బహిష్కరణ సరికాదన్న సీనియర్స్
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్నిప్రకటించిన కొన్ని గంటలకే పార్టీలో అంతర్గతంగా కలకలం రేగింది. ఊహించని షాకిస్తూ చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కారు. వారిలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ , టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు లాంటి కీలక నేతలూ ఉన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తూ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని ఈ ఇద్దరు నేతలూ బాహాటంగా విమర్శించారు. అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు..

జ్యోతుల నెహ్రూ రాజీనామా..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ శుక్రవారం రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడం నిరాశ కలిగించిందని చెప్పారు. అయితే రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్గా మాత్రమే కొనసాగుతానని ప్రకటించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని జ్యోతుల నెహ్రూ భరోసా ఇచ్చారు. మరోవైపు..

పోలిట్ బ్యూరోకు అశోక్ డుమ్మా..
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సైతం చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టారు. శుక్రవారం నాటి పొలిట్ బ్యూరో సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల బహిష్కరణపై స్థానిక కేడర్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ నిర్ణయం వల్ల నిజమైన కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవని అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందని.. అయినా ఆగినచోటు నుంచే ప్రారంభిస్తున్నారని ఎస్ఈసీపైనే విమర్శలు గుప్పించారు. గెలిచినా గెలవకపోయినా బరిలో నిలవడం మన బాధ్యత నిర్వర్తించాలని హితవు పలికారు.