బీజేపీ , జనసేనల కోసం ప్రచారం చేస్తానన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని
ఇదే సమయంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి అభ్యర్థులు నామినేషన్ నుండి ఉపసంహరించుకున్న చోట తాను జనసేన, బిజెపి నేతల కోసం ప్రచారం చేస్తానని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసి వారు విత్ డ్రా చేసుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఏలూరు కార్పొరేషన్లో ఎన్నికలలో చోటుచేసుకుంటున్న పరిణామాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చింతమనేని ప్రభాకర్.

పార్టీని నమ్ముకున్న వారికి తాను అండగా ఉంటానన్న చింతమనేని ప్రభాకర్
టిడిపి నుంచి పోటీ చేసిన కొందరు అభ్యర్థులు పోటీ నుండి వైదొలగి కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని చింతమనేని మండిపడ్డారు. పార్టీని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందని పార్టీని అమ్ముకునే వారికి భవిష్యత్తు ఉండదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. టీడీపీని నమ్ముకున్న వారికి తాను అండగా ఉంటానని పేర్కొన్నారు చింతమనేని ప్రభాకర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏలూరు కార్పొరేషన్లో వైసీపీ జెండా ఎగరనివ్వనని తేల్చి చెప్పారు.

టిడిపి అభ్యర్థులు నామినేషన్ లు ఉపసంహరించుకున్న డివిజన్లలో జనసేన, బీజేపీ నేతల కోసం ప్రచారం
టిడిపి అభ్యర్థులు నామినేషన్ లు ఉపసంహరించుకున్న డివిజన్లలో తాను జనసేన, బీజేపీ నేతల కోసం ప్రచారం చేస్తానని చింతమనేని ప్రభాకర్ తేల్చిచెప్పారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ హోరాహోరీగా తలపడ్డారు. వైసిపికి గట్టి పోటీ ఇచ్చారు. ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి . అయినప్పటికీ పార్టీ కోసం ఆయన కీలకంగా పని చేసి చాలా స్థానాలలో విజయం సాధించేలా చేశారు . ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చింతమనేని తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నారు.