వివేకా హత్యపై విజయమ్మ…
‘వివేకా హత్య చేసిన వారు ఎంతటివారైనా శిక్షించాలన్నదే మా అందరి అభిప్రాయం. హంతకులను శిక్షించాలన్న సునీత డిమాండ్‌కు మా అందరి మద్దతు ఉంటుంది. సీబీఐ దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుందని తెలిసి కూడా పవన్ విమర్శలు చేస్తున్నారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో ఆదినారాయణరెడ్డిని స్టేజీ మీద పెట్టుకుని పవన్ మా కుటుంబంపై విమర్శలు చేశారు. వివేకా హత్య సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రెండున్నర నెలలు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగారు. గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలున్నాయి.’ అని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.

నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందే : విజయమ్మ
వైఎస్ జగన్‌పై 2018లో హత్యాయత్నం జరిగినప్పుడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారని విజయమ్మ గుర్తుచేశారు.ఈ రెండు కేసులనూ సీబీఐ, ఎన్‌ఐనే దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. వివేకా హత్య కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందేనని… దోషులకు శిక్ష పడాలని సునీతతో పాటు తాము కూడా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సీబీఐ దర్యాప్తు జరుపుతున్న కేసుల్లో ఆయన మాత్రం ఏం చేయగలరని ప్రశ్నించారు. వైఎస్ఆర్ మరణం సహజమా, లేక హత్యా అన్న అనుమానం ఆ రోజు అందరిలో ఉందని… మాకూ ఆ అనుమానం ఉందని… కానీ అప్పుడైనా మేం ఏం చేయగలిగామని అన్నారు.

జగన్-షర్మిల మధ్య విభేదాలున్నాయా..?
ఇక జగన్-షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారంపై విజయమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని షర్మిలమ్మ నమ్ముతుందన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని అన్నారు. అందుకే తెలంగాణలో షర్మిల ముందడుగు వేస్తోందని చెప్పారు. కానీ తన బిడ్డల మధ్య విభేదాలు తీసుకురావాలన్న దిగజారుడు ప్రయత్నం ఎల్లో మీడియా రాతల్లో కనిపిస్తోందన్నారు. అది ఏనాడు జరగదని స్పష్టం చేశారు.

భిన్నాభిప్రాయాలే తప్ప…
పొరుగు రాష్ట్రంతో సంబంధాలు కోరుకొంటున్న నేపథ్యంలో తెలంగాణలో వైసీపీని నడపడం సాధ్యం కాదని జగన్ నిర్ణయించుకున్నారని విజయమ్మ చెప్పారు. అయితే తెలంగాణ కోడలిగా ప్రజాసేవ చేసేందుకు షర్మిల నిర్ణయం తీసుకుందని అన్నారు. జగన్, షర్మిల మధ్య భిన్నాభిప్రాయాలు తప్ప విభేదాలు లేవన్నారు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చారు.