Tuesday, May 17, 2022

జీలాండియా: మునిగిపోయిన ఎనిమిదో ఖండంలో మరుగునపడిన రహస్యాలు

International

-BBC Telugu

By BBC News తెలుగు

|

సముద్రం

Click here to see the BBC interactive

ప్రపంచంలోని ఎనిమిదో ఖండం మన కళ్ల ముందే దాగివున్నా.. దానిని కనుగొనటానికి శాస్త్రవేత్తలకు 375 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ ఖండానికి సంబంధించిన రహస్యాలు ఇప్పటికీ వెలుగుచూడలేదు.

అది 1642 సంవత్సరం. అబెల్ టాస్మాన్ ఒక లక్ష్యంతో బయలుదేరారు. అతడు అనుభవజ్ఞుడైన డచ్ నావికుడు. దక్షిణార్ధగోళంలో ఒక విస్తారమైన భూ ఖండం ఉందని బలంగా నమ్మేవాడు. దానిని వెదికి పట్టుకోవాలన్నది అతడి సంకల్పం.

ఆ కాలంలో భూగోళం మీద దక్షిణ భాగం యూరోపియన్ అన్వేషకులకు చాలావరకూ తెలియదు. కానీ అక్కడ పెద్ద భూభాగం ఉండి తీరాలని వారి అచంచల విశ్వాసం. ఆ భూభాగానికి వారు ముందుగానే టెర్రా ఆస్ట్రేలియా అని పేరు కూడా పెట్టారు. ఈ భూఖండం ఉనికి గురించి ప్రాచీన రోమన్ కాలంలోనే ఒక నమ్మకం ఏర్పడింది. అయితే ఆ నమ్మకాన్ని పరిశీలించే సమయం మాత్రం 16వ శతాబ్దానికి కానీ రాలేదు.

టాస్మాన్ 1642 ఆగస్టు 14న ఇండోనేషియాలోని జకార్తా నుంచి రెండు చిన్న ఓడలతో బయలుదేరాడు. తొలుత పశ్చిమ దిశగా పయనించాడు. తరువాత దక్షిణానికి మళ్లాడు. ఆ తరువాత తూర్పు వైపు సాగాడు. చివరికి నేటి న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌కు చేరాడు. అక్కడి ఆదివాసీలైన మావోరి ప్రజలతో అతని మొదటి అనుభవం బెడిసికొట్టింది. రెండో రోజు కొంత మంది నావికులు చిన్నపడవపై బయలుదేరి.. డచ్ ఓడల మధ్య సందేశాలను చేరవేసే ఒక చిన్న పడవను ఢీకొట్టారు. ఆ ఘటనలో నలుగురు యూరోపియన్లు చనిపోయారు. యూరోపియన్లు ఆ తరువాత మరో 11 మావోరీల పడవలపై ఫిరంగితో కాల్పులు జరిపారు. ఆ పడవల్లోని వారికి ఏమైందో ఎవరికీ తెలీదు.

టాస్మాన్ ప్రయాణం అక్కడితో ముగిసింది. కొన్ని వారాల తర్వాత.. ఆ కొత్త భూమిపై అడుగు పెట్టకుండానే వెనుదిరిగాడు. ఆ ప్రదేశానికి మూర్డెనార్స్ (హంతకుల) బే అని పేరు పెట్టాడు. ఒక భారీ దక్షిణ భూ ఖండాన్ని నిజంగా కనుగొన్నానని అతడు నమ్మాడు. కానీ.. అతడు ఆశించినట్లు అదేమీ వాణిజ్య స్వర్గధామం కాదని తేలింది. అతడు మళ్లీ ఆ ప్రాంతానికి తిరిగి వెళ్లలేదు.

న్యూజీలాండ్

(ఆ కాలానికి నేటి ఆస్ట్రేలియా గురించి బాగానే తెలుసు. అయితే.. దక్షిణార్థగోళంలో తాము వెదుకుతున్న పురాతన భారీ భూఖండం అదేనని యూరోపియన్లు భావించలేదు.) వారి ఆలోచనలు మారిన తర్వాత ఈ ఖండానికే టెర్రా ఆస్ట్రేలిస్ అని పేరు పెట్టారు).

అయితే.. దక్షిణార్థగోళంలో భారీ భూకండం గురించి తన అంచనా ఆసాంతం సరైనదేనని టాస్మాన్‌కు ఏమాత్రం తెలియదు. కనిపించకుండాపోయిన భూ ఖండం ఒకటి ఉంది.

జీలాండియా (మావోరి భాషలో టే రియు-ఎ-మాయి) అనే భూ ఖండాన్ని కనుగొన్నట్లు జియాలజిస్టులు ప్రకటించారు. అది పతాక శీర్షికలకు ఎక్కింది. ఆ భారీ భూఖండం సుమారు 18.9 లక్షల చదరపు మైళ్ళు (49 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తరించివుంది. మడగాస్కర్ కంటే ఆరు రెట్లు పెద్దది.

ప్రపంచంలో ఏడు ఖండాలు మాత్రమే ఉన్నాయని ఎన్‌సైక్లోపీడియాలు, మ్యాప్‌లు, సెర్చ్ ఇంజన్లు కొంత కాలం మొండికేసినప్పటికీ.. అది తప్పు అని సదరు పరిశోధకుల బృందం ప్రపంచానికి ధీమాగా తెలియజేసింది. మొత్తానికి భూమి మీద ఎనిమిది ఖండాలు ఉన్నాయి. సరికొత్తగా జాబితాలో చేరిన ఈ ఎనిమిదో ఖండం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది – ఇది ప్రపంచంలోని అతిచిన్న ఖండం, అతి సన్నని ఖండం, అతి పిన్న వయసు ఖండం. అసలు విషయం ఏమిటంటే.. ఈ ఖండంలో 94 శాతం ప్రాంతం సముద్ర జలాల్లో దాగి వుంది. న్యూజీలాండ్ వంటి కొన్ని ద్వీపాలు నీటిపైకి చొచ్చుకువచ్చాయి. ఇన్నాళ్లుగా ఈ ఖండం మన కళ్లముందే దాక్కుని ఉంది.

“చాలా స్పష్టంగా కనిపించేదే అయినా తెలుసుకోవటానికి కొంత సమయం పడుతుందనేందుకు ఇది ఒక ఉదాహరణ” అంటారు న్యూజీలాండ్ క్రౌన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జీఎన్ఎస్ సైన్స్‌లో భూవిజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆండీ తుల్లోచ్.

కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ ఖండం ఉనికి గురించి ప్రపంచానికి చాటి నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఇంకా ఈ ఖండం రహస్యాలు నీటి కింద 6,560 అడుగుల (2 కిలోమీటర్ల) లోతులో దాగే ఉన్నాయి. ఇది ఎలా ఏర్పడింది? అక్కడ ఏవి నివసించేవి? ఎంతకాలంగా నీటిలో మునిగివుంది?

ఎలుక

ఎంతో శ్రమ…

నిజానికి, జీలాండియాను అధ్యయనం చేయటం ఎప్పుడూ చాలా కష్టంగానే ఉంది.

1642లో టాస్మాన్ న్యూజీలాండ్‌ను కనుగొన్న రెండు దశాబ్దాల తరువాత.. బ్రిటన్‌ తమ మ్యాప్ రూపకర్త జేమ్స్ కుక్‌ను దక్షిణార్ధగోళంలో శాస్త్రీయ పరిశోధన కోసం సముద్రయానానికి పంపించింది. సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో లెక్కించటం కోసం.. భూమికి, సూర్యుడికి మధ్య శుక్రుడు ప్రయాణించడాన్ని అధ్యయనం చేయాలని అతడికి అధికారికంగా నిర్దేశించారు.

అయితే ఒక సీల్డు కవరు కూడా అతడికి ఇచ్చిపంపారు. అధికారికంగా నిర్దేశించిన పనిని పూర్తి చేసిన తర్వాత ఆ కవరును తెరిచి చూడాలని ఆదేశించారు. దక్షిణార్థ గోళంలోని భూ ఖండాన్ని కనుగొనే అత్యంత రహస్య కార్యక్రమం చేపట్టాలనే ఆదేశం ఆ సీల్డు కవరులో ఉంది. అంటే.. అతడు న్యూజీలాండ్ చేరుకోవడానికి ముందుగానే ఆ భూ ఖండం మీదుగా ప్రయాణించాడనేది స్పష్టం.

1895లో న్యూజీలాండ్ దక్షిణ తీరంలోని ద్వీపాల శ్రేణిని సర్వే చేయడానికి సముద్రయానం చేసిన స్కాటిష్ ప్రకృతి శాస్త్రవేత్త సర్ జేమ్స్ హెక్టార్.. జీలాండియా ఉనికి గురించి మొట్టమొదటి నిజమైన ఆధారాలను సేకరించారు. ఆ దీవుల భౌగోళిక, భూగర్భ పరిస్థితులను అధ్యయనం చేసిన ఆయన.. న్యూజీలాండ్ అనేది “దక్షిణానికి, తూర్పుకు సుదూరంగా విస్తరించి ఉన్న ఒక భారీ ఖండానికి చెందిన ఒక పర్వత శ్రేణి అవశేషం.. ఆ భూఖండం ఇప్పుడు నీటిలో మునిగి ఉంది…” అని నిర్ధారించారు.

చాలా ముందుగానే ఈ విషయాన్ని కనుగొన్నప్పటికీ.. జీలాండియా గురించి తెలుసుకోగలిగిన అవకాశం మరుగునపడిపోయింద. ఈ విషయంలో 1960ల వరకు పెద్ద పురోగతి లేదు. “ఈ రంగంలో పరిణామాలు చాలా నెమ్మదిగా జరుగుతాయి” అని 2017 అధ్యయనానికి నాయకత్వం వహించిన జీఎన్ఎస్ సైన్స్ జియాలజిస్ట్ నిక్ మార్టిమెర్ చెప్పారు.

బొమ్మలు

ఒక ఖండం అంటే ఏమిటి అనేదానిని చివరికి 1960 లలో భూగర్భ శాస్త్రవేత్తలు నిర్వచించారు – విస్తృతార్థంలో.. సముద్రమట్టానికి అధిక ఎత్తులో, అనేక రకాల రాళ్ళతో మందపాటి ఉపరితలం గల ప్రాంతం. అది పెద్దదిగా కూడా ఉండాలి. “ఏదో చిన్న తునకగా కాదు” అంటారు మార్టిమెర్. దీంతో భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పనిలో పట్టారు. తగిన ఆధారాలను సేకరించగలిగితే, ఎనిమిదో ఖండం నిజంగా ఉందని నిరూపించవచ్చు.

అయినప్పటికీ పని ఆగిపోయింది. ఎందుకంటే ఒక ఖండాన్ని కనుగొనడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. అంతేకాదు.. అదంత అత్యవసరమైన పరిశోధన కూడా కాదు అని మార్టిమెర్ అభిప్రాయపడ్డారు. మళ్లీ 1995లో అమెరికన్ జియోఫిజిసిస్ట్ బ్రూస్ లుయెండిక్ ఈ ప్రాంతాన్ని ఒక ఖండంగా అభివర్ణించారు. దీనికి జీలాండియా అని పేరు పెట్టొచ్చని సూచించారు. అప్పటినుంచి ఈ ఖండాన్ని కనుగొనే ప్రక్రియ చాలా ఊపందుకుందని తుల్లోచ్ చెప్పారు.

దాదాపు అదే సమయంలో “సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి తీర్మానం” అమల్లోకి వచ్చింది. అది మరింత ప్రేరణను అందించింది. దేశాలు తమ చట్టబద్దమైన భూభాగాలను తమ ప్రత్యేక ఆర్థిక ప్రాంతానికి మించి విస్తరించవచ్చునని ఆ తీర్మానం పేర్కొంది. అది వారి తీరప్రాంతాల నుండి 200 నాటికల్ మైళ్ళ (370 కిలోమీటర్లు) వరకూ ఉండొచ్చు. ఆ ప్రాంతాన్ని తమ దేశపు “విస్తరిత ఖండాంతర ప్రాంతం”గా చాటుకోవచ్చు. అక్కడ చేపలుపట్టే హక్కులు, ఆ ప్రాంతంలోని ఖనిజ సంపద, చమురు మీద కూడా ఆ దేశానికి హక్కు ఉంటుంది.

న్యూజీలాండ్.. తమ దేశం ఒక పెద్ద భూ ఖండంలో భాగమని నిరూపించగలిగితే.. ఆ దేశపు భూపరిధి ఏకంగా ఆరు రెట్లు పెరుగుతుంది. అకస్మాత్తుగా ఈ ప్రాంతాన్ని సర్వే చేయడానికి నిధులు సమృద్ధిగా వచ్చాయి. దీంతో జీలాండియా ఉనికికి సంబంధించిన ఆధారాలు ఒక్కటొక్కటిగా పెరుగుతూ పోయాయి.

మ్యాప్

చివరి ఆధారాలు ఉపగ్రహ సమాచారం ద్వారా లభించింది. ఇది సముద్రంలో అడుగు భాగాన్ని మ్యాప్ చేయడానికి భూభాగం ఉపరితలంలోని వివిధ ప్రాంతాలలో భూమి గురుత్వాకర్షణలో గల చిన్నపాటి వ్యత్యాసాలను సైతం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో జీలాండియా.. దాదాపు ఆస్ట్రేలియా అంత పరిమాణంలో నీటిలో మునిగివున్న భూఖండమనే విషయం స్పష్టంగా కనిపించింది.

ఈ ఖండం గురించి చివరికి ప్రపంచానికి తెలిసినపుడు.. ప్రపంచంలోని అతి పెద్ద సముద్ర భూభాగాలకు కూడా తలుపులు తెరుచుకున్నాయి. “భూగ్రహం మీది ప్రతి ఖండం మీదా వేర్వేరు దేశాలు ఉన్నాయి.. కానీ జిలాండియాలో కేవలం మూడు ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి” అని మార్టిమెర్ పేర్కొన్నారు.

న్యూజీలాండ్‌తో పాటు, ఫ్రెంచ్ కాలనీ అయిన న్యూ కాలెడోనియా దీవి, ఆస్ట్రేలియా భూభాలైన లార్డ్ హోవే దీవి, బాల్స్ పిరమిడ్.. ఈ కొత్త ఖండంలో ఉన్నాయి. బాల్స్ పిరమిడ్ అనేది “ఒక పడవ కంటే పెద్దదిగా ఉండదు” అని తరువాతి 18వ శతాబ్దపు అన్వేషకుడు ఒకరు వర్ణించారు.

అడవులు

మార్మిక విస్తరణ…

జీలాండియా వాస్తవానికి.. దాదాపు 55 కోట్ల సంవత్సరాల కిందట.. దక్షిణార్ధగోళంలోని భూభాగాలన్నిటితో కలిసి ఏర్పడిన పురాతన భారీ ఖండం గోండ్వానాలో ఒక భాగంగా ఉండేది. గోండ్వానాలో తూర్పు వైపున ఒక మూలగా ఉండేది జీలాండియా. పశ్చిమ అంటార్కిటికాలో సగభాగం, తూర్పు ఆస్ట్రేలియా పూర్తి ప్రాంతంతో పాటు పలు భూభాగాలు దీనికి సరిహద్దులుగా ఉండేవి.

సుమారు 10.5 కోట్ల సంవత్సరాల కిందట.. “మనకు ఇంకా పూర్తిగా అర్థం కాని ఒక ప్రక్రియ కారణంగా.. జీలాండియా వేరుపడటం ప్రారంభమైంది” అని తుల్లోచ్ చెప్పారు.

సముద్ర భూభాగం ఉపరితలం సుమారు 10 కిలోమీటర్ల మందం వరకూ ఉంటే.. ఖండాల భూభాగం ఉపరితలం సాధారణంగా 40 కిలోమీటర్ల మందం వరకూ ఉంటుంది. జీలాండియా చాలా ఒత్తిడికి గురై.. చాలా ఎక్కువగా సాగదీతకు లోనైంది. దీంతో దాని ఉపరితలం మందం కేవలం 20 కిలోమీటర్లకు తగ్గిపోయింది. సన్నని పొరలా సాగిన ఈ ఖండం చివరికి సముద్రంలో మునిగిపోయింది.

జీలాండియా సన్నగా ఉన్నా, నీటిలో మునిగిపోయి ఉన్నా.. ఇందులో కనిపించే రాళ్లను బట్టి అది ఒక ఖండమని జియాలజిస్టులు తెలుసుకున్నారు. భూఖండపు ఉపరితలం.. గ్రానైట్, సున్నపురాయి, అభ్రకము వంటి అగ్నిశిలలు, రూపాంతరితశిలలు, అవక్షేపణ శిలలతో తయారవుతుంది. అదే సముద్రపు అడుగుభాగమైతే సాధారణంగా బసాల్ట్ (నల్లపింగాణి) వంటి అగ్నిశిలలతో తయారవుతుంది.

కానీ ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎనిమిదో ఖండపు అసాధారణ మూలాలు.. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల్లో కాస్త ఆశ్చర్యాన్ని, ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఉదాహరణకు.. జీలాండియా చాలా సన్నగా ఉన్నాకూడా చిన్నచిన్న సూక్ష్మ ఖండాలుగా విచ్ఛిన్నం కాకుండా ఎలా కలిసివుందో ఇప్పటికీ అంతుచిక్కలేదు.

అసలు జీలాండియా నీటిలో ఎప్పుడు మునిగింది? ఎప్పుడైనా దీంట్లో పొడి భూమి ఉందా? అనేవీ రహస్యాలుగానే ఉన్నాయి. ప్రస్తుతం సముద్ర మట్టానికి పైన ఉన్న భాగాలు.. పసిఫిక్, ఆస్ట్రేలియా టెక్టానిక్ ప్లేట్లు ఒకదానినొకటి ఢీకొట్టినప్పుడు ఏర్పడిన పర్వతశ్రేణులు. ఇందులోని కొన్ని చిన్న దీవులు మినహా మిగతా ప్రాంతమంతా ఎల్లప్పుడూ నీటిలో మునిగే ఉందా, లేదంటే ఒకప్పుడు పూర్తిగా పొడి భూమిగా ఉందా అనే అంశంపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తుల్లోచ్ చెప్పారు.

ఒకప్పుడు పూర్తిగా పొడి భూమిగా ఉంటే.. అక్కడ ఏ ప్రాణులు నివసించాయి అనే ప్రశ్న కూడా తలెత్తుంది.

తేలికపాటి వాతావరణంతో 3.9 లక్షల చదరపు మైళ్ల (10.1 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంలో ఉన్న గోండ్వానాలో విస్తారమైన వృక్ష, జంతుజాలాలు నివసించేవి. వీటిలో.. భూమిమీది మొట్టమొదటి నాలుగు-అవయవాల జంతువు, ఆ తరువాతి కాలంలో.. భూమి మీద నివసించిన జంతువుల్లోకెల్లా అతిపెద్దదైన టైటానోసారస్ కూడా ఉన్నాయి. మరైతే.. జీలాండియా శిలలలో ఒకప్పుడు నివశించిన జీవుల అవశేషాలు కనిపిస్తాయా?

డైనోసార్

డైనోసార్లు…

దక్షిణార్ధగోళంలో ప్రాచీన జంతువుల శిలాజాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ 1990 లలో న్యూజీలాండ్‌లో అనేక అవశేషాలు బయటపడ్డాయి. వీటిలో పొడవాటి తోక, పొడవాటి మెడ గల ఒక పెద్ద డైనోసార్ (సారోపాడ్) పక్కటెముక, పొడవాటి ముక్కు గల శాకాహార డైనోసార్ ( హిప్సిలోఫోడాంట్), దృఢమైన చర్మం గల మరొక డైనోసార్ (యాంకైలోసార్) ఉన్నాయి. మళ్లీ 2006లో సౌత్ ఐలాండ్‌కు తూర్పున 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాతం ఐలాండ్లలో ఒక పెద్ద మాంసాహార డైనోసార్ – బహుశా ఒక రకమైన అలోసార్ కావచ్చు – పాదం ఎముక దొరికింది. కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ శిలాజాల కాలాన్ని పరిశీలించినపుడు.. అవన్నీ గోండ్వానా నుండి జీలాండియా ఖండం విడిపోయిన తర్వాతి కాలానివేనని తేలింది.

అయితే జీలాండియా అంతటా డైనోసార్‌లు సంచరిస్తూ ఉండేవని దీని అర్థం కాదు. మిగతా ప్రాంతమంతా ఇప్పటిలా నీటిలో మునిగిపోతే.. మిగిలిన దీవులు డైనోసార్లకు అభయారణ్యాలుగా ఉపయోగపడి ఉండొచ్చు.

ఇక న్యూజీలాండ్‌లో అతి చిత్రమైన, అత్యంత ప్రియమైన జీవుల్లో ఒకటైన కివీ పక్షి విషయాన్ని చూసినపుడు కథ మరింత రక్తికడుతుంది. విచిత్రమేమిటంటే.. 800 ఏళ్ల కిందటి వరకూ మడగాస్కర్ అడవుల్లో సంచరించిన ఒక భారీ ఏనుగు పక్షిని న్యూజీలాండ్‌లో మాత్రమే కనిపించే కివి పక్షికి అత్యంత దగ్గరి బంధువుగా పరిశోధకులు గుర్తించారు.

దీంతో ఈ రెండు పక్షులు.. గోండ్వానాలో నివసించిన ఒకే మూల పక్షి నుంచి ఉద్భవించాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గోండ్వానా పూర్తిస్థాయిలో ముక్కలుగా విడిపడటానికి 13 కోట్ల సంవత్సరాలు పట్టింది. కానీ అలా విడిపోయినపుడు.. దాని శకలాలు భూగోళమంతటా వ్యాపించాయి. ఆ శకలాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, అరేబియా ద్వీపకల్పం, భారత ఉపఖండం, జీలాండియాలుగా ఏర్పడ్డాయి.

సముద్ర తీరం

ఈ విషయం.. ఇప్పుడు మునిగిపోయివున్న జీలాండియాలో కొంత భాగం ఆ 13 కోట్ల సంవత్సరాల పాటు సముద్ర మట్టానికి పైనే ఉందని సూచిస్తుంది. అయితే.. సుమారు 2.5 కోట్ల సంవత్సరాల కిందట ఈ ఖండం మొత్తం – బహుశా న్యూజీలాండ్ మొత్తం కూడా – నీటి అడుగున మునిగిపోయినట్లు భావిస్తున్నారు. “ఆ తర్వాతే దీనిమీద మొక్కలు, జంతువులు ఆక్రమించి ఉంటాయని భావిస్తున్నారు” అని సదర్లాండ్ చెప్పారు. మరి ఏం జరిగింది?

సముద్రంలో ఉన్న జీలాండియా ఉపరితలం నుండి నేరుగా శిలాజాలను సేకరించడం సాధ్యం కాదు. అయితే.. శాస్త్రవేత్తలు డ్రిల్లింగ్ ద్వారా పైపులు పంపిస్తున్నారు. “నిజానికి పెద్ద లోతులేని సముద్రాలలో ఏర్పడే శిలాజాలు విలక్షణంగా ఉంటాయి. చాలా ఉపయోగపడతాయి” అని సదర్లాండ్ పేర్కొన్నారు. “ఎందుకంటే.. అవి చరిత్రను నమోదు చేస్తాయి. చాలా విలక్షణమైన చిన్న, చిన్న, సూక్ష్మ శిలాజాలు కోటానుకోట్లుగా ఉన్నాయి” అని తెలిపారు.

2017లో ఒక బృందం ఈ ప్రాంతాన్ని సర్వే చేయటానికి అత్యంత విస్తృత కార్యక్రమం చేపట్టింది. ఆరు వేర్వేరు ప్రదేశాలలో సముద్ర గర్భంలో 4,101 అడుగుల (1,250 మీటర్లు) కంటే ఎక్కువ డ్రిల్లింగ్ చేసింది. వారు సేకరించిన అంతర్భాగాల్లో.. భూమి మీద మొక్కల పుప్పొడితో పాటు.. వెచ్చని, లోతులేని సముద్ర జలాల్లో నివసించే జీవుల చిప్పలు ఉన్నాయి. దీనినిబట్టి జీలాండియా అంతకుముందు అనుకున్నట్లుగా పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండగల అవకాశం లేదని తెలుస్తోంది.

మ్యాప్

ఓ చిన్న మెలిక…

ఇక జీలాండియా ఆకారంలోనూ మరొక రహస్యం దాగివుంది.

“న్యూజీలాండ్ భౌగోళిక పటాన్ని పరిశీలిస్తే.. రెండు విషయాలు విశిష్టంగా కనిపిస్తాయి” అని సదర్లాండ్ చెప్పారు. ఒకటి ఆల్పైన్ ఫాల్ట్. ఇది సౌత్ ఐలాండ్ వెంట పళ్లెంలా కనిపించే సరిహద్దు. ఇది ఎంత ప్రస్ఫుటంగా ఉంటుందంటే.. అంతరిక్షం నుంచి కూడా దీనిని చూడవచ్చు.

రెండోది.. న్యూజీలాండ్ భౌగోళిక స్వరూపం – దానితో పాటు అదివున్న విస్తృత ఖండం కూడా – విచిత్రంగా వంగిపోయి ఉంటుంది. పసిఫిక్, ఆస్ట్రేలియన్ టెక్టానిక్ ప్లేట్లు కలిసే దగ్గర.. ఇవి రెండూ ఒక సమాంతర రేఖ ద్వారా రెండుగా విభజితమైనట్లు కనిపిస్తాయి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో.. దిగువ సగభాగాన్ని ఎవరో మెలితిప్పేసినట్లుగా కనిపిస్తుంది. అక్కడివరకూ కొనసాగిన రాళ్ల వరుసలు అక్కడి నుంచి వరుసలో ఉండవు.

ఈ టెక్టానిక్ ప్లేట్లు కదిలిపోయి.. ఏదో కారణంవల్ల తమ ఆకారాన్ని కోల్పోయి ఉంటాయనేది ఒక వివరణ. కానీ ఇది ఎలా, ఎప్పుడు జరిగిందనే రహస్యం ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది.

జీలాండియా ఖండంలో దాగిన ఈ రహస్యాలు ఇప్పట్లో పరిష్కారం అయ్యే అవకాశం లేదంటారు సదర్లాండ్. “అన్నీ నీటిలో రెండు కిలోమీటర్ల లోతులో ఉన్నపుడు కొత్త విషయాలు కనుగొనటం చాలా కష్టం. నమూనాలు సేకరించాల్సిన భూమి పొరలు సైతం సముద్రగర్భం కింద 500 మీటర్ల లోతులో ఉన్నాయి” అని ఆయన వివరించారు. “ఇటువంటి ఖండంలో అన్వేషణ కొనసాగించటం నిజంగా సవాళ్లతో కూడుకున్న పని. ఇందుకోసం చాలా సమయం, డబ్బు, కృషి అవసరం” అని ఆయన పేర్కొన్నారు.

జీలాండియాకు సంబంధించి ఎన్నో రహస్యాలు ఇంకా వెలుగుచూడకపోయినా.. ప్రపంచంలోని ఈ ఎనిమిదో ఖండం ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చాటుతోంది. టాస్మాన్ అన్వేషణ మొదలుపెట్టిన దాదాపు 400 సంవత్సరాల తరువాత కూడా.. కనుగొనాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.

(జరియా గార్వెట్.. బీబీసీ ఫ్యూచర్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe