెపి స్టాండ్ తీసుకుంది. ఇక కేంద్రం రాజధానులు నిర్ణయం తమ పరిధిలోనిది కాదని రాష్ట్ర పరిధిలోనిదని తేల్చిచెప్పింది.

రాష్ట్ర బీజేపీ నేతలకు తలనొప్పిగా విశాఖ ఉక్కు కర్మాగారం రగడ
ఇదిలా ఉంటే తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం అంశం కూడా రాష్ట్ర బిజెపి నేతలకు తలనొప్పిగా తయారైంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తుంది. వైసిపి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించలేక, అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకునేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకు రాలేక బీజేపీ నేతలు సతమతమవుతున్నారు.

మూడు రోజులు ఢిల్లీలో మకాం వేసినా.. స్టీల్ ప్లాంట్ పై స్టాండ్ చెప్పలేని స్థితిలో నేతలు
మూడు రోజులపాటు ఢిల్లీలో మకాం వేసిన బిజెపి నేతలు స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలే కేంద్రానికి ముఖ్యమని, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
ఇంకా కేంద్ర స్టీల్ ప్లాంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కానీ కావాలని వైసీపీ, టీడీపీలు రాద్ధాంతం చేస్తున్నాయని బిజెపి నేతలు మండిపడుతున్నారు.కనీసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి ప్రకటన కానీ, నోటిఫికేషన్ కానీ రాలేదని అప్పుడే ప్రైవేటీకరణ జరిగిపోయినట్లుగా హడావుడి చేస్తున్నారని బీజేపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ నేతల్లో అంతర్మధనం
బయటకు ఇలా చెప్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే రాష్ట్రంలో తమ పరిస్థితి ఏంటి అన్న దానిపై బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో, రాష్ట్రంలో తమ ఉనికికి ప్రమాదం కలగకుండా ఉండడానికి నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేయడం మాట అటుంచి, కేంద్ర నిర్ణయాలతో బలహీనం కాకుండా చూసుకోవడం కోసం బీజేపీ నేతలు అంతర్మథనంలో ఉన్నారు.