Friday, May 20, 2022

కడక్‌నాథ్ కోళ్లు, స్ట్రాబెర్రీలు: ఎంఎస్ ధోనీ ఎలా వ్యవసాయం చేస్తున్నారో చూశారా?

National

-BBC Telugu

By BBC News తెలుగు

|

ధోని వ్యవసాయం

Click here to see the BBC interactive

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగితే ఒక్క పదంలోనో, ఒక్క వాక్యంలోనో జవాబు చెప్పడం చాలా కష్టం.

ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోనీ క్రికెట్‌ నుంచి రిటైర్ అయిన తరువాత, తనకే కాకుండా చుట్టుపక్కల మరో నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు.

ఈ మధ్యే ధోనీ స్ట్రాబెర్రీ తింటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది ధోనీ తన సొంత పొలంలో పండించిన స్ట్రాబెర్రీ కావడం విశేషం.

43 ఎకరాల భూమిలో వివిధ పండ్లు, కూరగాయల తోటలను ధోనీ సాగు చేస్తున్నారు. స్ట్రాబెర్రీలతోపాటూ పైనాపిల్, సీతాఫలం, జామ, బొప్పాయి, ఉల్లిగడ్డలు, టమాటాలు, సొరక్కాయలు, పచ్చి బఠాణీలు, పుచ్చకాయలు, కాలీఫ్లవర్ కూడా పండిస్తున్నారు. వీటితో పాటూ నాలుగువైపులా మామిడి చెట్లు పెట్టారు.

ధోనీ స్వయంగా వ్యవసాయం చేస్తున్నారా?

క్రికెట్‌లో విశేషంగా రాణించి ‘మిస్టర్ కూల్‌’గా పేరు పొందిన ధోనీ వ్యవసాయంలో మాత్రం ఆ రంగంలోని నిపుణులనే సంప్రదించారు.

రాంచీ జిల్లా కేంద్రం నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంబో గ్రామంలోని ధోనీ ఫామ్ హౌస్‌లో వ్యవసాయ క్షేత్రాన్ని అగ్రికల్చర్‌లో పట్టా పుచ్చుకున్న రోషన్ కుమార్ నిర్వహిస్తున్నారు.

“లాక్‌డౌన్ సమయంలో పలామూలోని జప్లాలో నేను ఇల్లు కట్టుకుంటూ ఉన్నాను. అప్పుడే నాకు ఫోన్ వచ్చింది.. ధోనీ రమ్మని పిలుస్తున్నారని చెప్పారు. నేను ఏమీ ఆలోచించకుండా వెంటనే ఇక్కడకు వచ్చేశాను. అప్పటి నుంచి ఇక్కడే ఉండి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాను” అని రోషన్ కుమార్ తెలిపారు.

ధోని వ్యవసాయం

“ధోనీని మొదటిసారి కలిసి, మాట్లాడినప్పుడు… ‘పొలంలో ప్రతి మూలా మొక్కలు నాటాలి. ప్రతి చోటుకూ ఒక ప్రత్యేకత ఉంటుంది, శ్రద్ధగా చూసుకోండి’ అని చెప్పారు. అందుకే ముందు భూమిని సాగుకు సిద్ధం చేశాం. ఇది తయారు చేయడానికి ఆరు నెలలు పట్టింది. మొదట స్ట్రాబెర్రీ, పుచ్చకాయలు నాటాం. స్ట్రాబెర్రీలను ధోనీ భయ్యా తిని చాలా సంతోషించారు. దేశదేశాల్లో ఈ పండ్లు తిన్నాను గానీ ఇంత రుచి నేనెక్కడా చూడలేదు’’ అని రోషన్ అన్నారు.

”టమాటా మొక్కలకు, వంకాయ మొక్కలు జత చేశాం. దీన్ని అంటు కట్టడం (గ్రాఫ్టింగ్) అంటారు. దీని ప్రయోజనం ఏమిటంటే.. టమాటా కన్నా వంకాయ వేర్లు బలంగా ఉంటాయి. అందువల్ల మొక్క ఎక్కువ రోజులు బతికి ఉంటుంది. ఎక్కువ పోషకాలను కూడా కలిగి ఉంటుంది. టమాటా దిగుబడి బాగా పెరుగుతుంది. సాధారణంగా టమాటా మొక్కలు ఒకటి లేదా రెండు నెలల తరువాత నిలబడవు. కానీ మేమిక్కడ వాటిని నాలుగు నెలలపాటూ కాపాడుకోగలుగుతున్నాం. ఇక్కడ పూర్తిగా సేంద్రీయ వ్యవసాయమే చేస్తున్నాం. అయితే, వ్యవసాయం మొదలు పెట్టేటప్పుడు పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేయలేం. మెల్లిమెల్లిగా ఆ పద్ధతికి మారాలి. ఇక్కడ ఆవులు పెంచుతున్నాం. కోళ్లు, చేపలు కూడా పెంచుతున్నాం. బాతులు పెంచాలానే ఆలోచన చేస్తున్నాం. దీన్ని ‘ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్’ అంటారు’’ అని వివరించారు.

ధోనీ సహచరి సాక్షి కూడా ఇక్కడకు వచ్చి చూశారని, ఆమె కూడా కొన్ని మంచి సూచనలు చేశారని రోషన్ అన్నారు.

ధోని వ్యవసాయం

పశువుల బాగోగులు చూసుకునేందుకు ఒక డాక్టర్

“ప్రతిరోజూ 70-80 మంది మా పొలాల్లో పనిచేస్తుంటారు. వీరంతా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు. వీరికి వేతనాలతోపాటూ వ్యవసాయ పద్ధతులు కూడా నేర్పుతున్నాం. వాళ్లు తమ సొంత భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు కూడా ఈ పద్ధతులు ఉపయోగపడతాయి” అని ఫామ్ హౌస్ మేనేజర్ కునాల్ గౌతం తెలిపారు.

అక్కడే ఉన్న ఒక కుర్రాడిని చూపిస్తూ ఈయన డాక్టర్ విశ్వరంజన్ అని పరిచయం చేశారు. ఆయన ఇక్కడి పశువుల సంరక్షణను పర్యవేక్షిస్తుంటారు.

“ఒకరోజు ధోనీ అన్నయ్య పిలిచి ఇక్కడి ఆవులను, కోళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని, చుట్టుపక్కల గ్రామాల్లోని పశువుల బాగోగులు కూడా చూడాలని చెప్పారు. ఇక్కడకి ఒక లిఫ్టింగ్ మిషన్ తెప్పిస్తున్నాం. కాళ్లు చచ్చుబడిన ఆవులు, ఇతర జంతువులను ఇక్కడికి తీసుకొచ్చి చికిత్స అందించడానికి ఇది సహాయపడుతుంది’’ అని డాక్టర్ విశ్వరంజన్ చెప్పారు.

“ప్రస్తుతం ఇక్కడ సుమారు 70 ఆవులు ఉన్నాయి. ఇవి కాకుండా గీర్, దేశీయ ఆవులు కూడా రాబోతున్నాయి. వీటన్నిటికోసం ఒక ‘మోడర్న్ క్యాటిల్ ఫార్మ్’ సిద్ధం చేశాం. దీని సామర్థ్యం 300 ఆవుల దాకా ఉంటుంది. రోజుకు 350-400 లీటర్ల పాలు పితుకుతున్నాం. ఈ పాలను రాంచీ మార్కెట్లో అమ్ముతున్నారు” అని అన్నారు.

“ఆవులే కాకుండా మూడు గేదెలు కూడా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఝాబువానుంచీ కడక్‌నాథ్ కోళ్లు వస్తున్నాయి. మొన్నటి వరకూ బర్డ్ ఫ్లూ భయం ఉండడం వల్ల వాటిని తెప్పించలేదు. ఇప్పుడింక అవి కూడా వచ్చేస్తాయి. మరో పదిహేను రోజుల్లో 200 కోలంకి పిట్టలు కూడా వచ్చి చేరుతాయి. ఇక్కడ చిన్న చెరువు ఉంది. అందులో చేపలు పెంచుతున్నాం” అని ఆయన తెలిపారు.

ధోని వ్యవసాయం

ధోనీ ఆవు ఇస్తానని చెప్పారు

ధోనీ పొలంలో పనిచేసే జసింటా కుజూర్ సమీపంలోని జరాటోలి గ్రామంలో నివసిస్తున్నారు. ధోనీని కలిశానని, ఆయనతో ఒక ఫొటో కూడా తీయించుకున్నానని జసింటా చెప్పారు. పొలంలో పని చేసినందుకు ఆయనకు రోజుకు రూ.200 వేతనం లభిస్తుంది.

“రాబోయే రోజుల్లో ధోనీ నాకు ఒక ఆవుని ఇస్తానన్నారు. దాని పాలనా పోషణ చూసుకోవాలని చెప్పారు” అని జసింటా తెలిపారు.

రాంచీ కూరగాయల మార్కెట్‌ను ‘డైలీ మార్కెట్’ అని పిలుస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న కూరగాయల దుకాణాలు ఉంటాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఒక దుకాణం అక్కడి ప్రజలను, మీడియాను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. ఆ దుకాణంపై ధోనీ ఫామ్ హౌస్ బ్యానర్ ఉండడమే కాక ధోనీ ఫొటో కూడా ఉంటుంది.

“ఇక్కడకు స్ట్రాబెర్రీలన్నీ ధోనీ పొలనుంచే వస్తాయి. ధోనీ పేరు చూసి నా దుకాణానికి అందరూ వస్తారు. కానీ, వీటి నాణ్యత చూసి కొనుక్కుంటూ ఉంటారు. మేము మంచి నాణ్యమైన కూరగాయలను, పండ్లను అమ్ముతున్నాం” అని ఆ దుకాణదారు అర్షద్ ఆలం తెలిపారు.

రాంచీ లాల్‌పూర్ చౌక్‌లోని సుమన్ జాదవ్ పాల దుకాణంపై కూడా ధోనీ ఫామ్ హౌస్ బ్యానర్ ఉంటుంది. గత ఏడాది ఆగస్ట్ నుంచీ ధోనీ ఫామ్ హౌస్ నుంచి వచ్చే పాలనే అమ్ముతున్నానని సుమన్ తెలిపారు.

”ప్రతి రోజూ వారికి ఫామ్ హౌస్ నుంచీ పాలు వస్తాయి. వాటిని ఇళ్లకు పంపిణీ చేస్తుంటాం. కల్తీ లేని పాలు, నీరు కలపని చిక్కటి పాలను అమ్ముతున్నాం’’ అని ఆయన చెప్పారు. ధోనీతో ఎప్పుడు మాట్లాడినా, ఆవుల గురించి, పాల గురించే సంభాషణ జరుగుతుంటుందని అన్నారు.

ఇటీవలే జార్ఖండ్ వ్యవసాయ మంత్రి బాదల్ పత్రలేఖ్ మాట్లాడుతూ.. ధోనీ జార్ఖండ్‌లో సేంద్రీయ వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకు ధోనీ అంగీస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe