Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి కిరీటాన్ని తిరిగి సొంతం చేసుకున్న కేవలం 48 గంటల్లోనే, ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి ఆ హోదాను కోల్పోయారు. టెస్లా & స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్‌ మస్క్‌, ఈ వారం ప్రారంభంలో, ప్రపంచ కుబేరుల పిరమిడ్‌లో పైకప్పు మీదకు ఎక్కి కూర్చున్నారు. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ప్రకారం, అతని నికర విలువ $187.1 బిలియన్లకు చేరుకుంది.

అయితే, బుధవారం నాడు టెస్లా షేర్లు (Tesla Share Price) 5% పైగా పడిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ నికర విలువ (Elon Musk net worth) దాదాపు $2 బిలియన్లు పడిపోయింది. మిస్టర్‌ మస్క్‌ కంటే కేవలం ఒక మెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చున్న ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ CEO, ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault), వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, తిరిగి అగ్రస్థానం చేరుకున్నారు. 

మస్క్‌-ఆర్నాల్ట్‌ “సీ-సా” గేమ్‌
బుధవారం ఒక్కరోజే మిస్టర్‌ మస్క్ నికర విలువ $1.91 బిలియన్లు తగ్గి $184 బిలియన్లకు చేరుకుంది. అతని సమీప ప్రత్యర్థి మిస్టర్‌ ఆర్నాల్ట్‌ నికర విలువ $186 బిలియన్లుగా ఉంది. ఈ ఇద్దరి సంపదలో చాలా కొద్దిపాటి వ్యత్యాసం ఉండడం వల్ల “సీ-సా” గేమ్‌ ఆడుతున్నారు.

నాలుగు రోజుల క్రితం వరకు ఆర్నాల్ట్‌ అగ్రస్థానంలో ఉన్నారు. టెస్లా షేర్‌ ధర పెరగడం వల్ల, రెండు రోజుల క్రితం ఆయన్ను రెండో స్థానానికి మస్క్‌ పడగొట్టారు. అవే టెస్లా షేర్ల పడిపోవడం వల్ల, సరిగ్గా రెండు రోజుల్లోనే రెండో స్థానానికి తిరిగి వచ్చారు. 2022లో వివిధ కారణాల వల్ల టెస్లా షేర్ ధర 65% పడిపోపడంతో, ఫ్రెంచ్ బిలియనీర్‌ ఆర్నాల్ట్‌ ఆ ఏడాది డిసెంబర్‌లో తొలిసారి తొలి స్థానంలోకి వచ్చారు.

బ్లూంబెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం… పెరిగిన పెట్టుబడిదార్ల డిమాండ్, డిస్కౌంట్‌ ఇచ్చిన టెస్లా మోడళ్లపై కస్టమర్ల ఆసక్తి, మెరుగైన ఆర్థిక ఫలితాల కారణంగా టెస్లా 100 శాతం పెరిగింది. కానీ 2022 డిసెంబర్ నాటికి, ఎలాన్ మస్క్ విషయంలో కొన్ని అంశాలు తేడా కొట్టాయి. దీంతో, నవంబర్ 2021 – డిసెంబర్ 2022 మధ్య టెస్లా షేర్ల విలువ క్రాష్‌ అయింది. ఆ సమయంలో ఎలాన్ మస్క్ నికర విలువ $200 బిలియన్లకు పైగా పడిపోయింది, వ్యక్తిగత సంపద నష్టాల్లో ఇదొక రికార్డ్‌.

చైనాలో టెస్లా బిజినెస్‌పై కొవిడ్‌ ప్రభావానికి సంబంధించి పెట్టుబడిదారుల్లో నెలకొన్న భయాందోళనలు, ట్విట్టర్‌ను (Twitter‌ ఎలాన్ మస్క్ వివాదాస్పద రీతిలో టేకోవర్ చేయడం కారణంగా.. వాల్ స్ట్రీట్‌లో ఎన్నడూ లేనంత చెత్త పనితీరును 2022లో ఈ కంపెనీ చూడాల్సి వచ్చింది. ఆ ఏడాది కంపెనీ $700 బిలియన్ల విలువను కోల్పోయింది.

మస్క్ మామ మనసు వెన్న
వ్యాపార వ్యవహారాల్లో మస్క్‌ ఎంత కఠినంగా వ్యవహరిస్తారో, దానధర్మాల్లో అంత సున్నితంగా ఉంటారు. 2022 ఆగస్టు – డిసెంబర్ మధ్య కాలంలో 11.6 మిలియన్ల టెస్లా షేర్లను స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారట. ఆ సెక్యూరిటీలను విరాళం విలువ ప్రస్తుతం 2 బిలియన్‌ డాలర్ల పైమాటే. ఇదొక్కటే కాదు, 2021లోనూ సుమారు 5.7 బిలియన్‌ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చాడు. చరిత్రలోనే అతి పెద్ద దాతృత్వ విరాళాల్లో అది కూడా ఒకటి. ఆ విరాళం గ్రహీత మస్క్ ఫౌండేషన్. విద్యాభివృద్ధి, కర్బన ఉద్గారాల నిర్మూలన ప్రాజెక్టులు సహా స్వచ్ఛంద సంస్థలకు ఈ ట్రస్ట్‌ ద్వారా నిధులు వెళ్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *