30 కాదు మొత్తం 50:
గోధుమలు, అట్టా ధరలను అదుపు చేసేందుకు కేంద్రం తన బఫర్ స్టాక్ నుంచి కొంత మొత్తాన్ని బహిరంగ మార్కెట్ లోకి విడుదల చేయనుంది. మొత్తం 30 లక్షల టన్నులను అందుబాటులోకి తేనున్నట్లు జనవరి 25న ప్రకటించింది. దానికి కొనసాగింపుగా మరో 20 కలిపి మొత్తం 50 లక్షల టన్నులను ఆఫ్ లోడ్ చేయనున్నట్లు ఈరోజు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సంక్షేమ పథకాలకు కేటాయించిన మొత్తానికి ఇవి అదనం అని పేర్కొంది.

బల్క్ కొనుగోలుదారులకు..
కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ల నుంచి ఈ బఫర్ స్టాక్ విడుదల కానుంది. అయితే దీన్ని ఇ-వేలం ద్వారా పిండి మిల్లులు, ప్రైవేటు వ్యాపారులు, బల్క్ కొనుగోలుదారులు, గోధుమ ఉత్పత్తుల తయారీ సంస్థలకు విక్రయించనున్నారు. మంత్రుల బృందం ప్రతిపాదనల మేరకు ఈ అమ్మకాలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మార్కెట్ స్థిరీకరణకు..
మొత్తం 50 లక్షల టన్నులను ఓపెన్ మార్కెట్ లో విక్రయించడం ద్వారా దేశీయంగా గోధుమ ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆహార ఉత్పత్తుల మార్కెట్ ను స్థిరీకరించేందుకు ఈ చర్యలు సహాయపడతాయని ఆశిస్తోంది. అయితే ఇలా అమ్మకాలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఈ తరహా విక్రయాలు జరపగా.. వ్యాపార వర్గాల నుంచి మంచి స్పందన లభించింది.