రానున్న ఏప్రిల్ నెలలో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తామని డిటెల్ ఈవీ పేర్కొంది. ముంబైలో జరిగిన 2021 ఇండియా ఆటో షోలో డిటెల్ తమ ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. గతంలో డిటెల్ ఆవిష్కరించిన ఈజీ ఎలక్ట్రిక్ మోపెడ్ కంటే ఈజీ ప్లస్ మోపెడ్ మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

డిటెల్ ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ మోపెడ్ పూర్తి చార్జ్‌పై 60 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 350 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది మరియు 20 ఆంపియర్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇందులోని బ్యాటరీని సీట్ క్రింది భాగంలో అమర్చారు.
ఈ మోపెడ్ ముందు మరియు వెనుక వైపు అల్లాయ్ వీల్స్ ఉంటాయి, వాటిపై ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించారు. బ్రేక్స్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. దీనిని నడపటానికి రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం ఉండదు.

ఈ మోపెడ్ కొనుగోలుతో కంపెనీ స్టాండర్డ్ 5 ఆంపియర్ చార్జర్‌ను అందిస్తోంది. దీని లోడ్ కెపాసిటీ 150 కిలోలు. డిటెల్ ఈవీ తమ ఈజీ ప్లస్ మోపెడ్ కొనుగోలుపై 1 సంవత్సరం వారంటీని మరియు బ్యాటరీపై 3 ఏళ్ల వారంటీని అందిస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకవేళ మోపెడ్‌లోని బ్యాటరీ చార్జ్ అయిపోతే, దానిని పెడల్స్ సాయంతో తొక్కుకుంటూ గమ్యం చేరుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ ఎల్లో, రెడ్, టీల్ బ్లూ మరియు రాయల్ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

కాగా, దీని ధర ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. విడుదల సమయంలో డిటెల్ ఈజీ ప్లస్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను ఏప్రిల్ 2021 నెలలో వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది. డిటెల్ ఈజీ మాదిరిగానే సరసమైన ధరకే ఈజీ ప్లస్‌ను కూడా అందుబాటులోకి తెస్తామని డిటెల్ ఈవీ పేర్కొంది.

ఈజీ ప్లస్‌తో పాటుగా ఈజీ అనే ఎలక్ట్రిక్ మోపెడ్‌ను కూడా కంపెనీ విక్రయిస్తోంది. డిటెల్ ఈజీ ఈ-స్కూటర్‌ను ప్రధానంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరియు ఫ్లీట్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లో ప్రవేశపెట్టారు. డిటెల్ ఈజీ జెట్ బ్లాక్, పెరల్ వైట్ మరియు మెటాలిక్ రెడ్ అనే మూడు రంగులో లభిస్తుంది.

డిటెల్ ఈజీ ఎలక్ట్రిక్ స్కూటర్లో 250 వాట్ హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 48 వోల్ట్ 12 ఆంప్ లైఫ్‌పిఓ4 బ్యాటరీతో పనిచేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, డిటెల్ ఈజీ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై 60 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయటం కోసం సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.