నష్టం వచ్చి దుకాణం మూసే ముందు డిస్కౌంట్ ఆఫర్ లా .. చంద్రబాబు పరిస్థితి
ఈ ప్రకటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యాపారంలో నష్టం వచ్చి దుకాణం మూసే ముందు సరుకులను 90 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తూ ఉంటారు. దానికి కూడా ఎవరూ రాకపోతే ఫ్రీగా వదిలించుకుంటారు యజమానులు. చంద్రబాబు పరిస్థితి అచ్చం అలాగే ఉంది. ప్రజాక్షేత్రంలో తిరస్కృతుడిగా మిగిలిపోయిన ఆయన ఎన్నికల్లో పోటీకి భయపడుతున్నాడు అంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.

చంద్రబాబు పరిస్థితి దివాలా తీసిన వ్యాపారిలా ఉందని దుకాణం మూసేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మాలోకానిది .. మ్యానుఫాక్చరింగ్ ఫాల్ట్
ఇదే సమయంలో ఏప్రిల్ ఫస్టే కాదు. జీవితమంతా ఫూల్ అవుతూనే ఉంటాడు మాలోకం అంటూ లోకేష్ పై విరుచుకుపడ్డారు . పాపం మ్యానుఫాక్చరింగ్ ఫాల్ట్ అది. రిపేరు చేయడం పచ్చ పార్టీ మేధావుల వల్ల కాలేదు. గ్రేట్ మేనిప్యులేటర్ చంద్రం సారు కూడా చేతులెత్తేశాడు. అందుకే చినబాబు కామెడీకి కొదవ లేకుండా పోయింది అంటూ నారా లోకేష్ ను టార్గెట్ చేశారు . అంతకుముందు 40 శాతం గ్రామపంచాయతీలకు చేసావంటే పచ్చ నేతలు డప్పు కొట్టారని, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని తర్జన భర్జనలు ఏంటి అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో మీ రంగు బయటపడిందనా ? ఓహో ఆ మాత్రం సీట్లు కూడా నిమ్మగడ్డ దయేనా ? పోటీకి ముందే అస్త్రసన్యాసం చేసేస్తారా ? అంటూ ట్వీట్ చేశారు .

సాయిరెడ్డి వ్యాఖ్యలకు అచ్చెన్న కౌంటర్
ఇక విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు కౌంటర్ వేశారు . 3 ఏళ్ళు అసెంబ్లీ బాయికాట్ చేసిన మీరు కూడా మాట్లాడే వాళ్ళే, 2013 లో ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు బాయికాట్ చేసావ్ ?2013 లో కొన్ని జిల్లాల్లో సహకార ఎన్నికలు ఎందుకు బాయికాట్ చేసావ్ ? 2015 లో ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు బాయికాట్ చేసావ్ ? అంటూ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు . 2018లో తెలంగాణా ఎన్నికలకు తోక ఎందుకు ముడిచావ్ ? 2020లో జీహెచ్ఎంసి ఎన్నికలకు తోక ఎందుకు ముడిచావ్ ? 9 ఏళ్ళ నుంచి సిబిఐ ఎంక్వయిరీ ఎందుకు బాయికాట్ చేసావ్ ? ఇన్ని బాయకాట్ చేసిన నువ్వు, పెద్ద పుడింగి లాగా బిల్డ్ అప్ ఇవ్వకు,అసహ్యంగా ఉంటుంది సాయిరెడ్డి అంటూ అచ్చెన్నాయుడు రివర్స్ అటాక్ చేశారు .

ఏపీలో పరిషత్ ఎన్నికల దుమారం .. ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా, పాత నోటిఫికేషన్ నే కొనసాగిస్తూ ఎన్నికల ప్రక్రియ ఆగిన దగ్గరనుండి ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం, కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పటికీ దానిని పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చంద్రబాబు ప్రకటన చేశారు. అక్రమాలు జరిగినా ఎన్నికలనే కొనసాగిస్తున్నారని, ఎస్ఈసి నీలం సాహ్నిని తప్పుపడుతూ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

పరువు పోతుందన్న భయంతోనే ఎన్నికల బహిష్కరణ అంటూ వైసీపీ విమర్శలు
ఇప్పటికే వైసీపీ నేతలు గత పంచాయతీ ఎన్నికల్లోనూ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ చంద్రబాబును తిరస్కరించారని, తెలుగుదేశం పార్టీ కి సమాధి కట్టారని, ఈ నేపథ్యంలోనే పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే టిడిపి భయపడుతుందని ఆరోపిస్తున్నారు. పరువు పోతుందనే భయంతోనే టీడీపీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మరోమారు మాటల యుద్ధానికి తెర తీశాయి .