Telangana
oi-Rajashekhar Garrepally
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని చిట్యాల సీఐ ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు సీఐ సాయిరమణ. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వరంగల్ కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే, ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణాలు తెలియరాలేదు.
బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కేయూసీ ఫిల్టర్ బెడ్ సమీపంలో తన కారులోనే సీఐ పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అదే సమయంలో అదే దారినుంచి వెళ్తున్న బ్లూకోల్డ్ పెట్రోలింగ్ సిబ్బంది గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లారు.

అప్పుడే సీఐ సాయిరమణకు ఫోన్ రావడంతో బ్లూకోల్ట్ సిబ్బంది ఫోన్ ఎత్తి మాట్లాడగా.. ఆయన చిట్యాల సీఐ అని తెలిసింది. దీంతో వెంటనే సాయిరమణను హన్మకొండలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలే కారణమని సూసైడ్ నోట్ రాసి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం సీఐ సాయిరమణ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జీ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ వెంటనే హన్మకొండలోని ఆస్పత్రికి చేరుకున్నారు.
సీఐ సాయిరమణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా, పరిస్థితిపై సీఐ సాయిరమణ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.