ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 జాబిల్లిపై దిగే సమయం కోసం యావత్తు భారతావనితో పాటు ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. సాయంత్రం 5.45 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టనుండగా.. ఇది 20 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇప్పటి వరకూ చంద్రయాన్-3 ప్రయాణం ఒక ఎత్తైతే.. ఈ 20 నిమిషాల సమయం మరో ఎత్తు. అత్యంత కీలకమైన ఈ ఘట్టంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.

చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించడానికి భారత్ సిద్ధంగా ఉంది. విక్రమ్ ల్యాండర్ ప్రయాణంలో చివరి ఇరవై నిమిషాలు చివర వరకూ ఉత్కంఠగా సాగి మునివేళ్లపై నిలబెట్టే టీ20 మ్యాచ్ ముగింపు లాంటిది. ఇది దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన సమయాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రయాన్-2 ఈ సమయంలో విఫలమైంది. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని.. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఇస్రో పనిచేసింది.

జులై 14న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (షార్) నుంచి బాహుబలి రాకెట్ మార్క్-3 ద్వారా చంద్రయాన్-3ను నింగిలో పంపారు. క్రమంగా పలు దశల్లో దీని ఎత్తును పెంచుతూ భూకక్ష్యను దాటించారు. 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం ఆగస్టు 1న ప్రొపల్షన్ మాడ్యుల్ చంద్రుడ్ని కక్ష్యకు సమీపంగా చేరింది. ఆగస్టు 5న కీలక విన్యాసంతో జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి లూనార్ ఆర్బిటర్ విన్యాసాలతో క్రమంగా చంద్రయాన్-3 ఎత్తు తగ్గిస్తూ ఉపరితలానికి చేరువ చేశారు.

ప్రస్తుతం చంద్రుడి ఉపరితలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్రమ్ ల్యాండర్.. ల్యాండింగ్ సమయంలో చంద్రుని ఉపరితలం వైపు సెకనుకు 1.68 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది గంటకు దాదాపు 6,048 కి.మీ వేగం.. ఈ వేగం విమానం కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ. విక్రమ్ ల్యాండర్ తనంతట తానుగా ఇంజిన్లు మండిస్తూ వేగాన్ని తగ్గిస్తుంది. ఈ సమయంలో చంద్రుని ఉపరితలానికి దాదాపుగా అడ్డంగా ఉంటుంది. దీనిని రఫ్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. ఇది దాదాపు 11 నిమిషాల పాటు కొనసాగుతుంది.

తర్వాత కొన్ని విన్యాసాలతో విక్రమ్ ల్యాండర్ నిలువుగా ప్రయాణిస్తుంది. దీంతో ‘ఫైన్ బ్రేకింగ్ దశ’ ప్రారంభమవుతుంది. ఈ దశలోనే చంద్రయాన్ -2లోని విక్రమ్ ల్యాండర్ అదుపు తప్పి కూలిపోయింది. చంద్రుని ఉపరితలం నుంచి 800 మీటర్ల ఎత్తులో క్షితిజ సమాంతర, నిలువు వేగాలు రెండూ సున్నాకి వస్తాయి. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ స్ట్రిప్‌ను సర్వే చేస్తూ చంద్ర ఉపరితలంపై కదులుతుంది.

ల్యాండర్ 150 మీటర్ల దూరం వద్ద మరోసారి ఆగి.. ఏదైనా ప్రమాదం ఉందా? ల్యాండింగ్‌ సైట్ అనుకూలమేనా? అని నిర్దారించుకోడానికి కెమెరాలతో ఫోటోలను తీస్తుంది. తర్వాత కేవలం రెండు ఇంజన్లు మండించడంతో చంద్రుని ఉపరితలాన్ని తాకుతుంది. విక్రమ్ కాళ్లు గరిష్టంగా సెకెనుకు 3 మీ లేదా గంటకు 10.8 కి.మీ వేగాన్ని తట్టుకునేలా రూపొందించారు. కింది భాగాల్లోని సెన్సార్‌లు చంద్రుని ఉపరితలంపై దిగిన వెంటనే 20 నిమిషాల భీభత్సానికి ముగింపు పలికి ఇంజన్లు ఆగిపోతాయి.

ల్యాండింగ్ కారణంగా పైకి లేచిన దుమ్ము, ధూళి క్రమంగా స్థిరపడిన ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ తలుపులు తెరుచుకుంటాయి. ఇది ల్యాండింగ్ అయిన రెండు గంటల తర్వాత జరుగుతుంది. అందులో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ మెల్లగా కిందకు దిగుతుంది. రోవర్ చంద్రుని ఉపరితలంపై చుట్టూ తిరుగుతూ… అక్కడ ఫోటోలను తీస్తుంది. విక్రమ్ ల్యాండర్, రోవర్ రెండూ సౌరశక్తితో నడిచేవి కావడంతో చంద్రుడిపై సూర్యోదయం అయ్యే సమయానికి ల్యాండింగ్ చేపడుతున్నారు. చంద్రుడిపై ఒక రోజు (భూమిపై 14 రోజులకు సమానం) పరిశోధనలకు వీలుగా రూపొందించారు. అన్నీ సవ్యంగా సాగితే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.

Read More Latest Science & Technology News And Telugu News



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *