National
oi-Srinivas Mittapalli
శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ఓవైపు పరుగులు పెడుతుంటే… మరోవైపు ఇప్పటికీ మూఢనమ్మకాల వెంట పరుగులు పెడుతున్న జనం అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. దొంగ బాబాలు,దొంగ స్వామిజీలు,మాంత్రికులు జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఒడిశాలో… చనిపోయిన ఓ వ్యక్తిని తిరిగి బతికిస్తానంటూ ఓ క్షుద్ర మాంత్రికుడు చాలా తతంగమే చేశాడు. చివరకు పోలీసుల ఎంట్రీతో అడ్డంగా బుక్కయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే… ఒడిశాలోని నయాగఢ్ జిల్లా బార్సాహీ గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(ఏప్రిల్ 6) మృతి చెందాడు. వైద్యులు శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా… ఎవరో కొంతమంది వ్యక్తులు ఓ క్షుద్ర మాంత్రికుడి గురించి వారితో చెప్పారు. అతన్ని సంప్రదిస్తే చనిపోయిన వ్యక్తిని బతికిస్తాడని నమ్మబలికారు.

ఆ మాటలు నమ్మిన మృతుడి కుటుంబం ఆ మాంత్రికుడిని పిలిపించింది. దీంతో ఆ ఇంటికి వచ్చిన మాంత్రికుడు… మృతుడి శవానికి క్షుద్ర పూజలు చేశాడు. గ్రామ ప్రజలంతా చూస్తుండగా వింత వింత పూజలేవో చేశాడు. సలసల కాగే నీటిని కుండల కొద్దీ శవంపై పోయించాడు. ఇలా రకరకాలుగా ఏవేవో జిమ్మిక్కులు చేశాడు. ఎన్ని చేసినా ఆ శవంలో ఎలాంటి చలనం లేదు. అయినప్పటికీ ఏదో అద్భుతం జరగకపోదా అన్నట్లుగా మృతుడి కుటుంబ సభ్యులు,గ్రామస్తులు అతని జిమ్మిక్కులను వీక్షిస్తూనే ఉన్నారు.
ఇంతలో ఈ విషయం పోలీసుల చెవిన పడటంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సదరు మాంత్రికుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేలా చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.