పదవీ విరమణ చేసిన అర్చకులకు అవకాశం కల్పించిన టీటీడీ
టిటిడి బోర్డు రిటైర్డ్ అర్చకులకు సంబంధించి ఆలయంలో పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లో చేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉత్తర్వులను సైతం జారీ చేసింది. అర్చకుల పదవీ విరమణ పై మే 16 2018 లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పదవి విరమణ వయస్సును నిర్ణయించి, అది దాటిన వారిని పదవీ విరమణ చేయవలసిందిగా ఉత్తర్వులను జారీ చేసింది. అప్పుడు రమణ దీక్షితులతో పాటు పలువురు అర్చకులు ఉద్యోగాలను కోల్పోయారు .

గత ప్రభుత్వ పదవీవిరమణ వయసు నిర్ణయంతో రిటైర్ అయిన పలువురు అర్చకులు
అప్పుడు నలుగురు ప్రధాన అర్చకుల తో పాటు గా మరి కొంత మంది అర్చకులు పదవీ విరమణ చేశారు . ఆ తరువాతి కాలంలో కూడా అదే అనవాయితీ కొనసాగింది. అయితే 2018 లో టిటిడి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్చకులు కోర్టును ఆశ్రయించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులను వయసుమళ్ళిన వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది.
అయితే వారు వయోభారం వల్ల స్వామి వారి కైంకర్యాలు చేయలేరనే ఉద్దేశంతో పాలకమండలి కోర్టు తీర్పును అమలు చేయలేదు .

కోర్టు తీర్పుతో తాజా ఉత్తర్వులు … రమణ దీక్షితులకు అవకాశం
కానీ ప్రస్తుతం టీటీడీ బోర్డు 38118 / 2018 హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. టిటిడి నిర్ణయంతో గతంలో రిటైర్ అయిన రమణదీక్షితులు తిరిగి ప్రధాన అర్చకులు హోదాలో విధుల్లో చేరనున్నారు . అయితే ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఆ పోస్ట్ లోనే కొనసాగుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ టీటీడీ తాజా నిర్ణయంతో రమణ దీక్షితులు ఎంట్రీ ఖాయమైంది . తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న తాజా నిర్ణయంతో పట్ల మాజీ అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో స్వామి ఆలయంలో అక్రమాలపై రమణ దీక్షితులు సంచలనం
గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో రమణ దీక్షితులు శ్రీవారి ఆలయానికి సంబంధించి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . స్వామి వారి ఆభరణాల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. స్వామి వారి పోటులో కూడా తవ్వకాలు జరిపినట్టు ఆయన ఆరోపించారు . అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం దావా వేసింది . గత ప్రభుత్వం దాఖలు చేసిన పరువు నష్టం దావాను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకోవటంతో రమణ దీక్షితులకు రీ ఎంట్రీ సుగమం అయింది .

రిటైర్డ్ అర్చకుల రీ ఎంట్రీ ఉత్తర్వులతో తెరపైకి రమణ దీక్షితులు
గత నెలలో టీటీడీ రమణ దీక్షితులను ఆగమ శాస్త్ర సలహామండలి సభ్యుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది . కానీ అనూహ్యంగా ఇప్పుడు రిటైర్డ్ అర్చకుల రీ ఎంట్రీ ఉత్తర్వులు ఇచ్చి మరీ స్వామి వారి కైంకర్యాలకు రమణ దీక్షితులకు అవకాశం కల్పించింది . ఆయన కుమారులు వెంకట కుమార్ దీక్షితులు , రాజేష్ దీక్షితులను కూడా గోవింద రాజ స్వామి ఆలయం నుండి శ్రీవారి ప్రధాన ఆలయానికి బదిలీ చేశారు . మొత్తానికి చాలా కాలం పాటు పోరాటం చేసిన రమణ దీక్షితులకు మళ్ళీ ఆలయంలో స్థానం కల్పించింది టీటీడీ .