National
oi-Rajashekhar Garrepally
ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతుంటే.. మహారాష్ట్రలో మాత్రం పెరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. తాజాగా, ఓ మంత్రి కూడా తన పుట్టిన రోజు వేడుకలను కరోనా నిబంధనలు పాటించకుండా నిర్వహించి ఆ మహమ్మారి బారినపడ్డారు.
ఫిబ్రవరి 16న మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ముంబైలోని మలద్ ఎస్టేట్‌లో జరిగిన ఈ వేడుకల్లో అనేక మంది పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. అయితే, ఈ పార్టీలో ఎవరూ కూడా
భౌతికదూరం, మాస్కులు ధరించకపోవడం గమనార్హం. అంతకుముందు పాటిల్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పరివార్ సంవద్ యాత్రలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో మంత్రి జయంత్ పాటిల్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేను ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. వైద్యులు సూచన మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నా. త్వరలోనే కోలుకుంటాను. అప్పటి వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విధులు నిర్వహిస్తానని మంత్రి జయంత్ పాటిల్ తెలిపారు. అంతేగాక, ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కాగా, మహారాష్ట్రలో గత వారం రోజులుగా కరోనా మళ్లీ విజృంభించింది. బుధవారం రికార్డు స్థాయిలో 4700 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. 40 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,013 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నది ఈ రాష్ట్రంలోనే. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నిబంధనలు పాటించకపోతే మరోసారి లాక్డౌన్ విధిస్తామని హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, పోలీసులను ఆదేశించారు.