Stock Market News In Telugu: ఇండియన్‌ కార్పొరేట్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కంపెనీ తీసుకోని అతి పెద్ద నిర్ణయాన్ని ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకుంది. ఈ వారం, డొమెస్టిక్‌ బాండ్ సేల్స్‌ ద్వారా ₹20,000 కోట్ల వరకు సమీకరించాలని చూస్తోంది. మన దేశంలో, BFSI (Banking, Financial Services and Insurance) కాకుండా, ఒక ప్రైవేట్ సంస్థ చేపడుతున్న అతి పెద్ద డొమెస్టిక్‌ ఇష్యూగా ఇది నిలుస్తుంది. 

ఈ నెల 9న (గురువారం), ఉదయం 10:30-11:30 గంటల నుంచి BSE బాండ్ ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రానిక్ బుక్ మెకానిజం ద్వారా నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను (NCD) రిలయన్స్‌ విక్రయిస్తుంది. ఈ ఇష్యూ బేస్ సైజు ₹10,000 కోట్లు, గ్రీన్ షూ ఆప్షన్ మరో ₹10,000 కోట్లు.

AAA రేటింగ్‌ బాండ్లు
జారీ చేసే బాండ్స్‌ 10-సంవత్సరాల మెచ్యూరిటీతో ఉంటాయి. క్రిసిల్, కేర్ రేటింగ్స్ ఈ బాండ్లకు ‘స్టేబుల్‌ ఔట్‌లుక్‌’తో AAA రేటింగ్‌ ఇచ్చాయి. ఈ ఇన్‌స్ట్రుమెంట్లకు విడతల వారీ చెల్లింపులు (partly paid) ఉంటాయి. ఈ డిబెంచర్లు సెక్యూర్డ్‌, రిడీమబుల్‌, నాన్-కన్వర్టబుల్. ఈ ఇష్యూ ద్వారా ₹20,000 కోట్ల మొత్తాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) సమీకరించినట్లయితే; ‘బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్‌’ (BFSI) వంటి సాంప్రదాయ రుణ రంగం కాకుండా, ఇండియన్‌ కార్పొరేట్‌ ద్వారా బాండ్ల ద్వారా జరిగిన అతి పెద్ద నిధుల సేకరణగా గుర్తింపు లభిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో విలీనానికి ముందు, గత సంవత్సరం, బాండ్‌ ఇష్యూ ద్వారా ₹25,000 కోట్లను హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ సేకరించింది.

చివరిసారి, 2020 ఏప్రిల్‌లో, దేశీయ డెట్ మార్కెట్‌ నుంచి రిలయన్స్‌ నిధులు సేకరించింది. అప్పట్లో, 7.40% కూపన్ రేటుతో 5 సంవత్సరాల బాండ్ల ద్వారా ₹2,795 కోట్లను కూడగట్టింది. ఈ వారం బాండ్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఇప్పటికే ఉన్న రుణాలను రీఫైనాన్స్ చేయడానికి రిలయన్స్‌ ఉపయోగించవచ్చు. ఆదాయంలో 50% వరకు క్యాపెక్స్ కోసం కేటాయించవచ్చు. మిగిలిన 50% నిధులను దేశీయ అనుబంధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి లేదా రుణాలు ఇవ్వడానికి కూడా వాడుకోవచ్చు. సేకరించిన నిధుల్లో 25% వరకు సాధారణ వ్యాపారంలో ఇతర ప్రయోజనాల కోసం పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది.

రిలయన్స్‌ అమ్మబోయే బాండ్లు అందరికీ అందుబాటులో ఉండవు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు (QIB) అర్హత ఉంటుంది. వీళ్లు కాకుండా, BSE బాండ్ EBP ప్లాట్‌ఫామ్‌లో రిలయన్స్ ప్రత్యేకంగా గుర్తించిన QIB-యేతర పెట్టుబడిదార్లు కూడా అర్హులే.

ఫోకస్‌లో జియో
భారతదేశంలో అగ్రశ్రేణి టెల్కో అయిన రిలయన్స్‌ జియో, తన 5G నెట్‌వర్క్‌లను వేగంగా విస్తరిస్తుండడం, మరికొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా కవరేజీకి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నిధుల సేకరణను చేపట్టడం గమనార్హం.

ఈ రోజు (బుధవారం, 08 నవంబర్‌ 2023) ఉదయం 10.30 గంటల సమయానికి, రిలయన్స్‌ షేర్‌ రూ.4.80 లేదా 0.64% లాభంతో రూ.2,339 వద్ద కదులుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: స్టాక్‌ మార్కెట్‌లో ఫ్లాట్‌ ట్రేడ్‌ – సెన్సెక్స్ 65100 పైన, నిఫ్టీ 19450 వద్ద ప్రారంభం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *