Tuesday, May 17, 2022

కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్‌బుక్‌లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు… ఆరోగ్యం ఏమవుతుంది?

National

-BBC Telugu

By BBC News తెలుగు

|

ఐవీఎఫ్ ఖర్చు భరించలేక ఆన్‌లైన్లో వీర్యదాతల కోసం వెతుకుతున్న మహిళలు

ప్రభుత్వ వైద్యంతో సంతాన సాఫల్య చికిత్సను పొందలేని కొందరు బ్రిటన్‌వాసులు ఫేస్‌బుక్‌లో వీర్యదానం చేసే వారిని ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని హ్యూమన్‌ ఫెర్టిలైజేషన్‌ అండ్‌ ఎంబ్రయాలజీ అథారిటీ(HFEA) ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది చట్ట విరుద్దమని ఆ సంస్థ చెబుతుండగా, డబ్బు ఖర్చు చేయలేని తమకు ఇంతకన్నా గత్యంతరం లేదని ఈ మార్గంలో సంతానం కోసం ప్రయత్నించిన ఇద్దరు మహిళలు బీబీసీతో చెప్పారు.

పిల్లలను కనడానికి అనేక ప్రయత్నాలు చేసిన క్లోయి అనే మహిళ, ఆమెకు కాబోయే భర్తకు ఏడాది గడిచినా గుడ్‌ న్యూస్‌ వినిపించ లేదు.

నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ క్లినిక్‌కు వెళ్లాల్సిందిగా ఫ్యామిలీ డాక్టర్‌ వారిద్దరికీ సూచించారు. క్లోయి పార్ట్‌నర్‌ వీర్యంలో ఏదో లోపం ఉందని, పిల్లలు కావాలంటే ఇతరుల వీర్యం ద్వారానే సాధ్యమని వైద్యులు తేల్చారు.

వీర్యదానానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల జాబితాను క్లినిక్‌ వారికి అందజేసింది. అందులో తమ జాతికి చెందిన ఒకే ఒక వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు క్లోయి.

ఆయన ఇంత వరకు తన జాతి వారిలో ఎవరికీ వీర్యదానం చేయలేదని తెలిసి ఆమె ఎంతో సంతోషించారు. 2017 అక్టోబర్‌లో ఐవీఎఫ్‌ (In vitro fertilization-కృత్రిమ గర్భధారణ) చికిత్స చేయించుకున్నారు క్లోయి. కానీ అది సక్సెస్ కాలేదు.

దీంతో ఐసీఎస్‌ఐ (Intra Cytoplasmic Sperm Injection) చికిత్సకు వెళ్లాల్సిందిగా క్లినిక్‌ సలహా ఇచ్చింది. ఈ చికిత్సలో వీర్యాన్ని అండంలోకి ఇంజెక్ట్‌ చేస్తారు. అయితే ఇది ఐవీఎఫ్‌తో పోలిస్తే చాలా ఖరీదైన వైద్యం. నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో ఇప్పటికే ఒకసారి ఐవీఎఫ్‌ను చికిత్స చేయించుకున్నందున మరోసారి ఛాన్స్‌ లేదు. ప్రైవేటులో ఈ చికిత్స ఖర్చు మొత్తాన్ని వారే భరించాల్సి ఉంటుంది.

“మా ప్రయత్నం ఫెయిలయింది. నిరాశపడ్డాం. మళ్లీ ప్రయత్నించాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాలి. మూడు నెలల్లో మేం పెళ్లి చేసుకోబోతున్నాం. డబ్బంతా దానికి ఖర్చయితే ఎలా? దీన్ని మేం భరించలేం” అన్నారు క్లోయి.

తనకు సరైన చికిత్స జరగలేదని, కాబట్టి తనకు మరో అవకాశమివ్వాలని క్లోయి క్లినికల్‌ కమీషనింగ్‌ గ్రూప్‌ ఎదుట వాదించారు. కానీ వారు అందుకు అంగీకరించలేదు.

వీర్యదాతలు

ఫేస్ బుక్ ద్వారా ప్రయత్నాలు

ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక ఆన్‌లైన్‌లో స్పెర్మ్‌ డోనార్‌(వీర్యదాత) కోసం వెతకడం బెటరని ఆమె కాబోయే భర్త సూచించారు. దీంతో ఫేస్‌బుక్‌లోని పలు వీర్యాదాతల గ్రూప్‌లలో ఆమె మారు పేరుతో చేరారు.

