ల్యాండింగ్ సైట్ ఎంపిక ప్రమాణాలలో స్థలాకృతి, వాలు, వెలుతురు, ప్రమాదాల నివారణ వంటివి పరిగణనలోకి తీసుకున్నారు. ఇస్రోతో పాటు ఇతర సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల బృందం మూవింగ్ విండో టెక్నిక్‌ను ఉపయోగించి చంద్రునికి సమీపంలోని 60° నుంచి 70° దక్షిణ అక్షాంశ పరిధిలో 4కి.మీ x 2.4కి.మీ ప్రమాద రహిత ప్రాంతాలను పరిశోధించింది. నాసాకు చెందిన లూనార్ ఆర్బిటర్ లేజర్ ఆల్టిమీటర్ (LOLA), సెలీన్, నారో యాంగిల్ కెమెరాలు (NACలు) నుంచి మీడియం-రిజల్యూషన్ డేటాను ఉపయోగించి తదుపరి పరిశీలనకు 20 సైట్‌లను ఎంచుకున్నట్టు తెలిపారు.
ఈ 20 సైట్‌లలో చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని కెమెరా OHRC అధిక-రిజల్యూషన్ డేటాను ఉపయోగించి ఎనిమిది ఎంపిక చేశారు. OHRC ఎనిమిది సైట్‌ల స్పష్టమైన ఫోటోలను 32cm కంటే మెరుగైన పిక్సెల్ రిజల్యూషన్‌లో తీసింది. వీటిని డిజిటల్ ఎలివేషన్ మోడల్‌ను రూపొందించడానికి ఉపయోగించారు. ఈ మేరకు పరిశోధన పత్రాన్ని ప్రసురించిన హై రిజల్యూషన్ డేటా ప్రాసెసింగ్ డివిజన్‌కు చెందిన అమితాబ్, కే సురేశ్, అజయ్ కే ప్రషార్, అబ్దుల్ సోమోయిల్‌తో కూడిన శాస్త్రవేత్తల బృందం ల్యాండింగ్ సైట్ ఎంపికను గుర్తుచేసుకుంది.
కాగా, చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగిన నాలుగు గంటల తర్వాత దాని ర్యాంప్ విచ్చుకుంటుంది. అందులో నుంచి ఆరు చక్రాల ప్రజ్ఞాన్ రోవర్ నెమ్మదిగా ర్యాంప్ మీదుగా దిగివస్తుంది. చందమామ ఉపరితలంపై సెకనుకు ఇది సెంటీమీటరు వేగంతో కదులుతుంది. ల్యాండర్, రోవర్ 14 రోజుల పాటు జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తాయి. అక్కడ ఒక్క పగటి రోజు మనకు రెండు వారాలతో సమానం. ఈ రోజు అక్కడ సూర్యోదయం కానుండటంతో ల్యాండింగ్‌కు ప్లాన్ చేశారు.
Read More Latest Science & Technology News And Telugu News