National
oi-Chandrasekhar Rao
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో రికార్డవుతున్నాయి. సెకెండ్ వేవ్ పరిణామాలు అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఈ పరిణామాల మధ్య కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ప్రజల్లో వ్యాక్సిన్ పనితీరుపై అపోహలు నెలకొని ఉన్నాయి. వ్యాక్సిన్ తరువాత కూడా కొందరికి కరోనా వైరస్ సోకడం, టీకా అనంతరం అనారోగ్యానికి గురవుతామనే భయాందోళనలు పలువురిలో వ్యక్తమౌతోన్నాయి. ఈ భయాందోళనలను తొలగించడానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు, పలువురు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ పెద్దలు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయడానికి గుజరాత్‌కు చెందిన బంగారు వ్యాపారస్తులు, స్వర్ణకార సంఘాల ప్రతినిధులు వినూత్న ప్రచారం మొదలు పెట్టారు. టీకా వేయించుకున్న మహిళలకు బంగారు ముక్కుపుడకను ఉచితంగా అందజేస్తున్నారు. మగవారికి బంగారంతో రూపొందించిన హ్యాండ్ బెండర్ను ఇస్తున్నారు. రాజ్‌కోట్‌కు చెందిన బంగారు వ్యాపారస్తులు, స్వర్ణకార సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద దీనికోసం ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ వేయించుకుని బయటికి వచ్చిన వారికి ముక్కుపుడక, హ్యాండ్ బెండర్లను అందజేస్తున్నారు. వారి ప్రయత్నం వృధా కాలేదు. ముక్కుపుడక, హ్యాండ్ బెండర్లను ఉచితంగా ఇస్తున్నామని తెలియగానే.. పలువురు స్థానికులు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.