ఈ గ్రూప్‌లో తాను ఉన్నట్లు స్నేహితులందరికీ తెలియడం ఆమెకు ఇష్టం లేదు.

ఓ వీర్యదాత ఇచ్చిన ఫ్యామిలీ హిస్టరీ, సుఖవ్యాధుల పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు చదివిన తర్వాత, ఆ వ్యక్తిని అతని ఇంటి దగ్గరలో ఉన్న కార్‌ పార్కింగ్‌ ఏరియాలో కలుసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు క్లోయి. అప్పటికే ఆమె మైళ్ల దూరం ప్రయాణించి వచ్చారు.

“ఇదే సరైన మార్గమనిపించింది. అతను శాంపిల్‌ను సిద్ధం చేసి ఉంచుతారు. మేం కలుసుకున్నప్పుడు అది నాకు ఇచ్చేస్తారు. నేను బాత్‌రూమ్‌కు వెళ్లి ఏం చేయాలో అది చేస్తాను” అన్నారు క్లోయి.

రక్షణగా కాబోయే భర్త కూడా ఆమెతోపాటు వచ్చారు. కానీ కారులో కూర్చుండి పోయారు.ఇలా ఆరుసార్లు జరిగింది. కానీ క్లోయి గర్భందాల్చలేదు. ఒకసారి గర్భస్రావం మాత్రం జరిగింది.

కానీ, ప్రతిసారి వీర్యానికి 50 యూరోలు, ప్రయాణ ఖర్చులకు 10 యూరోలు ఆమె వీర్యదాతకు చెల్లించాల్సి వచ్చింది.

అయితే, అనుమతి పొందిన క్లినిక్‌లు ప్రయాణ ఖర్చులను 35 యూరోల వరకు భరిస్తాయి. చట్ట విరుద్ధంగా సాగే ఇలాంటి ప్రైవేటు వ్యవహారాలకు స్వీకర్తలే చెల్లించాల్సి ఉంటుందని హ్యూమన్‌ ఫెర్టిలైజేషన్‌ అండ్‌ ఎంబ్రయాలజీ అథారిటీ వెల్లడించింది.

ఒక వ్యక్తి డబ్బు తీసుకుని వీర్యాన్ని ఇవ్వడం వ్యాపారం కిందికి వస్తుందా రాదా అన్నదానిపై చట్టాలలో స్పష్టత లేదని HFEA పేర్కొంది. ఇప్పటి వరకు ఇలాంటి కేసులపై కోర్టులు దృష్టి పెట్టలేదని ఆ సంస్థ వెల్లడించింది.

బిడ్డతో తల్లి

మరో మార్గంలో…

కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో క్లోయి, ఆమె భర్త మరో మార్గంలో ఈ ప్రక్రియను కొనసాగించారు. మళ్లీ ఫేస్‌బుక్ ద్వారానే అయినా, ఈసారి వీర్యదాత ఆమె ఇంటికే వచ్చేలా ఏర్పాటు జరిగింది.

“ఇప్పుడు ఈ పనిని నా సొంతంగా నా ఇంట్లోనే చేసుకోగలిగాను. ఎక్కడా హడావుడి పడాల్సిన పనిలేదు. టాయిలెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంది.” అన్నారు క్లోయి.

ఈ ప్రయోగంలో క్లోయి విజయవంతమయ్యారు. ఇప్పుడామె గర్భవతి. “మొత్తానికి మా కల నెరవేరింది. దీనికోసం మేం చాలా ప్రయత్నాలు చేశాం. చివరకు ఎలాగో పాపాయిని పొందబోతున్నాం”అన్నారు క్లోయి.

ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు. తన భర్త సంతానాన్ని ఇవ్వలేని వ్యక్తి అని అందరూ చెప్పుకోవడం ఆమెకు ఇష్టంలేదు. పైగా ఇదంతా తప్పని భావించేవారు చాలామంది ఉంటారు.

తాను గర్భవతి అయినట్లు వీర్యదాతకు మర్యాదపూర్వకంగా చెప్పారామె. పుట్టబోయే బిడ్డ మీద ఆయనకు ఎలాంటి హక్కులుండవని, చిన్నారి బర్త్‌ సర్టిఫికెట్లో తండ్రిగా తన భర్త పేరే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

క్లోయికి వీర్యాన్ని దానం చేసిన వ్యక్తి గతంలో చట్టబద్ధంగా వీర్యాన్ని దానం చేశారు. కానీ 10 కంటే ఎక్కువసార్లు దానాన్ని చట్టం అంగీకరించదు. దీంతో అధికారికంగా వీర్యదానాన్నిఆయన నిలిపేశారు.

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మహిళలలో తన వల్ల ముగ్గురికి సంతానం కలిగినట్లు తెలిసిందని క్లోయికి వీర్యదానం చేసిన వ్యక్తి చెప్పారు.

కృత్రిమ గర్భధారణ

సంతానంపై హక్కుల మాటేమిటి?

2005నాటి బ్రిటన్‌ చట్టం ప్రకారం వీర్యదానం చేసిన వ్యక్తి తన వీర్యంద్వారా పుట్టిన పాప లేదా బాబును వారికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కలుసుకోవచ్చు.

కానీ ఏదైనా వైద్యపరమైన అవసరం ఉంటే తప్ప చిన్నారిని వీర్యదాతకు చూపించే ఉద్దేశం తమకు లేదని క్లోయి దంపతులు అన్నారు.

“వీర్యదాతకు అతని సంతానాన్ని చూపించడం కేవలం ఆప్షన్‌ మాత్రమే” అన్నారు క్లోయి. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇలాంటి ప్రయత్నాలలో రిస్కులు ఉంటాయని ఆమెకు తెలుసు. తమ పిల్లలను చూపించాలని కొందరు వీర్యదాతలు ఒత్తిడి చేసినట్లు ఫేస్‌బుక్‌ ద్వారా ఆమె తెలుసుకున్నారు.

కొందరు స్పెర్మ్‌డోనార్‌లు వీర్యాన్ని అందించడం కాకుండా, తమతో సెక్స్‌ చేయాలని కోరిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె విన్నారు.

ఇలాంటి వీర్యాదాతలను తప్పించేందుకు ఫేస్‌బుక్‌ గ్రూప్‌లు ప్రయత్నిస్తుంటాయి.

మరో మహిళ కథ

లారైన్‌ అనే మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.సేమ్‌ సెక్స్‌ జంటలకు నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ నుంచి కృత్రిమ గర్భధారణ పొందడానికి అనేక నిబంధనలు అడ్డుగా ఉన్నాయి.

ప్రైవేట్‌ క్లినిక్‌ల ద్వారా ప్రయత్నించడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఆమె ఫేస్‌బుక్‌ గ్రూప్‌లను ఆశ్రయించారు.

తనకు ఆర్టిపీషియల్‌ ఇన్‌సెమినేషన్‌ మాత్రమే కావాలని ఆమె తన ప్రొఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

లారైన్ కనీసం 20మందితో చర్చలు జరిపారు. “వారిలో కొందరు మంచి వారున్నారు. కొందరైతే నిజాయితీగా సాయం చేయడానికి ముందుకొచ్చారు. కొందరు చెడ్డవారు కూడా తారసపడ్డారు” అని చెప్పుకొచ్చారు లారైన్‌.

“కృత్రిమంగా ఎందుకు, నేచురల్‌గా వీర్యదానం చేస్తా”నంటూ కొందరు తనను వేధించడానికి ప్రయత్నించారని, అశ్లీల ఫొటోలను పంపారని లారైన్‌ వెల్లడించారు.

కొందరు చాలా బాగా మాట్లాడారని, వారి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఏమాత్రం దాచకుండా ఇచ్చారని, అయితే తీరా వీర్యదానం చేసే రోజు వచ్చినప్పుడు ముఖం చాటేశారని చెప్పారు లారైన్‌.

“నాకు చాలాసార్లు ఇలా జరిగింది. ఒకదశలో నేను ఇదంతా ఆపేద్దామనుకున్నా” అన్నారామె.

గర్భధారణ సమస్యలు

అందరూ చెడ్డవారు కాదు

లారైన్‌తో టచ్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి నిజాయితీగా మాట్లాడారు. తన సోదరుడు ‘గే’ అని, ఆయన సంతానం పొందలేరని, అలాంటి వారి బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి వీర్యదానానికి ముందుకొచ్చానని ఆ వ్యక్తి చెప్పారు.

అయితే తన వీర్యం తీసుకునేవారు దంపతులై ఉండాలని, సిగరెట్లు, డ్రగ్స్‌, మద్యం అలవాటు ఉన్నవారికి తాను వీర్యాన్ని ఇవ్వబోనని ఆయన అన్నారు. మూడు గంటలపాటు చాట్‌ తర్వాత ఆయన లండన్‌ నుంచి బయలుదేరి వచ్చారు.

