National
oi-Rajashekhar Garrepally
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా 40వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరింత కఠినంగా కరోనా నిబంధనలను అమలు చేస్తోంది. మహారాష్ట్రలోని నగరాలు, జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.
Maharashtra Goes Under Lockdown | Oneindia Telugu
ఇప్పటికే నాగ్‌పూర్‌లో ఇప్పటికే లాక్డౌన్ విధించగా.. తాజాగా పుణె నగరంలోనూ రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారు. శనివారం నుంచి వారం రోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మొత్తం 12 గంటలపాటు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పుణె డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావ్ తెలిపారు.

ఏప్రిల్ 3 నుంచి వారం రోజులపాటు పుణె వ్యాప్తంగా బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడుతాయని సౌరభ్ వెల్లడించారు. అయితే, హోం డెలివరీలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రార్థనా మందిరాలు పూర్తిగా మూసివేస్తున్నట్లు చెప్పారు. అంత్యక్రియలు, వివాహాలు మినహా ఎలాంటి ఫంక్షన్లను అనుమతించబోమని తేల్చి చెప్పారు.
అంత్యక్రియలకు 20 మంది, వివాహాల్లో 50 మంది మాత్రమే పాల్గొనాలని కమిషనర్ తెలిపారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి మళ్లీ నిర్ణయం తీసుకుంటామని సౌరభ్ రాశ్ చెప్పారు.
కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ముంబై మేయర్ కిశోర్ ఫడ్నేకర్ తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు సుముఖంగా లేనప్పటికీ.. కరోనా పరిస్థితుల దృష్ట్యా కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించక తప్పడం లేదన్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. కాగా, ఒక్క మహారాష్ట్రలోనే దేశంలో సగానికిపైగా యాక్టివ్ కేసులుండటం గమనార్హం.