టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేసిన పోలీసులు
పలమనేరు లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టిడిపి అధ్యక్షులు పులివర్తి నాని , తిరుపతి టిడిపి నేత నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాదు పలువురు టిడిపి నేతల ఇళ్ల ముందు నోటీసులు అందించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో టిడిపి నేతలు చంద్రబాబు హామీ ఇచ్చిన దానికి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని రేణిగుంట విమానాశ్రయం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు.
చంద్రబాబు ధర్నాకు అనుమతి నిరాకరణ … కోవిడ్ కారణం
చంద్రబాబు రానున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఆధ్వర్యంలో ఐదు వేల మంది టీడీపీ కార్యకర్తలతో నిరసన చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ధర్నాకు పోలీసులు కోవిడ్ కారణాలతో అనుమతి నిరాకరించారు. దీంతో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులకు రాష్ట్ర పర్యటించే హక్కు లేదని ప్రశ్నిస్తున్నారు.
టిడిపి నాయకులను తక్షణం నిర్బంధం నుండి విడుదల చేయాలని అచ్చెన్న ఫైర్
పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన టిడిపి నాయకులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ప్రజల వద్దకు వెళ్లే హక్కు లేదా అని నిలదీసిన అచ్చెన్నాయుడు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో వైసీపీ మంత్రులు చేసిన అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే అనుమతి ఇవ్వలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన చూసి వైసిపి నాయకులు వణికిపోతున్నారు. ప్రజాక్షేత్రంలో వైసిపి అవినీతిని ,అక్రమాలను, గూండాగిరి, వైఫల్యాలను ఎండగడతామని, కావాలని టిడిపి నేతలను హౌస్ అరెస్టు చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు.