Telangana
oi-Rajashekhar Garrepally
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం(ఫిబ్రవరి 24) నుంచి ఆరు, ఏడు, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తరగతులు ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తరగతులను రేపటి నుంచి మార్చి 1వ తేదీలోగా ప్రారంభించుకోవచ్చన్నారు మంత్రి. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అంతేగాక, తల్లిదండ్రుల అనుమతి పత్రం కూడా తప్పనిసరి అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇటీవలే 9,10 తగరతులను ప్రారంభించిన విషయం తెలిసిందే.

మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,97,712 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,94,386 మంది కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1625 మంది మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1701 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 84.7 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇక దేశ వ్యాప్తంగా కోటి 10 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులుండగా, కోటి 7 లక్షల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి లక్షా 54వేల మందికిపైగా మరణించారు. ప్రస్తుతం దేశంలో లక్షా 44వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.