వీర్యం ఇచ్చినందుకు ఆయన డబ్బు తీసుకోలేదు. కేవలం ప్రయాణ ఛార్జీలు మాత్రం ఇచ్చారు లారైన్‌.

మూడుసార్లు ఇలా జరిగిన తర్వాత లారైన్‌ గర్భవతి అయ్యారు. ఇప్పుడు ఆమెకు, ఆమె గర్ల్‌ఫ్రెండ్‌కు ఎనిమిది నెలల చిన్నారి ఉన్నారు. ఆ చిన్నారి ఫొటోను లారైన్‌ ఆయనకు పంపారు.

తన ద్వారా లారైన్‌ సంతానం పొందినట్లు ఆ వ్యక్తి ఫేస్‌బుక్‌ పేజ్‌లో ఆమె‌ అనుమతితో ఫొటో పోస్ట్‌ చేశారు.

తన ద్వారా ఒక మహిళ సంతానం పొందినప్పుడల్లా ఇలా ప్రకటన చేస్తుంటారని, తనకు బిడ్డ పుట్టబోయేనాటికి ఆయన 14సార్లు అలా ప్రకటించారని, బిడ్డ పుట్టిన తర్వాత మరో మూడుసార్లు కూడా ఆ వ్యక్తి ఇలా ప్రకటన చేశారని లారైన్‌ వెల్లడించారు.

మీ నాన్న ఇతనే అని తన కూతురుకు చెప్పడానికి వీలుగా అతని ఫొటో, పేరు, వివరాలు రాసి పెట్టుకున్నారు లారైన్‌.

పుట్టినబిడ్డ మీద ఎలాంటి అధికారంలేదనీ, తాము కూడా అతని నుంచి ఎలాంటి డబ్బును ఆశించబోమని లారైన్‌, ఆమె స్నేహితురాలు అతనితో 16 పేజీల అగ్రిమెంట్‌ రాసుకున్నారు.

చట్టాలు ఒప్పుకుంటాయా?

ఇలాంటి ఒప్పందాలు చట్టం ముందు నిలవవని HFEA సంస్థ చెబుతోంది. ఒప్పందం చేసుకున్నా, చేసుకోకపోయినా, చట్టం దృష్టిలో వీర్యదాత ఆ బిడ్డకు బాధ్యుడవుతాడని, ఆ బాధ్యతలన్నీ నెరవేర్చడం వారి వారి ఇష్టాన్నిబట్టి ఉంటుందని ఆ సంస్థ అధికారులు అంటున్నారు.

ఈ విధానంలో ఆరోగ్య సమస్యల ప్రమాదం ఉందని ఆ సంస్థ అధికారులు హెచ్చరించారు.

ఇలా వీర్యాన్ని అమ్ముకోవడంపై గత ఐదేళ్లలో ఎన్ని కేసులు నమోదయ్యాయని బీబీసీ HFEAను అడిగింది. కానీ తమ దగ్గర ఎలాంటి సమాచారం ఏదీ లేదని ఆ సంస్థ వెల్లడించింది.

ఇరువర్గాల మధ్య కుదిరిన ఇలాంటి ఒప్పందాల ఉల్లంఘనలకు సంబంధించి గత ఐదేళ్లలో ఎన్ని ఫిర్యాదులు అందాయని పోలీస్‌ శాఖను బీబీసీ అడిగింది.

అలాంటి కేసులేవీ తమ వద్దకు రాలేదని 90శాతంమంది పోలీసులు సమాధానమిచ్చారు.

ఫేస్‌బుక్‌లో వీర్యదానానికి సంబంధించిన చాట్‌లు, డిస్కషన్లను తాము అనుమతిస్తామని, కానీ స్థానిక చట్టాలను ఉల్లంఘించే వారిని ఫేస్‌బుక్‌ నుంచి తొలగిస్తామని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు చెప్పారు.

సంతానం కోరుకుంటున్నవారు చట్టాలను ఉల్లంఘించేలా నిబంధనలు ఎందుకున్నాయని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ అధికారులను బీబీసీ ప్రశ్నించింది.

ఈ నిబంధనల వెనక అనేక అనివార్య పరిస్థితులు ఉన్నాయని, అందరి డిమాండ్‌ను నెరవేర్చాల్చిన బాధ్యత కూడా ఉందని, పార్లమెంట్‌ కేటాయించిన నిధులకు అనుగుణంగానే ఎన్‌హెచ్‌ఎస్‌ పని చేస్తుందని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe