మతంతో ముడిపెడుతూ దిశా రవిపై ఆరోపణలు
బుధవారం(ఫిబ్రవరి 17) ‘దిశా రవి జోసెఫ్’ పేరు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది. బెంగళూరుకు చెందిన ఈ పర్యావరణ కార్యకర్త అసలు పేరు ఇదేనంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ పేరును ట్రెండ్‌ను చేస్తున్నారు. కేరళకు చెందిన దిశా రవి జోసెఫ్ సిరియన్ క్రిస్టియన్ అని వాదిస్తున్నారు. అంతేకాదు,టూల్‌కిట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నికితా జాకోబ్,పీటర్ ఫ్రెడెరిక్… వీళ్లంతా క్రిస్టియన్లేనని… దేశాన్ని ముక్కలు చేసేందుకు వీళ్లే ఎప్పుడూ ముందుంటారని విమర్శిస్తున్నారు. నటుడు గజేంద్ర చౌహాన్‌తో పాటు సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ పటేల్ కూడా ఈ విమర్శలు చేసినవారిలో ఉన్నారు.

ఏపీ మాజీ ఎంపీ గీత విమర్శలు…
మాజీ ఎంపీ,బీజేపీ నేత కొత్తపల్లి గీత కూడా దిశా రవి ‘జోసెఫ్’ అంటూ జరుగుతున్న ప్రచారంపై ట్విట్టర్లో స్పందించారు. ఓ నెటిజన్ దిశ పూర్తి వివరాలు వెల్లడిస్తూ.. ఆమె పేరు దిశా అన్నప్ప రవి, తల్లి పేరు మంజుల నంజయ్య,తండ్రి పేరు రవి అని పేర్కొన్నాడు.దీనిపై స్పందించిన కొత్తపల్లి గీత.. ‘ఆమె తండ్రి పూర్తి పేరేంటి… అతని పేరు రవి జోసెఫ్… తెలివిగా దిశా,ఆమె తల్లి పూర్తి పేర్లు మాత్రమే చెప్పి తండ్రి పూర్తి పేరును దాచావు…’ అంటూ విమర్శించారు.

దిశా రవి మతంపై న్యాయవాది ప్రసన్న…
దిశా రవి క్రిస్టియన్ అంటూ సాగుతున్న ప్రచారంపై ‘ది న్యూస్ మినిట్’ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ మీడియా సంస్థ దిశా రవి కుటుంబానికి సన్నిహితురాలైన ప్రసన్న ఆర్ అనే న్యాయవాదిని సంప్రదించి ఈ విషయాలపై ఆరా తీసింది. ‘ఆమె తల్లి పేరు మంజుల నంజయ్య,తండ్రి రవి. వారు కర్ణాటకలోని తూమకూరు జిల్లా తిప్తూరుకు చెందినవారు. లింగాయత్ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె ఏ మతాన్ని ఆచరించలేదు. ఆమె మతపరమైన గుర్తింపుపై కట్టుకథలతో ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.’ అని వ్యాఖ్యానించారు. అసలు ఇక్కడ మతం విషయం ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించిన ప్రసన్న… ఆమె ఏ మతానికి చెందినవారైతే ఏంటి అని ప్రశ్నించారు.దిశా రవి స్నేహితులు,కుటుంబం కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

ఆమె హిందూనే… : దిశా స్నేహితుడు
పర్యావరణ కార్యకర్త ముసుగులో దిశా రవి పనిచేస్తున్నారని… ఆమెకు విదేశీ నిధులు కూడా అందుతున్నాయంటూ కొన్ని ఛానెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె కుటుంబం పేర్కొంది. ఇది చాలా దారుణమని వాపోయింది. దిశా రవి ఒక సింగిల్ మదర్ అని కూడా ఆమెపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె స్నేహితులు చెప్పినట్లుగా ది న్యూస్ మినిట్ రిపోర్ట్ చేసింది. ఆమె పేరు దిశా అన్నప్ప రవి.. ఆమె ఒక హిందూ… ఆమె తండ్రి పేరు దిశ అన్నప్ప అని వారు చెప్పినట్లు పేర్కొంది.