వ్యాక్సిన్ సృష్టికర్త మోదీ
త్రిపుర సివిల్ సర్వీసెస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ కరోనా టీకాపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ సృష్టికర్త ప్రధాని మోదీనే అని క్లెయిమ్ చేశారు. ‘‘పూర్తిగా భారతీయ విధానాలు, ఉపాయాల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ కనిపెట్టారు” అని సీఎం సెలవిచ్చారు. అంతేనా..

భారతీయులకు భరోసా..
కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రజలు అనేక ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నారని, సామాజిక దూరాన్ని పాటించడం అందులో ముఖ్యమైన అంశమని త్రిపుర సీఎం అన్నారు. కొవిడ్ విలయకాలంలో భారత్ స్వావలంబనను సాధించగలిగిందన్న బిప్లబ్.. ప్రధాని మోదీ కరోనా టీకాను కనిపెట్టడంతో భారతీయుల భయాందోళనలు దూరమైపోయాయని చెప్పారు. ఇంకా..

బిప్లబ్కు బీజేపీ సమర్థన
భారతీయ విధానాలతో ప్రధాని నరేంద్ర మోదీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నదని, అదే టీకాను భారత్ మరో 25 దేశాలకు కూడా సరఫరా చేస్తున్నదని త్రిపుర సీఎం తెలిపారు. బిప్లవ్ తాజా కామెంట్లపై బీజేపీ స్పందించాల్సి ఉంది. కాగా, నేపాల్, శ్రీలంకలో బీజేపీ విస్తరణ, ప్రభుత్వ ఏర్పాటు దిశగా అమిత్ షా ప్రణాళికలు రూపొందిస్తున్నారంటూ ఇదే సీఎం బిప్లవ్ చేసిన కామెంట్లను బీజేపీ అధికారికంగా సమర్థించింది.