పంటలు కోయడానికి రైతులు వెళ్ళిపోతారు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉండకూడదు
పంటలు కోయడానికి రైతులు తమ ఇళ్ళకు వెళ్ళిపోతారు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉండకూడదని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కోసం అవసరం అయితే పంటలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు.
ఒకవైపు పంటలు సాగు చేయడంతో పాటుగా, మరోవైపు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పిన భారత కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ అవసరం అనుకుంటే పంటను తగలబెట్టడానికైనా సిద్ధంగా ఉండండి అని పిలుపునిచ్చారు.

హర్యానాలో మహా పంచాయతీలో రాకేశ్ టికాయత్ పిలుపు .. హల్ క్రాంతికి సిద్ధం కండి
హర్యానాలోని హిసార్ లోని ఖరక్ పూనియా గ్రామంలో కిసాన్ మహాపాంచాయతీలో ప్రసంగించారు. నిరసనకు నాయకత్వం వహిస్తున్న యూనియన్ల తదుపరి పిలుపుకు సిద్ధంగా ఉండాలని టికాయత్ రైతులను కోరారు. మీ ట్రాక్టర్లను ఇంధనంతో నింపి ఢిల్లీ రావటానికి సిద్ధం కావాలన్నారు . ఎప్పుడైనా మీకు పిలుపునివ్వవచ్చు, అది కమిటీ (రైతు సంఘాలు) నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. ఈ సారి హల్ క్రాంతి ఉంటుందని , దీనిలో రైతులు వ్యవసాయ క్షేత్రాలలో ఉపయోగించే పరికరాలతో ప్రదర్శన నిర్వహిస్తారని ఆయన చెప్పారు .

నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఇంటికి వెళ్ళేది లేదన్న రాకేశ్ టికాయత్
హర్యానాలో మహాపంచాయత్ తర్వాత దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కిసాన్ మహా పంచాయత్ నిర్వహిస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో మహా పంచాయతీలు నిర్వహిస్తారని రాకేశ్ టికాయత్ చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఘర్ వాపసీ ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఉద్యమం ఉధృతం చెయ్యటంలో భాగంగా రైతులు దేశ వ్యాప్తంగా మహా పంచాయతీలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు .