మానవతా దృక్పథంతో కేంద్రం…
కేంద్ర ప్రభుత్వం కూడా తీరా విషయంలో మావతా దృక్పథంతో వ్యవహరించింది. విదేశాల నుంచి దిగుమతి చేసిన ఆ ఇంజెక్షన్‌పై రూ.6కోట్లు దిగుమతి సుంకం,జీఎస్టీని మాఫీ చేసింది. ఈ విషయాన్ని బీజేపీ నేత,మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘చిన్నారి తీరా కామత్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించి జోల్జెన్స్మా డ్రగ్‌పై కస్టమ్స్ డ్యూటీని మినహాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

చిన్నారి తల్లిదండ్రుల విజ్ఞప్తి…
అంతకుముందు,చిన్నారి తీరా తల్లిదండ్రులు ఇదే విషయమై సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘రూ.16 కోట్లు వెచ్చించడమనేది సంపన్న వర్గాలకు సైతం కష్టమే. మాలాంటి సాధారణ మధ్యతరగతి జీవులు జీవితాంతం కష్టపడి సంపాదించినా రూ.1కోటి మొత్తాన్ని తమ జీవితకాలంలో కళ్ల చూడలేరు. ప్రతీ ప్రభుత్వ పాలసీకి బీపీఎల్(below poverty line) నిబంధన ఉంది. అంటే,పేదవాళ్లు అని నిరూపించుకునేవారికి మాత్రమే సహాయం అందుతుంది. కానీ మా పరిస్థితి వేరు… రూ.16కోట్లు మా వద్ద లేవు,కానీ అంత మొత్తాన్ని సమకూర్చుకోక తప్పలేదు. కాబట్టి బీపీఎల్ నిబంధనలను సడలించి ప్రతీ భారతీయుడికి సాయం అందేలా చూడగలరా..?’ అంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ట్యాక్సులు,జీఎస్టీ మినహాయిస్తే తమపై కొంతమేర భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన కేంద్రం మానవతా దృక్పథంతో అన్ని రకాల పన్నులను మాఫీ చేసింది.

ముంబై ఆస్పత్రిలో చికిత్స
చిన్నారి తీరాకు ప్రస్తుతం ముంబైలోని SRCC ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వెన్నెముక కండరాల క్షీణత వల్ల తలెత్తే సమస్యలతో ఆ చిన్నారి బాధపడుతోంది. ఇప్పటికే ఆ చిన్నారి ఊపిరితిత్తులలో ఒకటి పని చేయడం మానేసింది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే వెంటిలేటర్‌పై ఎక్కువ కాలం ఉంచితే ట్యూబ్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారికి వీలైనంత త్వరగా ఆ ఇంజెక్షన్ అందించాల్సి ఉంది.జోల్జెన్స్మా ద్వారా ఆ చిన్నారిలో బలహీనంగా ఉన్న కండరాలు మళ్ళీ మెదడు నుండి సంకేతాలను పొందే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.