మీరట్ లో దారుణం .. బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నలుగురు యువకులు
మీరట్ లో ట్యూషన్ క్లాస్ కు వెళ్లి తిరిగి వెళ్తుండగా ఒక 10 వ తరగతి విద్యార్థినిని ఎత్తుకెళ్ళిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ట్యూషన్ కి వెళ్లిన బాలిక 5.30 గంటల సమయంలో ట్యూషన్ నుండి తిరిగి వస్తున్న క్రమంలో నలుగురు యువకులు ఆమెను అడ్డగించి ఆమెను కిడ్నాప్ చేశారు . ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తనను విడిచిపెట్టాలని ఎంత ప్రాధేయపడినా, వదిలిపెట్టని కామాంధులు సామూహికంగా అత్యాచారం చేశారు. లైంగికంగా వేధింపులకు గురి చేశారు .

బాలిక గ్యాంగ్ రేప్ తర్వాత సూసైడ్ చేసుకుందన్న పోలీసులు
అయితే ఆ పై బాలికకు విషమిచ్చి ఆమె చనిపోయేలా చేశారని బంధువులు ఆరోపిస్తుంటే, బాలిక తనకు తానే స్వయంగా సూసైడ్ చేసుకుందని, సూసైడ్ నోట్ కూడా రాసిందని పోలీసులు చెబుతున్నారు.
బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి నలుగురు యువకులు పాల్గొన్నారని, బాలిక రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా గుర్తించిన పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారని, మరో ఇద్దరిని అరెస్టు చేయడానికి గాలింపు ప్రారంభించారని సీనియర్ పోలీసు అధికారి కేశవ్ కుమార్ తెలిపారు.

బాలిక సూసైడ్ నోట్ లో రేప్ చేసిన వాళ్ళ పేర్లు రాసిందన్న పోలీసులు
చనిపోయేముందు బాలిక సూసైడ్ నోట్ రాసిందని తన సూసైడ్ నోట్లో, పొరుగు గ్రామానికి చెందిన లఖన్, వికాస్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, వారి కోసం గాలింపు చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యాచారం అనంతరం బాలిక ఇంటికి తిరిగి వచ్చిందని, ఆమె ఈ సంఘటన గురించి తల్లిదండ్రులకు తెలియజేసిందని చెప్పారు. ఆ తర్వాత తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె తల్లిదండ్రులను ఆసుపత్రికి తీసుకు వెళ్ళమని తానే స్వయంగా చెప్పిందని అక్కడ చికిత్స సమయంలో ఆమె మరణించిందని పోలీసులు చెబుతున్నారు.

రేప్ చేసి బాలికతో బలవంతంగా వారే విషం తాగించారని బంధువుల ఆరోపణ
అయితే బాలిక తరపు బంధువులు మాత్రం పోలీసులు చెప్తున్న విషయంతో విబేధిస్తున్నారు. అమ్మాయి సూసైడ్ చేసుకోలేదని , వారే బలవంతంగా విషం త్రాగించారని అంటున్నారు. అమ్మాయి తండ్రి నాసిక్ లో కూలీగా పని చేస్తున్నాడని , బాలిక చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేదని, బాలిక ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో నిత్యం ట్యూషన్ కి వెళ్లి వస్తుండేది అని పేర్కొన్నారు. నిందితులు ఉపాధ్యాయుని ఇంటి దగ్గరలోనే నివసించేవారు అని , వారు పక్కా ప్లాన్ ప్రకారం బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశారని, ఆపై విషం తాగాలని బాలికను బలవంత పెట్టారని ఈ విషయం బాలిక తాము స్వయంగా చెప్పిందని బంధువులు చెబుతున్నారు.

కామాంధుల చేతిలో మరో మైనర్ బాలిక బలి.. కేసు నమోదు , ఇద్దరు అరెస్ట్
ఏది ఏమైనా నలుగురు కామాంధుల చేతిలో అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైన బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చివరకు ప్రాణాలు వదిలింది. ఇక ఈ కేసులో నిందితులను పట్టుకుని శిక్షపడేలా చేస్తామని చెబుతున్న పోలీసులు ఐపీసీ మరియు పోక్సో చట్టం 2012 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఇప్పటికి ఇద్దరినీ అరెస్ట్ చేశారు . మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు . పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు చెప్తున్నారు.