2013 తరువాత తొలిసారిగా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలైలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. అప్పట్లో మూడు దశల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అప్పట్లో మొత్తం 21,441 పంచాయితీలకు ఎన్నికలను నిర్వహించారు. అందులో 2,422 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అప్పుడు కూడా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 293 గ్రామ పంచాయతీలు ఎన్నికల రహితంగా సర్పంచ్‌ను ఎన్నుకున్నాయి. శ్రీకాకుళం-202, నెల్లూరు-194 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది.

29,732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు..
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలు, 32,502 వార్డులకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఇందులో పంచాయతీల్లో 525, వార్డుల్లో 12,185 ఏకగ్రీవం అయ్యాయి. ఫలితంగా మంగళవారం 2,723 పంచాయతీలు, 20,157వార్డులకు ఎన్నికలను నిర్వహించబోతోన్నామని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. వాటి కోసం. 29,732 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కరోనా వైరస్ బారిన పడిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించామని, చివరి గంట వారికి కేటాయించామని అన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ సోకిన ఓటర్లకు పీపీఈ కిట్లను అందజేస్తామని అన్నారు.

ఫస్ట్ టైమ్ నోటా..
ఈ ఎన్నికల్లో నోటా వ్యవస్థను అమలు చేస్తున్నామని ద్వివేది తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అవుతుంది. జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పోలింగ్ కేంద్రం నుంచి అయిదు కిలోమీటర్లకు పైగా ఉన్న ఓటర్ల కోసం రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. 2,216 వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. దీనికోసం సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని వివరించారు.

కరోనా ప్రొటోకాల్ తప్పనిసరి..
ఓటర్లు, పోలింగ్ స్టేషన్ సిబ్బంది తప్పనిసరిగా కరోనా వైరస్ ప్రొటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుందని ద్వివేది స్పష్టం చేశారు. మాస్క్‌ను ధరించడం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లబోయే ముందు శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం తప్పనిసరి చేశామని అన్నారు. దీనికోసం అవసరమైన శానిటైజర్లను సిబ్బందికి పంపిణీ చేసినట్లు చెప్పారు. పోలింగ్ సిబ్బందికి ప్రత్యేకంగా గ్లౌజ్‌లను అందించామని అన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని ద్వివేది తెలిపారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళి, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు