Google Case Update: ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ గూగుల్‌కు మళ్లీ భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ టెక్‌ దిగ్గజం మీద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Competition Commission of India – CCI) జరిమానా విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది. ఆ జరిమానాలో 10 శాతం సొమ్మును డిపాజిట్‌ చేయమంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) ఇచ్చిన ఆదేశంలో జోక్యం చేసుకోవడానికి కూడా న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది. గూగుల్ పిటిషన్‌ను తిరిగి ట్రైబ్యునల్‌కు పంపింది. 2023 మార్చి 31 లోగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

జరిమానాలో 10 శాతం Google డిపాజిట్ చేయాలి
కాంపిటీషన్‌ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన రూ. 1,337.76 కోట్ల జరిమానాను సవాల్‌ చేస్తూ, ఆ పెనాల్టీ మీద స్టే విధించాలని కోరుతూ, గూగుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ మీద సుప్రీంకోర్టు గురువారం (జనవరి 19, 2023) విచారణ జరిపింది. ఈ అమెరికన్‌ సంస్థపై CCI విధించిన జరిమానాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ (Chief Justice DY Chandrachud), న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం సమర్థించింది. ఆ జరిమానాలో 10 శాతం మొత్తాన్ని జమ చేయాలన్న NCLAT ఉత్తర్వును పాటించేందుకు గూగుల్‌ ఇండియాకు ఒక వారం అంటే 7 రోజులు మాత్రమే గడువును సుప్రీంకోర్టు ఇచ్చింది. 

NCLATలోనూ దక్కని ఉపశమనం
సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ముందు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను (National Company Law Appellate Tribunal – NCLAT) ఆశ్రయించిన గూగుల్, అక్కడ కూడా ఊరట పొందలేకపోయింది. CCI ఇచ్చిన పెనాల్టీ ఆర్డర్‌ మీద స్టే ఇవ్వడానికి 2023 జనవరి 4న జరిగిన విచారణలో ట్రైబ్యునల్ నిరాకరించింది. ఆర్డర్ వచ్చిన రెండు నెలల తర్వాత, 2022 డిసెంబర్ 20న ఈ అప్పీల్ చేశారని, అంతకాలం ఎందుకు ఆగాల్సి వచ్చిందని ప్రశ్నించింది. CCI ఆర్డర్ జనవరి 19, 2023 నుంచి అమల్లోకి వస్తుందని, దానికి ఒక నెల ముందు NCLATలో అప్పీల్ చేసినట్లు గూగుల్ తన పిటిషన్‌లో పేర్కొంది. జరిమానా మొత్తంలో (రూ. 1,337.76 కోట్లు) 10 శాతం సొమ్మును ‍‌(సుమారు రూ. 134 కోట్లు) నాలుగు వారాల్లో తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేయాలని కూడా ఆ విచారణ సందర్భంగా NCLAT ఆదేశించింది. ఈ ఆదేశాల మీద ఉపశమనం కోసం గూగుల్‌ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

ఈ కార్‌ మోడల్స్‌ మీ దగ్గర ఉంటే వెంటనే కంపెనీకి తిప్పి పంపండి, ఆలస్యం చేస్తే ప్రాణగండం

కేసు పూర్వాపరాలు
మొబైల్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ విషయంలో పోటీ చట్టం నిబంధనలను దెబ్బ తీసేలా గూగుల్‌ వ్యవహరిస్తోదంటూ, అక్టోబర్‌లో 2022లో రెండు విడతలుగా ( రూ. 1,337.76 కోట్లు + రూ. 936.44 కోట్లు) దాదాపు రూ. 2,274 కోట్ల జరిమానాను ఆ కంపెనీ మీద CCI విధించింది. 97 శాతం మొబైల్ ఫోన్లలో వినియోగించే ఆండ్రాయిడ్ సిస్టంలో ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించింది. ప్లే స్టోర్‌కు సంబంధించిన పాలసీలకు సంబంధించి రూ. 936.44 కోట్ల జరిమానా విధించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *