Tuesday, May 24, 2022

డాక్టర్ స్వాతి మోహన్: ‘‘భూమి మీద నుంచి సూక్ష్మజీవులు మార్స్ మీదకు చేరకుండా చూడటం చాలా కష్టమైన పని’’– బీబీసీ ఇంటర్వ్యూలో నాసా శాస్త్రవేత్త

International

-BBC Telugu

By BBC News తెలుగు

|

డాక్టర్ స్వాతి మోహన్

Click here to see the BBC interactive

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్స్ మిషన్ విజయవంతమైంది. ఈ సంస్థ పంపిన పెర్సెవీరన్స్ రోవర్ అంగారక గ్రహంపై సురక్షితంగా దిగింది.

అయితే, ఈ ప్రాజెక్టులో భారత మూలాలున్న శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక పాత్ర పోషించారు. అమెరికాలోని లాస్ ఏంజలస్‌లో ఉంటున్న ఆమె, వాషింగ్టన్‌లోని బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరేతో మాట్లాడారు.

వారి సంభాషణ సారాంశం ఇది..

ఏళ్ల తరబడి నిర్విరామంగా పనిచేసిన తర్వాత ఇంత భారీ విజయం సాధించారు. ఈ ప్రాజెక్టులో చివరి కొన్ని గంటలు ఎలా గడిచాయి?

అది కాస్త అధివాస్తవికంగా అనిపించింది. ఆ విజయం నిన్న స్పష్టంగా కనిపించింది. అదో సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ తుది క్షణానికి చేరుకోవటానికి చేసిన కృషి అసలైన విజయం అని నా అభిప్రాయం. ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన వేలాది మంది అకుంఠిత దీక్షతో పూర్తిగా అంకితమయ్యారు. ప్రతి ఒక్కరు అత్యున్నత స్థాయి కృషిచేయాల్సి వచ్చింది.

ఆ చివరి నిమిషాల్లో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో మాకు వివరించగలరా?

మిషన్ కమాండర్‌గా.. వాస్తవంగా ఏం జరుగుతోంది, దాని ఆధారంగా నేనేం చెప్పాలి అనే దాని మీద నేను చాలా ఎక్కువగా దృష్టి పెట్టానని అంగీకరించాల్సిందే. ఖచ్చితమైన క్రమంలో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒకటి అవగానో ఆ తర్వాతి దాని మీదకు నా దృష్టి వెళ్లిపోతుంది. ‘ఇది అయింది.. అది జరగాలి. ఆ తర్వాతిది ఇది. వరుసగా జరుగుతూ పోవాలి’. ఏం జరుగుతోందనేదాని గురించి భావోద్వేగానికి లోనయ్యేంత అవకాశం నాకు లేదు. కాబట్టి.. రోవర్ ఆ గ్రహం మీదకు దిగిందని నేను చెప్పాక, జనం హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నపుడు కానీ.. మేం ఈ పని చేశామని నాకు అర్థం కాలేదు.

స్వాతి మోహన్

ఈ ప్రాజెక్టులో ఎనిమిదేళ్లుగా భాగస్వామిగా ఉన్నానని మీరు చెప్పారు. ఒక ప్రాజెక్టు కోసం ఇంత ఎక్కువ సమయం వెచ్చించారు…

నాకు చాలా గర్వంగా ఉంది. చాలా సంతోషంగా సాగింది. ఎనిమిదేళ్లుగా ప్రతి రోజూ ఈ బృందంతో, పనిలో ఈ కుటుంబంతో గడిపాను. వచ్చే వారం మేమందరం మా వేర్వేరు మార్గాల్లోకి వెళ్లిపోతామంటే కొంత బాధగా ఉంది. కానీ ఇందులో భాగం కావటం నా కెరీర్‌లో నా జీవితంలో చాలా విశిష్టమైన అవకాశం.

మొదటిగా నేను త్యాగం చేసిందంటే బహుశా నా నిద్రనేమో. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విడిభాగాలు రావటం మొదలైనప్పటి నుంచీ.. నేను ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నాను. ఎందుకంటే మేం నిరంతరం అనేక పరీక్షలు చేస్తూనే ఉన్నాం. నా ఫోన్ ఎల్లప్పుడూ నా పక్కనే ఉండేది. బ్యాటరీలు ఏళ్ల తరబడి చార్జ్ అవుతూనే ఉండేవి. ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాల్సి రావటం కాస్త కష్టంగానే ఉండేది. నా కుటుంబం కూడా త్యాగాలు చేసింది. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు, ఎప్పుడుపడితే అప్పుడు ఇంటిని, కుటుంబ సభ్యులను ఉన్నపళంగా వదిలిపెట్టి ల్యాబ్‌కు వెళ్లాల్సి వచ్చినపుడు నా కుటుంబం ఎంతగానో మద్దతునిచ్చింది.

స్వాతి మోహన్

నాసాలో మీ ప్రయాణం గురించి చెప్తారా? ఈ ప్రయాణంలో మీరు సాధించిన విజయాలు ఏమిటి?

హైస్కూలులో జూనియర్‌గా ఉన్న సమయంలో అంతరిక్ష పరిశోధనలో నా కెరీర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. అమెరికాలో నివసిస్తున్నాను కాబట్టి అంతరిక్షం అంటే నాసానే. కాబట్టి నాసా గురించి నేను చేయగలిగనంత పరిశోధన చేశాను. నేను హైస్కూలులో ఉన్నపుడే నాసా గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో తొలి ఇంటర్న్‌షిప్ చేశాను. ఆ తర్వాత కార్నెల్ యూనివర్సిటీలో అండర్‌గ్రాడ్యుయేట్ చదువుతూ వేసవి కాలంలో జెట్ ప్రొపల్షన్ లాబరేటరీలో గడిపాను. అక్కడ చాలా మందిని కలిశాను. కెన్నడీ స్పేస్ సెంటర్‌లో కూడా ఒక ఇంటర్న్‌షిప్ చేశాను. గ్రాడ్యుయేట్ స్కూలుకు వెళ్లాక నాసా జాన్సన్ స్పేస్ సెంటర్, నాసా మార్షల్ స్పేస్ సెంటర్‌లను సందర్శించాను. ఈ అంతరిక్ష రంగాలను విభిన్న దృక్కోణాల నుంచి, వేర్వేరు నాసా సెంటర్ల నుంచి, కార్నెల్, ఎంఐటీ వంటి సంస్థలు చేస్తున్న విభిన్న పరిశోధనల నుంచి చూసేందుకు లభించిన ఈ అవకాశాలన్నీ.. నా ఆసక్తిని, శక్తిసామర్థ్యాలను నేను తెలుసుకోవటానికి సాయపడ్డాయి.

స్టార్ ట్రెక్ ద్వారా మీరు స్ఫూర్తి పొందారా? ఇంకా చాలా చిన్నవయసులోనే పొందిన స్ఫూర్తితో ఈ విజయపథంలో పయనించారా?

అవును. నాకు తొమ్మిది, పదేళ్ల వయసున్నపుడు స్టార్ ట్రెక్ – ద నెక్స్ట్ జనరేషన్ ఎపిసోడ్‌ చూశాను. ఆ ఎపిసోడ్‌లో ఎంటర్‌ప్రైజ్‌ను గెలాక్సీలో సూదూరాలకు తోసివేస్తారు. అందులో విభిన్న నేపథ్యాల్లో అంతరిక్షానికి సంబంధించి అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఎంటర్‌ప్రైజ్‌లో ముందు భాగాన నిలబడి అదంతా చూడాలని నేను అనుకోవటం నాకు బాగా గుర్తుంది. అక్కడే నా ప్రయాణం మొదలైంది. ఆ దృశ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆకాశంలోకి చూసేదాన్ని. అలా నేను హబుల్ స్పేస్ టెలిస్కోప్ గురించి తెలుసుకున్నాను. అక్కడి నుంచి నా పరిశోధన పెరుగుతూ వచ్చింది.

స్వాతి మోహన్

మీరు కేవలం ఏడాది వయసున్నపుడు అమెరికా వచ్చారని నాకు తెలిసింది. భారతదేశంతో మీ సంబంధాలను ఇంకా కొనసాగిస్తున్నారా?

మాకు ఇంకా ఇండియాలో చాలా పెద్ద కుటుంబం, బంధువులు ఉన్నారు. ముఖ్యంగా బెంగళూరులో. మా తాత వాళ్లు అక్కడే నివసిస్తున్నారు. చాలా కాలంగా. వేసవి సెలవుల్లో ఇండియాలోనే ఉండేదాన్ని. చాలా ప్రాంతాలకు వెళ్లేదాన్ని. అక్కడి మా బంధువులను కలుస్తుండేదాన్ని.

వారి నుంచి ఫోన్లు వచ్చాయా?

నాకు శుభాకాంక్షలు, అభినందనలు, ప్రేమాభినాలు తెలియజేస్తూ ఫోన్ కాల్స్ ముంచెత్తుతున్నాయి. ఇంతటి గొప్ప ఆదరాభిమానాలతో నేను ఇప్పటికీ కొంచెం సంభ్రమాశ్చర్యాల్లోనే ఉన్నాను.

ఈ మిషన్ సందర్భంగా.. మీకు అత్యంత సవాలుగా నిలిచిన సాంకేతికపరమైన అంశం ఏదైనా ఉందా? దానిని ఎలా అధిగమించారో చెప్తారా?

పారాచూట్‌ను అభివృద్ధి చేస్తున్నపుడు మాకు అర్థంకాని అంశాలేవో ఉన్నాయని మేం తెలుసుకున్నాం. ఇందులో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరముందా అనేది నిర్ధారించుకోవటానికి మరో పరీక్ష కార్యక్రమాన్ని పూర్తిగా చేపట్టాల్సి వచ్చింది. సాంపిల్ కాషింగ్ వ్యవస్థ పూర్తిగా కొత్తది. మునుపెన్నడూ తయారు చేయలేదు. సమూలంగా డిజైన్ చేయాల్సి వచ్చింది. అలాగే.. పరిశుభ్రత అంటే ఏమిటి, ఆ శుభ్రతను ఎలా నిర్వహించాలి అనేది కూలంకషంగా అర్థంచేసుకోవాలి. భూమి మీద నుంచి ఎలాంటి సూక్ష్మజీవులూ ఇందులోకి చేరి, మార్స్ మీదకు వెళ్లకుండా చూసుకోవటం చాలా కీలకమైన విషయం. ఈ రంగం గురించి మొత్తంగా ఆలోచించి, పనిచేయాల్సి వచ్చింది. ఇవి రెండు ఉదాహరణలు.

స్వాతి మోహన్

మార్స్ మీదకు ఇలా రోవర్‌ను పంపించాలనే ఆకాంక్షలు భారత్ వంటి దేశాలకు కూడా ఉన్నాయి. ఈ విషయంలో మీరు విజయవంతమైన బృందంలో సభ్యురాలిగా ఉన్నారు. మీరు ఏం సూచిస్తారు?

ఏదైనా అంతరిక్ష బాడీ మీదకు దిగటం, దేనినైనా పంపించటం చాలా కష్టం. చాలా అంశాలు ఖచ్చితంగా జరగాల్సి ఉంటుంది. ప్రతి అంతరిక్ష బాడీకి, దాని మీద ప్రతి చోటుకూ, అక్కడికి వెళ్లటానికి మనం చేసే ప్రతి ప్రయత్నానికీ.. అక్కడ దిగటానిక వేర్వేరు పరిస్థితులు ఉంటాయి. విభిన్నమైన పరిమితులు ఉంటాయి. భిన్నమైన సవాళ్లు ఉంటాయి. మనం ఎంచుకునే ప్రాంతం, తేదీని బట్టి అవన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ తరహా అనుభవం ఉన్న వారి నుంచి సాధ్యమైనంత ఎక్కువగా నేర్చుకోవటానికి ప్రయత్నించాలని, ఆశలు వదులుకోవద్దని నేనివ్వగల ఉత్తమ సలహా. కొన్నిసార్లు మనం మన విజయాలకన్నా గానీ.. మన సొంత వైఫల్యాల నుంచి మరింత ఎక్కువ నేర్చుకుంటాం.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe