సామాన్యుడికి గుడ్‌న్యూస్‌! మహిళలకు రాఖీ గిఫ్ట్‌! కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ ధరను తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు కత్తిరించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పరిధిలోని వారికి రూ.400 వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. ఇతరులకు రూ.200 వరకు ఆదా అవ్వనుంది. ప్రస్తుత తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వానికి 2022-23లో రూ.6100 కోట్లు, 2023-24లో రూ.7680 కోట్ల భారం పడుతుందని అంచనా.

‘రాఖీ పండుగ, ఓనమ్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.200 తగ్గించింది. ఉజ్వల యోజన కింద రూ.200 అదనపు సిబ్సిడీని పొడగించింది. దాంతో 73 లక్షల మహిళలకు ప్రయోజనం కలగనుంది’ అని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. అంతేకాకుండా ఉజ్వల స్కీమ్‌ కింద మరో 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్ ధరలను తగ్గించడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల కోలాహలం మొదలవుతుంది. ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆహార పదార్థాల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. దాంతో మోదీ సర్కార్‌ ఈ చర్యలు తీసుకుంది. అంతేకాకుండా కొన్ని నెలలుగా రష్యా నుంచి అతి తక్కవ ధరకే క్రూడాయిల్‌ కొనుగోలు చేస్తోంది.

మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 90-100 డాలర్లు పలుకుతుండగా రష్యా నుంచి 70 డాలర్లకే దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లాభాలు ఆర్జించాయి. ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేస్తున్నారు. 2023 జులైలో రిటైల్‌ ఇన్‌ప్లేషన్ 7.44 శాతంగా నమోదైంది. 15 నెలల గరిష్ఠానికి చేరుకుంది. మరింత పెరిగితే  ఇబ్బందులు తప్పవు. అందుకే గ్యాస్ సిలిండర్‌ ధర తగ్గిస్తే కొంత ఉపశమనం లభిస్తుందని మోదీ సర్కారు భావించింది.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ అతి త్వరలోనే గ్యాస్‌ సిలిండర్ల ధరను తగ్గించబోతోందని నేటి మధ్యాహ్నం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా (PMUY) పథకం లబ్ధిదారులకు ఈ ప్రయోజనం దక్కనుంది. ఇప్పటికే కేంద్రం ఎల్పీజీ సిలిండర్లపై రూ.200 రాయితీ ఇస్తోంది. ఇప్పుడు అదనంగా రూ.200 వరకు తగ్గించనుంది. దాంతో పీఎంయూవై లబ్ధిదారులు ఒక్కో సిలిండర్‌పై రూ.400 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఉజ్వలా పథకం లబ్ధిదారులకు ఏడాది పాటు రూ.200 వరకు సబ్సిడీ పొడగిస్తూ 2023 మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రజలు, పేదలకు ఎల్పీజీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం 2016లో ప్రధాన మంత్రి ఉజ్వలా యోజనను ఆరంభించింది. ఎలాంటి డిపాజిట్లు లేకుండా వీరికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చింది. అర్హులైన లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై సబ్సిడీని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేస్తోంది.

ఆగస్టు నెలారంభంలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సవరించాయి. 19 కిలోల ఎల్పీజీ బండపై రూ.99.75 తగ్గించింది. దాంతో దిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1680కి చేరుకుంది. అయితే 14.2 కిలోల గృహ అవసరాల సిలిండర్‌ ధరను మార్చి ఒకటి నుంచి తగ్గించలేదు. ప్రస్తుతం సబ్సిడీయేతర సిలిండర్‌ రూ.1100 నుంచి రూ.1120 వరకు ఉంటోంది. బహుశా సెప్టెంబర్‌ ఒకటి నుంచి డొమస్టిక్‌ సిలిండర్ల ధరలు తగ్గుతాయని అంచనా.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *