Saturday, June 12, 2021

చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?

National

-BBC Telugu

By BBC News తెలుగు

|

చింతల వెంకటరెడ్డి

రైతుకూ మట్టికీ అనుబంధం కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఆ మట్టిలో పండే పంటకు అదే మట్టిని ఎరువుగా, మట్టినే పురుగు మందుగా వాడొచ్చని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన రైతు చింతల వెంకటరెడ్డి.

”నత్రజని, భాస్వరం, సూపర్, పొటాష్..అన్నీ మట్టిలోనే ఉన్నాయి. వానకు తడిసినప్పుడు ఎండిన మట్టి నుంచి వచ్చే కమ్మటి వాసనే, పండే పంటకు అద్భుతైమన రుచినీ, పండుకు తియ్యదనాన్నీ ఇస్తుంది” అంటూ తన పంటల ఉత్పత్తి వెనుకున్న మట్టి రహస్యాన్ని వెంకట రెడ్డి వివరిస్తారు.

2002లో మట్టితో ప్రయోగాల ఆలోచన వచ్చింది. ”నాకు తెలిసిన ఒకరి పూల తోటలు చూడటానికి వెళ్లాను. మొదట్లో ఆ పూలు పెద్దగా పూసేవి. క్రమంగా చిన్నవి అయ్యాయి. మట్టి పాతది అయిపోతే పువ్వు సైజ్ పెరగదని అర్థమయింది. ఆ మట్టి ‘డెడ్ సాయిల్’ అయ్యిందని వారికి చెప్పాను. అది తీసేసి కొత్త మట్టి వేయాలి అని చెబితే ఆయన అలానే చేశారు. ఈ విధానం అన్ని పంటలకూ వర్తిస్తుంది కదా అనుకుని ప్రయోగాలు ప్రారంభించాను. ద్రాక్ష, వరి, గోధుమలపై ఈ మట్టి విధానం ప్రయత్నించాను. అన్నిటిలోనూ మంచి ఫలితాలు వచ్చాయి.” అంటూ వివరించారు వెంకట రెడ్డి.

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్‌లో వెంకటరెడ్డి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

చింతల వెంకటరెడ్డి పొలంలో పంట

ఎరువుగా మట్టి

మట్టితో ప్రయోగం సఫలం అయింది కానీ, ప్రతీసారీ బయటి నుంచి దాన్ని తీసుకొచ్చి వేయడం ఇబ్బంది. పైగా మట్టి దొరికే ఖాళీ స్థలం కూడా తక్కువ. దీంతో తన పొలంలోనే కందకం తవ్వి, ఆ లోపలి పొరల మట్టిని (సబ్ సాయిల్) తీసి ఉపయోగించడం మొదలుపెట్టారు వెంకట రెడ్డి.

ఐదడుగుల లోతు, రెండున్నర అడుగుల వెడల్పు ఉన్న కందకాలు తవ్వి ఆ లోపలి మట్టిని బయటకు తీసేవారు. ఆ గుంతలను పొలంలో దున్నినప్పుడు పైకి వచ్చిన మట్టితో పూడ్చేవారు. ఇక లోపలి నుంచి తీసిన మట్టిన పొలం అంతా సమంగా సర్దేవారు. మరికొంత మట్టిని ఎండబెట్టి, భవిష్యత్తు అవసరాలకు దాచేవారు.’

‘ఈ ప్రక్రియతో సేంద్రియ ఎరువులతో వరి వేస్తే మంచి పంట వచ్చింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డా. పద్మరాజు ఆ పంటను చూశారు.జెనీవాలోని అంతర్జాతీయ పేటెంట్ సంస్థకు ఈ ప్రక్రియ గురించి దరఖాస్తు చేయమని ఆయన సూచించారు.

ఐసిఎంఆర్ శాస్త్రవేత్త కల్పనా శాస్త్రితో మాట్లాడి అప్లికేషన్ పెట్టాను. 2004 జూన్‌లో దీనికి అప్లే చేశాను. దరఖాస్తును అంగీకరించినట్టు 8 నెలల తర్వాత సమాచారం వచ్చింది. మరో 18 నెలలకు వారి వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేశారు. ఇంటర్నేషనల్ పేటెంట్ కోఆపరేషన్‌ ట్రీటీలో దాదాపు 120-130 దేశాల ప్రతినిధులు ఉన్నారు. అమెరికా మాత్రం పేటెంట్ ఇవ్వలేదు” అన్నారు వెంకటరెడ్డి.

పేటెంట్ ఇవ్వకపోయినా, ఈ ప్రక్రియ గురించి తెలుసుకున్న అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ వెంకటరెడ్డిని కలసి ప్రత్యేకంగా అభినందించారు.

”జిల్లా కలెక్టర్ మా పొలానికి వచ్చి ఈ విధానం గురించి తెలుసుకుని, పేటెంట్ పత్రాలు తీసుకుని వెళ్లారు. నెల తరువాత ఫోన్ చేసి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తారు’’ అని చెప్పారు. మానవాళికి ఉపయోగపడే మంచి పనిచేశావంటూ బుష్ మెచ్చుకున్నారు” అన్నారు వెంకటరెడ్డి.

”పూర్వం కరువు వచ్చినప్పుడు బావులు లోతు ఇంకా తవ్వేవారు. అప్పడు వచ్చే బురద నీటిని పంటలకు పారించేవారు. అలా పారించినప్పుడు మామూలుకంటే ఎక్కువ, దాదాపు రెట్టింపు దిగుబడి వచ్చేది. నేను మొదట్లో బావినీళ్ల మహిమతో డబుల్ పంట వస్తుందేమో అనుకునేవాణ్ణి. తరువాత అర్థమైంది. అది భూమిలోపలి మట్టి ఘనత అని.” అన్నారు వెంకట రెడ్డి.

చింతల వెంకటరెడ్డి

మట్టి-నీరు స్ప్రే

ఇక 2014లో ఎండు మట్టిని స్ప్రే చేసే విధానం గురించి ప్రయోగం చేసి సఫలం అయ్యారు వెంకట రెడ్డి. పశుగ్రాసం కోసం పెంచిన జొన్నపైరు పై ఎండుమట్టి కలిపిన నీటిని స్ప్రే చేశారు. స్ప్రేయర్లో మట్టి చిక్కుకోకుండా మట్టి కలిపిన నీటిని కాసేపు అలా ఉంచితే మట్టి కిందకు దిగుతుంది. ఆ పై నీటిని స్ప్రే చేయాలి. జొన్న పంట బాగా పెరిగింది. రెండు రోజుల్లో ఆ పైరుపై ఉన్న చీడపీడలన్నీ మాయం అయిపోయాయని వెంకటరెడ్డి చెప్పారు.

”నాకు చాలా విచిత్రం అనిపించింది. నేను చల్లింది మట్టే కదా. అందరూ చిన్నప్పుడు తిన్న మట్టే. జంతువులు తింటాయి కానీ చావవు. మరి పురుగులు ఎలా చనిపోయాయి అని ఆలోచన ఎంతకీ తెగలేదు. అప్పుడు చిన్నప్పుడు చదువుకున్న విషయం ఒకటి గుర్తొచ్చింది. అసలు పురుగులు, క్రిమి కీటకాలకు లివర్ ఉంటుందా అని.

2015లో నాకు స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇంటర్‌నెట్‌లో వెతికి చూశాను. ఉండదని సమాధానం వచ్చింది. అవి శరీరంతో ఊపిరి తీసుకుంటాయి. దీంతో మేం మట్టి కలిపిన నీరు చల్లడం వల్ల వాటికి శ్వాస వ్యవస్థ పని చేయక చనిపోయాయి. ఇక మట్టి స్ప్రే చేస్తే తల్లి గుడ్డు పెట్టదు. అలాగే వాటికి లివర్ ఉండదు కాబట్టి మట్టి అరగదు. దీంతో ఇది మంచి పురుగు మందులా పనిచేస్తోంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా స్ప్రే చేస్తే మంచింది.” అన్నారాయన.

ఇలా చల్లడంవల్ల ఆ మట్టి వేడిని నియంత్రించి, వాతావరణాన్ని తట్టుకుని, మొక్క వాతావరణాన్ని క్రమబద్ధం చేసి, పంట ఉత్పత్తి పెంచుతుందంటారు వెంకట రెడ్డి. మిడతల దండును ఎదుర్కోవాడనికి కూడా మట్టి స్ప్రే ఉపయోగపడుతుంది అంటారాయన.

కేవలం మట్టి జల్లడమే కాదు. ద్రాక్ష తోటలకు డ్రిప్ నీరు పడే చోట విడతల వారీగా ఈ ఎండు మట్టిని పెడతారు. ఇక వరి చేనుకు నీరు పట్టేప్పుడు ఆ నీటి ట్యాంకులో ఈ మట్టి కలుపుతారు. అప్పుడు మంచి దిగుబడి, మంచి రుచి వచ్చాయి.

అయితే, యూరప్ వారు నీళ్లలో మట్టిని పారించి కలపడం, కందకం తీసి మట్టి తవ్వి చల్లడం ఈ రెండు వేర్వేరు అంశాలని చెప్పారు. దీంతో కందకం తీసి మట్టి ఎరువుగా వాడే ప్రక్రియకు పేటెంట్ తీసుకున్నారు వెంకటరెడ్డి. నీళ్లలో మట్టిని కలిపి పారించే ప్రక్రియ సంగతి తరువాత చూద్దామనుకున్నారు. సరిగ్గా అదే ఆలోచన మరో ఆవిష్కరణకు దారి తీసింది.

గోధుమ పంట

విటమిన్ అన్నం ఎలా ?

”నేను చేసిన ప్రతీ ప్రక్రియా డైరీలో రాసుకుంటాను. 2008లో ఈ నీరు పారించినప్పుడు చేసిన ప్రక్రియను మరోసారి డైరీలో తరచి చూసుకుంటే, అప్పుడు క్లూ దొరికింది” అంటూ గుర్తు చేసుకున్నారాయన.

బహుశా పేటెంట్ కారణాల వల్లనో, మరో కారణమో, పంటలో డి-విటమిన్ ఎలా పెరుగుతుందో ఆయన ఈ ఇంటర్వ్యూలో పూర్తిగా వివరించలేదు. ” కొన్ని రకాల మొక్కల అవశేషాలను నీటిలో కలపి పైరుకు ఇవ్వడం ద్వారా అది సాధ్యపడింది” అంటారాయన.

”2008లో ఉత్పత్తి పరీక్ష చేయించినప్పుడు, ఆ పంటలో విటమిన్-ఎ, విటమిన్-సి వచ్చాయి. వేరే పరీక్షల కోసం పంపినప్పుడు ఆ విషయం తెలిసింది. అప్పట్లో అందరూ విటమిన్ గురించి మాట్లాడేవారు. దీంతో విటమిన్-ఎ, విటమిన్-సి బదులు విటమిన్‌-డి ఎక్కువ ఉండేలా ప్రయత్నం చేశాను. విజయం సాధించాను. 2021 ఫిబ్రవిలో డి-విటమిన్ ప్రక్రియ పేటెంట్ పబ్లిష్ అయింది.” అన్నారు వెంకట రెడ్డి.

”కాంపొజిషన్ టు ఎన్హాన్స్ న్యూట్రియంట్ కంటెంట్ ఇన్ ప్లాంట్స్” అనే అంశంపై ఈ పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. కేవలం వరి, గోధుమే కాకుండా అన్ని పంటల్లో పోషకాలను సహజ పద్ధతుల్లో పెంచొచ్చని ఆయన అంటున్నారు. ఈ పేటెంటే ప్రధాని మోదీ వెంకట రెడ్డి గురించి మాట్లాడేలా చేసింది.

వెంకట రెడ్డి హైదరాబాద్ శివార్లలోని అల్వాల్‌లో పుట్టి పెరిగారు. వ్యవసాయం కూడా ఇంటి ఎదురుగానే ఉన్న పొలంలో చేస్తారు. దీంతోపాటూ కీసర దగ్గర మరో పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉంది. చిన్నప్పుడు బడికి వెళ్తూనే వ్యవసాయ పనుల్లో తండ్రికి సహకరించేవారు వెంకటరెడ్డి.

1969లో పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు – ప్రస్తుత ఇంటర్‌తో సమానం) పూర్తి చేసిన తరువాత కాలేజీకి అప్లై చేశారు. అయితే ఆ చదువు కొనసాగించకుండా వ్యవసాయంలోకి దిగారు.

తాను కనిపెట్టిన విధానాలను ప్రభుత్వం శాస్త్రీయంగా, విస్తృతంగా ప్రచారం చేయాలని వెంకటరెడ్డి కోరకుంటున్నారు. వ్యక్తిగతంగా ఫోన్లు చేసిన వారికి ఆయన సలహాలు ఇస్తుంటారు. ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఆయనకు కాల్ చేస్తుంటారు.

ఆయన కుమారుడు ఉన్నత చదువులు చదివి, వ్యవసాయంలోకి దిగారు. మంచి రుచి ఉండడం, సేంద్రియంగా పండించడంతో ఆయన తోటలో ద్రాక్షకు ముందే ఆర్డర్లు వస్తుంటాయని చెప్పారు.

”మంచి తిండి తినాలి. మంచి తిండి కోసం ఆలోచించాలి. రసాయన అవశేషాలు లేని పంట తినాలి. ఆ తరువాత స్థాయిలో విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. రైతులు సేంద్రియ పద్ధతుల ద్వారా ఖర్చు తగ్గించాలి. పైరు ఆరోగ్యంగా ఉండాలి. బయట కొనేవన్నీ మన కాళ్ల కిందే ఉన్నాయి.” అని తోటి రైతులకు చెబుతారు వెంకట రెడ్డి.

జార్జి బుష్ కలిసినప్పటికంటే ప్రధాని మోదీ తన గురించి మాట్లాడడం, తన మాతృభూమిలో తనను గుర్తించడం, చాలా సంతోషంగా ఉందని వెంకట రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
Source link

MORE Articles

Best ultrawide monitors 2020: the top ultrawide monitors we’ve tested

One of the best ultrawide monitors might be the ideal display for you if you’re a big gamer or if your workday consists...

There’s a Third Mission Going to Venus, Earth’s Evil Twin | Digital Trends

Artist’s impression of ESA’s EnVision mission ESA/VR2Planets/DamiaBouicA surface temperature hot enough to melt lead. An atmosphere so thick the pressure on the surface...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe