టీడీపీ కుప్పకూలిపోయింది దాని గురించి చెప్పటం అనవసరం
ఇదిలా ఉంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పై ఫుల్ గా ఫోకస్ చేసిన అధికార వైసీపీ ఉప ఎన్నికల ప్రచారంలో మాత్రం దూసుకుపోతుంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి కొడాలి నాని అటు తెలుగుదేశం పార్టీని, ఇటు బిజెపిని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. తిరుపతిలో బీజేపీ నోటాతో పోటీ పడుతుంది అని, తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయింది, దాని గురించి చెప్పుకోవడం అనవసరం అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు .

తిరుపతి ఉప ఎన్నికల్లోనూ చంద్రబాబుకు పలాయనం తప్పదు
జగన్నాథ రథ చక్రాలు ఆపాలి అనుకుంటే చంద్రబాబు జీవితం సరిపోదని పేర్కొన్న కొడాలి నాని తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు పరాభవం తప్పదని పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు కు డిపాజిట్లు కూడా రావని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ పలాయనం చిత్తగించింది అని కొడాలి నాని ఎద్దేవా చేశారు . ఓటమి భయమే చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు కారణం అన్నారు .

ప్రతిపక్షాలు పాక్షిక రాజకీయ సన్యాసం చేస్తూ స్థానిక ఎన్నికలకు దూరం
అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లోనే మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను అమలు చేసిన సీఎంకు ప్రజలు అందిస్తున్న ఆదరాభిమానాలను చూసి ప్రతిపక్షాలు పాక్షిక రాజకీయ సన్యాసం చేస్తూ స్థానిక ఎన్నికలకు దూరం అయ్యాయని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు కూడా రావు అన్న కొడాలి నాని తిరుపతి ఉప ఎన్నికలకు దేవినేని ఉమని ఇన్చార్జిగా వేసి ఏం సాధించాలని అనుకుంటున్నారు అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో దేవినేని ఉమా ఏం చేస్తాడు ? టీడీపీని గెలిపిస్తాడా
సొంత నియోజకవర్గాల్లో సర్పంచులను కూడా గెలిపించుకోలేకపోయిన దేవినేని ఉమా తిరుపతిలో టీడీపీని గెలిపిస్తాడంట అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు . తిరుమలలో తలనీలాలు స్మగ్లింగ్ చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారని పేర్కొన్న మంత్రి కొడాలి నాని , దేవుడి సొమ్ము కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం సీఎం వైఎస్ జగన్ కు లేదని తేల్చి చెప్పారు . దేవుడు మీద ఆయనకు అపారమైన ప్రేమ, నమ్మకం ఉన్నాయని, అందుకే ఎప్పుడూ దేవుడి దయ ను, ప్రజల ఆశీస్సులను గుర్తు చేస్తూ పని చేద్దామని చెప్తారని పేర్కొన్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్న కొడాలి నాని రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల పై తాజా ఈ పరిణామాల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.