Business News in Telugu: కంటెంట్ సెర్చ్‌ను కృత్రమ మేథకు (Artificial Intelligence) జత చేసి, చాట్‌జీపీటీని (ChatGPT) సృష్టించిన శామ్ ఆల్ట్‌మన్‌కు (Sam Altman) తీవ్ర అవమానం ఎదురైంది. శామ్ ఆల్ట్‌మన్‌ను CEO సీటు నుంచి బలవంతంగా దింపేస్తూ ఓపెన్‌ఏఐ (OpenAI) కంపెనీ నిర్ణయం తీసుకుంది.
బోర్డుతో నిజాయితీగా లేడట
శామ్ ఆల్ట్‌మన్ CEO పదవి నుంచి వైదొలిగారని, తాత్కాలిక CEOగా టెక్నాలజీ చీఫ్ మిరా మురాటిని నియమించినట్లు OpenAI డైరెక్టర్ల బోర్డు శుక్రవారం ప్రకటించింది. డైరెక్టర్ల బోర్డుతో అతను నిజాయితీగా వ్యవహరించడం లేదని, బోర్డు బాధ్యతలకు అడ్డుపడుతున్నాడని పేర్కొంది. “శామ్ ఆల్ట్‌మన్ నాయకత్వంపై బోర్డుకు ఇకపై విశ్వాసం లేదు” అని ఆ ప్రకటనలో వెల్లడించింది. CEO సీటు నుంచి దిగిపోయినా… శామ్ ఆల్ట్‌మన్ కంపెనీలోనే కొనసాగుతారని, CEOకి రిపోర్ట్ చేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తారని ఓపెన్‌ఏఐ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది.
శామ్ ఆల్ట్‌మన్‌ను CEO బాధ్యతల నుంచి బలవంతంగా తొలగిస్తూ ఓపెన్‌ఏఐ తీసుకున్న నిర్ణయం గ్లోబల్ కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
OpenAI CEO బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు శామ్ ఆల్ట్‌మన్ కూడా వెల్లడించారు, దీనిపై Xలో ట్వీట్ చేశారు. ఓపెన్‌ఏఐలో పని చేయడాన్ని తాను ఇష్టపడ్డానని, నిపుణులతో కలిసి పని చేయడాన్ని ఆస్వాదించానని, తన వల్ల ప్రపంచం కొంచెం మారిందని తాను నమ్ముతున్నానని ఆ ట్వీట్‌లో రాశారు.
మైక్రోసాఫ్ట్ ఒత్తిడితోనే శామ్ ఆల్ట్‌మన్‌కు ఉద్వాసన!
దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft), ఓపెన్‌ఏఐలో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. తన సెర్చ్ ఇంజిన్ బింగ్‌లో చాట్‌జీపీట్‌ని వినియోగిస్తోంది. శామ్ ఆల్ట్‌మన్ పనితీరుపై మైక్రోసాఫ్ట్ కొంతకాలంగా సంతృప్తిగా లేదు. ఈ నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ ఒత్తిడి వల్లే శామ్ ఆల్ట్‌మన్ CEO ఛైర్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
శామ్ ఆల్ట్‌మన్‌ను CEO బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల (Microsoft CEO Satya Nadella) Xలో ఒక ట్వీట్ చేశారు. ఓపెన్‌ఏఐతో మైక్రోసాఫ్ట్ దీర్ఘకాలిక ఒప్పందం గురించి ఆ ట్వీట్‌లో వెల్లడించారు. ఓపెన్‌ఏఐతో కలిసి మరిన్ని కొత్త సేవలు తెస్తామని వివరించారు. మిరాతో, అతని బృందంతో కలిసి ముందుకు సాగుతామన్నారు. శామ్ ఆల్ట్‌మన్ నిష్క్రమణ గురించి మాత్రం సత్య నాదెళ్ల ప్రస్తావించలేదు.
మరో కీలక పరిణామం
శామ్ ఆల్టమన్‌ను తప్పించిన గంటల వ్యవధిలోనే ఓపెన్‌ఏఐ కంపెనీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్‌ఏఐ కో-ఫౌండర్, ప్రెసిండెట్ గ్రెగ్ బ్రాక్‌మన్ (Greg Brockman) కూడా తన పదవికి రాజీనామా చేశారు. గ్రెగ్ రిజిగ్నేషన్‌కు కారణం శామ్ ఆల్టమన్‌ను తొలగించమే. ఈ విషయాన్ని గ్రెగ్ బ్రాక్‌మన్ స్వయంగా Xలో పోస్ట్ చేశారు. గత 8 సంవత్సరాలుగా తామంతా కలిసి సృష్టించిన అద్భుతాల పట్ల తాను గర్విస్తున్నాని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తమ బృందం చాలా కఠిన సమస్యలను ఎదుర్కొందని, అయినా అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించామని వెల్లడించారు. శామ్ ఆల్ట్‌మన్ తొలగింపు తర్వాత ఓపెన్‌ఏఐని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు ట్వీట్‌లో వివరించారు.
మైక్రోసాఫ్ట్ నుండి బిలియన్ డాలర్లను సేకరించిన ఓపెన్‌ఏఐ, ఈ సంవత్సరం CNBC డిస్‌రప్టర్ 50 జాబితాలో (CNBC’s Disruptor 50 list) ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. 2022 చివరిలో AI చాట్‌బాట్ చాట్‌జీపీటీని ఈ కంపెనీ పబ్లిక్‌లోకి లాంచ్ చేసింది. సాధారణ టెక్ట్స్‌ను సృజనాత్మక సంభాషణగా మారుస్తూ, యూజర్ కోరుకున్న సమాచారాన్ని తెలివిగా అందిస్తున్న చాట్‌జీపీటీ చాలా త్వరగా వైరల్ అయింది. చాట్‌జీపీటీ బ్రహ్మాండమైన సక్సెస్ కావడంతో… ఆల్ఫాబెట్ (Alphabet), మెటా (Meta) వంటి పెద్ద టెక్ కంపెనీలు కూడా AIలో పెట్టుబడులు పెంచేందుకు నిర్ణయించాయి.
మరో ఆసక్తికర కథనం: వరుస బెట్టి ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా, మరో రెండు ఫ్లాట్లకు బేరం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial