PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

డీమ్యాట్ ఖాతాను వాడకపోతే ఇవాళే దాన్ని క్లోజ్‌ చేయండి, ప్రాసెస్‌ ఇదే


Demat Account: బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి బ్యాంక్‌ ఖాతా అవసరం. బ్యాంక్ ఖాతా లేకుండా మీరు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయలేరు. అదే విధంగా, షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి మీకు ఒక డీమ్యాట్ ఖాతా అవసరం. మీరు కొనుగోలు చేసిన షేర్లను ఉంచే ఖాతా డీమ్యాట్ ఖాతా. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య వేగంగా పెరిగింది. గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 11 కోట్లు దాటింది. వార్షిక ప్రాతిపదికన డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 31 శాతం పెరిగింది. 

ఈ మొత్తం 11 కోట్ల డీమ్యాట్ అకౌంట్లలో… చాలా ఖాతాలు బాగా పాతవి, సంవత్సరాల తరబడి ఉపయోగించకుండా వదిలేసినవి, చాలా అరుదుగా మాత్రమే ఉపయోగించేవి కూడా ఉన్నాయి. అంటే యాక్టివ్‌గా లేని ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇలా, మీరు ఉయోగించని డీమ్యాట్‌ ఖాతా ఉంటే దానిని వెంటనే క్లోజ్‌ చేయండి.

ఉపయోగించని డీమ్యాట్ ఖాతాను ఎందుకు మూసేయాలి?
మీరు ఒక డీమ్యాట్ ఖాతాను తీసుకున్న తర్వాత దానికి ఏటా కొంత మొత్తాన్ని వార్షిక నిర్వహణ ఛార్జీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఖాతాను మీరు వాడినా, వాడకపోయినా ఛార్జీలు మాత్రం వర్తిస్తాయి. ఒకవేళ ఆ ఖాతాలో నగదు లేకపోతే, మైనస్‌ రూపంలో అది పేరుకుపోతుంది. మీరు ఎప్పుడైనా షేర్లు కొనడానికి మీ డీమ్యాట్‌ ఖాతాకు నగదు బదిలీ చేస్తే, అప్పటి వరకు చెల్లించాల్సిన ఛార్జీలు మొత్తం ఒకేసారి ఆ డబ్బు నుంచి కట్‌ అవుతాయి. కాబట్టి, డీమ్యాట్‌ ఖాతాను ఉపయోగించని పక్షంలో దాన్ని మూసివేయడం తెలివైన వ్యక్తి లక్షణం. దీనివల్ల మీ డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా ఆగుతుంది. డీమ్యాట్ ఖాతాను మూసివేసే ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం.

డీమ్యాట్ అకౌంట్‌ను ఎలా క్లోజ్‌ చేయాలి?
డీమ్యాట్ ఖాతాను మూసివేసే ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది, దానిని ఆన్‌లైన్‌ చేయడం కుదరదు. డీమ్యాట్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేయాలని మీరు భావిస్తే, NSDLకు చెందిన DP (డిపాజిటరీ పార్టిసిపెంట్స్) ఆఫీసుకు మీరు వెళ్లాలి. అక్కడ, మీ డీమ్యాట్ ఖాతా ముగింపు ఫారం ‍‌(Demat Account Closing Form) ఉంటుంది. దానిని పూరించి, మీ ఖాతాకు సంబంధించిన అవసరమైన పత్రాలను జత చేసి అదే ఆఫీసులో సమర్పించాలి. డీమ్యాట్ ఖాతా ముగింపు ఫారాన్ని డిపాజిటరీ పార్టిసిపెంట్ వెబ్‌సైట్ నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానిని ఇంటి వద్దే పూరించి DP కార్యాలయంలో సమర్పించవచ్చు. 

డీమ్యాట్ ఖాతా ముగింపు ఫారంలో.. మీ DP ID, క్లయింట్ IDని ఇవ్వాలి. మీ పేరు, చిరునామా తదితర వివరాలను కూడా నింపాల్సి ఉంటుంది. దీంతో పాటు, మీరు ఖాతాను ఎందుకు మూసివేస్తున్నారో కూడా చెప్పాలి. డీమ్యాట్ ఖాతా మూసివేత అభ్యర్థన ఫారం మీద మర్చిపోకుండా సంతకం చేయండి. మరొక విషయం కూడా కచ్చితంగా గుర్తుంచుకోవాలి. డీమ్యాట్‌ ఖాతాలో సొమ్మును పూర్తిగా వినియోగించుకున్న తర్వాత లేదా వేరే ఖాతాకు మళ్లించిన తర్వాతే ఆ అకౌంట్‌ను క్లోజ్‌ చేయండి.

డీమ్యాట్‌ అకౌంట్‌ ఎన్ని రోజుల్లో క్లోజ్‌ అవుతుంది?
డీమ్యాట్ ఖాతాను మూసివేయమని మీరు అభ్యర్థించిన రోజు నుంచి మొత్తం 10 రోజుల లోపు మీ ఖాతా క్లోజ్‌ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఖాతాను మూసివేయడానికి మీరు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ డీమ్యాట్‌ ఖాతాకు సంబంధించి చెల్లించాల్సిన ఛార్జీలు బకాయి ఉంటే, ఆ రుసుము చెల్లించిన తర్వాత మాత్రమే మీ ఖాతాను క్లోజ్‌ చేస్తారు. బకాయిలు ఉంటే ఖాతాను మూసివేసే ప్రక్రియ పూర్తి కాదు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *